పీఆర్సీ పితలాటకం | Stark account of the decision to wage employees | Sakshi
Sakshi News home page

పీఆర్సీ పితలాటకం

Published Sun, Jan 4 2015 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 7:10 PM

Stark account of the decision to wage employees

  • అరకొర లెక్కలతో ఉద్యోగుల వేతన నిర్ణయం
  • సాక్షి, హైదరాబాద్: కుటుంబమంటే ముగ్గురు వ్యక్తులేనా? నెలవారీగా కుటుంబానికి సరిపడే కూరగాయలు రూ. 838లకే వచ్చేస్తాయా? కుటుంబానికి నెలకు 42.75 కేజీల బియ్యం సరిపోతాయా? కిలో బియ్యం బహిరంగ మార్కెట్లో రూ. 34.99కే దొరుకుతున్నాయా? అంటే సంసారసాగరాన్ని ఈదే సామాన్య కుటుంబరావులెవరైనా అసాధ్యం అంటారు. అయితే పదో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) మాత్రం ఈ లెక్కల ఆధారంగానే ఉద్యోగుల వేతనాన్ని నిర్ణయించింది.

    కుటుంబానికి కనీసం నలుగురు సభ్యులుంటారని భావించి లెక్కలుగట్టాలని ఉద్యోగ సంఘాలు చేసిన విజ్ఞప్తిని పీఆర్సీ పట్టించుకోలేదు. తిండి సంగతి అటుంచితే.. కుటుంబం దుస్తుల అవసరాలకు ఏటా రూ. 17 వేలు సరిపోతాయని పీఆర్సీ నిర్ణయించింది. ఇక రూ. 770తో కుటుంబానికి నెలంతా సరిపడా పళ్లు, ఫలాలు కొనుక్కోవచ్చని అంచనా వేసింది. దీంతో కనీస వేతనం రూ. 15 వేలుగా నిర్ణయించాలంటూ ఉద్యోగ సంఘాలు చేసిన సూచననూ పట్టించుకోకుండా రూ. 13 వేలతో సరిపెట్టింది. అంతేగాక 69 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరగా, పీఆర్సీ 29 శాతం సిఫార్సు చేసింది. కాగా, ఈ సిఫార్సులతో కూడిన పాక్షిక నివేదికను శనివారం ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం ఇచ్చింది.
     
    పాక్షిక నివేదికతో చర్చలకు ఆహ్వానం
    పీఆర్సీ పూర్తి నివేదికను ఉద్యోగ సంఘాలకు ఇవ్వకుండానే ప్రభుత్వం వారిని సోమవారం చర్చలకు ఆహ్వానించింది. ఆ నివేదిక బహిరంగ పత్రమే (పబ్లిక్ డాక్యుమెంట్) అయినప్పటికీ ప్రభుత్వం తమతో దాగుడుమూతలు ఆడటాన్ని ఉద్యోగ సంఘాలు తప్పుబడుతున్నాయి.
     
    నివేదికలోని ముఖ్యాంశాలు..  
    కేంద్ర ప్రభుత్వం ఒక శాతం డీఏ పెంచితే రాష్ట్రంలో 0.524 శాతం పెంచాలని పీఆర్సీ సూత్రీకరించింది. ప్రస్తుతం 0.856 శాతం ఉంది. తాజా సిఫార్సు ఉద్యోగులకు నష్టమే.
     
    ఇంటి అద్దె భత్యం ప్రస్తుతం గరిష్టంగా రూ. 12 వేలు ఉంది. దీన్ని రూ. 20 వేలకు పెంచాలని పీఆర్సీ సిఫార్సు చేసింది. ఇంటి అద్దెను 4 స్లాబులుగా విభజించారు. జంట నగరాల్లో 30 శాతం, కార్పొరేషన్లలో 20 శాతం, మున్సిపాలిటీల్లో 14.5 శాతం, మిగతా ప్రాంతాల్లో 12 శాతం అద్దె భత్యం చెల్లించాలని సూచించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఇంటి అద్దె భత్యాన్ని 25 శాతం ఇవ్వాలని, నగర  పరిధిని పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి.
     
    ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ప్రకారం ప్రతి 6 సంవత్సరాలకు ఒక ప్రమోషన్(పోస్టుల్లేని పక్షంలో ఆమేరకు జీతపు శ్రేణి పెంచాలి) తప్పనిసరిగా ఇవ్వాలనే విధానాన్నే కొనసాగించాలని సూచించింది.
     
    గ్రాట్యుటీని రూ. 8 లక్షల నుంచి రూ. 12 లక్షలకు పెంచాలని సూచించింది. కమ్యుటేషన్ పరిమితిని ప్రస్తుతం ఉన్న 40 శాతాన్నే కొనసాగించాలంది.
     
    రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి 33 సంవత్సరాల సర్వీసు చేస్తే పూర్తి పెన్షన్(ఆఖరు నెల జీతంలో సగం)కు అర్హత లభిస్తుంది. దీనికి 5 సంవత్సరాల వెయిటేజీ ఉంది. అంటే 5 సంత్సరాల మినహాయింపు ఉంటుంది. 28 సంవత్సరాలు సర్వీసు చేసిన ఉద్యోగులకు పూర్తి పెన్షన్ లభిస్తుంది. వెయిటేజీని 8 సంత్సరాలకు పెంచాలని తాజా పీఆర్సీ సిఫార్సు చేసింది. కేంద్రం 20 సంవత్సరాల సర్వీసు ఉన్న వారికి పూర్తి పెన్షన్‌కు అర్హత కల్పిస్తోంది. అదే విధానం రాష్ట్రంలో ఉండాలని ఉద్యోగులు కోరినా పట్టించుకోలేదు.
     
    ఉద్యోగులు/పెన్షనర్ల అంతిమ సంస్కార ఖర్చును 10 వేల నుంచి 20 వేలకు పెంచాలన్న విజ్ఞప్తికి పీఆర్సీ సానుకూలంగా లేదు.
     
    రేపు ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ
    పదో పీఆర్సీ అమలుపై చర్చించడానికి ఉద్యోగ సంఘాలతో సోమవారం భేటీ కావాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.
     
    పాక్షిక నివేదికలోని ముఖ్యాంశాలు..
    కనీస వేతనాన్ని నిర్ధారించడానికి ఐఎల్‌సీ(ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్) అనుసరిస్తున్న విధానాన్ని పీఆర్సీ ఆధారంగా చేసుకుంది. అయితే కనీసం నలుగురు కుటుంబ సభ్యుల ఖర్చును ఆధారంగా చేసుకొని కనీస వేతనాన్ని నిర్ధారించాలని ఉద్యోగ సంఘాలు చేసిన విజ్ఞప్తిని పీఆర్సీ పట్టించుకోలేదు. ముగ్గురు సభ్యుల ఖర్చునే ఆధారంగా తీసుకొంది.

    గరిష్ట వేతనం రూ. 1,10,850గా,  కనీస వేతనం రూ. 13 వేలుగా నిర్ధారించింది. కనీస, గరిష్ట వేతనాల నిష్పత్తి 1:8.52గా ఉంది.

    32 గ్రేడ్లు, 80 సెగ్మెంట్లతో మాస్టర్ స్కేల్స్(మూల వేతన శ్రేణుల)ను పీఆర్సీ సిఫార్సు చేసింది.

    మాస్టర్ స్కేల్స్ ఇలా..
    రూ. 13,000-390-14,170-430-15,460-470-16,870-510-18,400-550-20,050-590
    21,820-640-23,740-700-25,840-760-28,120-820-30,580-880-33,220-950
    36,070-1,030-39,160-1,110-42,490-1,190-46,060-1,270-49,870-1,360
    53,950-1,460-58,330-1,560-63,010-1,660-67,990-1,760-73,270-1,880
    78,910-2,020-84,970-2,160-91,450- 2,330- 1,00,770-2,520-1,10,850(80)
     
     పీఆర్సీ పాక్షిక నివేదిక
     www.sakshi.comలో
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement