పీఆర్సీ అమలుపై ఏపీ సీఎస్ ప్రాథమిక సమీక్ష
- త్వరలో మంత్రుల కమిటీ ఏర్పాటు
- ఒక్క శాతం ఫిట్‌మెంట్‌కు అదనపు భారం నెలకు రూ. 8.96 కోట్లు
సాక్షి, హైదరాబాద్: పదో వేతన సవరణ సంఘం(పీఆర్సీ) అమలు దిశగా ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. పీఆర్సీ అమలు చేస్తే ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుందనే విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు గురువారం ఆర్థిక శాఖ అధికారులతో ప్రాథమికంగా సమీక్షించారు. ఒక శాతం ఫిట్‌మెంట్‌కు నెలకు 8.96 కోట్ల అదనపు భారం పడుతుందని ఆర్థిక శాఖ అధికారులు సీఎస్‌కు వివరించారు.
ప్రస్తుతం 27 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) ఇస్తున్నారని, 29 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని పదో పీఆర్సీ సిఫార్సు చేసిందని తెలిపారు. వాస్తవానికి 2013 జూలై నుంచి కొత్త పీఆర్సీ అమల్లోకి రావాల్సి ఉన్నా.. ప్రభుత్వానికి నివేదిక అందడంలో జాప్యం జరిగిందని, రాష్ట్ర విభజన, పాలనాపరమైన కారణాల వల్ల అమల్లో ఆలస్యం జరుగుతోందని చెప్పారు. తెలంగాణలో ఉద్యోగులకు హెల్త్‌కార్డులు ఇచ్చారని, కనీసం 35 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చే యోచనలో ఉందని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం కొత్త రాజధానికి తరలివెళ్లాల్సి ఉంటుందని, హెల్త్‌కార్డుల వ్యయంలో 40 శాతం భరించాల్సి ఉంటుందని, నిత్యావసర వస్తువుల ధరలూ మండిపోతున్నాయని.. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఫిట్‌మెంట్ నిర్ణయించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. అన్ని వివరాలతో ఫైల్‌ను తనకు పంపించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. త్వరలో ఏర్పాటయ్యే మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతుందని చెప్పారు.