జాక్‌పాట్ లారీలకు రెడ్‌కార్పెట్
చోటా ట్రాన్స్పోర్టర్లపైనే కేసులు
బడాబాబులతో చెక్‌పోస్టు సిబ్బంది కుమ్మక్కు
బీవీపాళెం(తడ): బీవీపాళెం మీదుగా తమిళనాడు నుంచి ఆంధ్రాలోకి అక్రమంగా సరుకులు తరలిస్తున్న జాక్‌పాట్ వ్యాపారులకు చెక్‌పోస్టు సిబ్బంది సహకారం సంపూర్ణంగా లభిస్తోంది. గతంలో యథేచ్ఛగా అక్రమ రవాణా సాగినప్పటికీ కొంత కాలంగా ఆగకుండా వెళ్లిన వాహనాల వివరాలను పోలీస్‌స్టేషన్‌లో ఇవ్వడంతో అక్రమార్కులు కొంత ఆందోళనకు గురయ్యారు. అదే విదంగా సూళ్లూరుపేట, తమిళనాడులోని కార్నోడై ప్రాంతాల్లోని టోల్ ప్లాజాల వద్ద సీసీ కెమెరాల సాయంతో చెక్‌పోస్టులో ఆగకుండా వెళ్లిన వాహనాల వివరాలను తీసుకోవడంతో మరో మార్గాల్లో తప్పించుకునే విధానంపై దారులు వెతకడం చేశారు. కానీ ప్రస్తుతం కొంత కాలంగా బడా వ్యాపారులు చెక్‌పోస్టు సిబ్బంది సంపూర్ణ సహకారంతో చెక్‌పోస్టు మీదుగా అక్రమ రవాణా సాఫీగా చేసుకుపోతున్నారు. ఉన్నతాధికారుల వద్ద మార్కులు కొట్టేసేందుకు, బయటి నుంచి విమర్శలు రాకుండా చూసేందుకు ఒకటీ అరా చిన్నచిన్న ట్రాన్స్‌పోర్టర్లకు చెందిన లారీలను ఆపి తనిఖీలు చేస్తూ పన్ను, జరిమానాలు కట్టిస్తున్నారు. అనుమానం రాకుండా నామమాత్రంగా అప్పుడప్పుడు బడా బాబులకు చెందిన ట్రాన్స్‌పోర్టు లారీలను తక్కువ తప్పులున్న వాహనాలను పట్టుకుని తమ స్వామి భక్తిని చాటుకుంటున్నారు. మధ్యాహ్నం, రాత్రి వేళలో ఓ పద్ధతి ప్రకారం కొంత సమయం రోడ్డుపై తనిఖీ చేసే అధికారులు ఎవరూ లేకుండా బడాబాబు పార్సిల్ లారీలను రాజమార్గంలో పంపేలా సహకరిస్తున్నారు. ఇక్కడి నుంచి తప్పించుకుంటే ఈ లారీలను ఇక విజయవాడ, హైదరాబాదు వరకు ఎవరూ ఆపే సాహసం చెయ్యరు. జూలై 14న ఆరంబాకం వద్ద నాలుగు లారీలు ఆగి చెక్‌పోస్టులో వాతావరణం అనుకూలం అయ్యాక పైలెట్ సూచనతో తరలివెళ్లాయి. అనంతరం 15వ తేదీన కూడా అదే పద్దతిలో మరిన్ని వాహనాలు వెళ్లాయి. దీనిపై అప్పట్లో ఏఓ రవికుమార్ స్పందిస్తూ 16వ తేదీ నుంచి వాహనాలపై నిఘా ముమ్మరం చేసి వెళ్లిపోయిన వాహనాల వివరాలను కూడా తెలుసుకుంటానని తెలిపారు. కానీ అది నేటికీ కార్యరూపం దాల్చలేదు. గతంలో ఇలా వెళ్లిన నాలుగు వందల వాహనాల వివరాలు పదిరోజుల వ్యవధిలో సేకరించిన అధికారులు ప్రస్తుతం ఆగకుండా వెళ్లిన వాహనాలకు సంబందించి తేదీలు, వాహనాల నంబర్లు అన్నీతెలిసినా ఎందుకు చర్యలు తీసుకోలేకున్నారో అంతుబట్టడం లేదు.