jaggampet
-
జనసేన x టీఢీపీ
గండేపల్లి/గోకవరం/మదనపల్లె/పెడన/బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు)/తుమ్మపాల (అనకాపల్లి జిల్లా) : టీడీపీ–జనసేన ఆత్మియ సమావేశాలు ఇరు పార్టీ నేతల మధ్య అంతరాలను బట్టబయలు చేస్తున్నాయి. ఆ రెండు పార్టీల నేతలకు ఏ దశలోనూ అసలు పొసగడం లేదు. దీంతో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు బాహాబాహీకి దిగుతూ సమావేశాలను రసాభాసగా మార్చేస్తున్నారు. తాజాగా గురువారం జరిగిన సమావేశాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. ఆ జనసేన నేతకు టికెట్ ఇస్తే మద్దతివ్వం: టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ప్రతిజ్ఞ టీడీపీ, జనసేన పొత్తు కాకినాడ జిల్లాలో ఆదిలోనే వికటిస్తోంది. ఇటీవల పిఠాపురంలో ఈ రెండు పార్టీల సమావేశం రసాభాసగా ముగియగా, తాజాగా గురువారం జగ్గంపేట నియోజకవర్గ సమావేశానిదీ అదే పరిస్థితి. సమావేశానికి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి జ్యోతుల నెహ్రూ, ఆయన తనయుడు నవీన్‌కుమార్, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పాటంశెట్టి సూర్యచంద్ర, పెద్దాపురం, పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జిలు తుమ్మల బాబు, తంగెళ్ల ఉదయశ్రీనివాస్ హాజరయ్యారు. గోకవరం మండల జనసేన పార్టీ కన్వినర్ ఉంగరాల మణిరత్నంపై ఇటీవల టీడీపీ నేత గణేష్ దాడి చేసిన అంశాన్ని సమావేశం ప్రారంభంలోనే సూర్యచంద్ర ప్రస్తావించారు. నెహ్రూ ప్రసంగిస్తుండగానే.. దాడి వ్యవహారాన్ని తేల్చాలంటూ పట్టుబట్టారు. జ్యోతుల నవీన్ కలుగజేసుకోవడంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. సూర్యచంద్రను నవీన్ గెంటివేయడంతో ఒక్కసారిగా ఇరు పార్టీ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. జనసేన టికెట్టు సూర్యచంద్రకు ఇస్తే మద్దతిచ్చేది లేదంటూ జ్యోతుల నెహ్రూ ప్రతిజ్ఞ చేశారు. దీంతో సూర్యచంద్ర, ఆ పార్టీ నాయకులు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. మాకన్నా తక్కువ స్థాయి నేతకు మైక్ ఎలా ఇస్తారు? అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో జరిగిన టీడీపీ–జనసేన ఆత్మియ సమావేశంలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు దొమ్మలపాటి రమేష్, షాజహాన్‌బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు హాజరయ్యారు. జనసేన నుంచి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్, రాయలసీమ కోకన్వినర్ గంగారపు రాందాస్‌చౌదరి, చేనేత విభాగం అధ్యక్షుడు అడపా సురేంద్ర పాల్గొన్నారు. మొదట రాందాస్‌చౌదరి, తర్వాత రమేష్ ప్రసంగించారు. తర్వాత జనసేన తరఫున శివరాం, సురేంద్రకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. దీనిని మైఫోర్స్ మహేష్ తమ్ముడు, అతడి అనుచరులు తీవ్రంగా వ్యతిరేకించారు. తమ నాయకుడికి కాకుండా తమకంటే తక్కువ స్థాయి నాయకుడికి మైక్ ఎలా ఇస్తారంటూ రాందాస్‌చౌదరిపై తిరుగుబాటు చేయడమేగాక.. గొడవకు దిగారు. కాగా, జనసేన మదనపల్లె అభ్యరి్థగా ప్రచారం చేసుకుంటున్న రామాంజనేయులు, దారం అనిత వర్గం సమావేశానికి డుమ్మా కొట్టారు. కుర్చిలతో కుమ్ములాట కృష్ణా జిల్లా పెడనలో సమావేశం జరుగుతుందని టీడీపీ, జనసేన పార్టీలోని కొందరికి సమాచారం వెళ్లింది. మరికొంతమంది ముఖ్య నేతలకు సమాచారం చేరకపోవడంతో.. తమ నాయకుడికి ఎందుకు సమాచారం ఇవ్వలేదని నిలదీసేందుకు టీడీపీలోని మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ వర్గానికి చెందిన కొందరు ఫంక్షన్ హాలుకు చేరుకున్నారు. జనసేన పెడన నియోజకవర్గ ఇన్చార్జిగా ఇటీవల ఉరివి సర్పంచ్ సురేష్‌ను నియమించడం తెలిసిందే. నియోజకవర్గంలో పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు నిర్వహించిన రామ్‌సుదీర్‌ను కాదని వేరే వారికి పదవి ఇవ్వడంపై రామ్సు«దీర్ వర్గీయులు ఆగ్రహంగా ఉన్నారు. టీడీపీ నేతలు జనసేన ఇన్చార్జి సురేష్ వేదికపైకి ఆహ్వనించి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు యత్నించారు. దీంతో రామ్‌సుదీర్ వర్గీయులు గొడవకు దిగారు. ఆ సమయంలోనే జనసేన జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ సభావేదిక వద్దకు చేరుకున్నారు. సురేష్‌ను ఏ విధంగా పెడనకు ఇన్చార్జిగా నియమించారంటూ రామ్సు«దీర్ వర్గీయులు నిలదీశారు. అక్కడే ఉన్న జనసేనలోని మరో వర్గం వారు కూడా రామ్‌సుదీర్ వర్గంతో గొడవకు దిగడంతో రసాభాసగా మారింది. ఒక వర్గంపై మరో వర్గం వారు కుర్చిలు విసురుకున్నారు. జనసేన వాళ్లు కుమ్ములాడుకుంటున్న సమయంలో టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు సభా వేదిక వద్దకు వచ్చారు. పరిస్థితి చేయి దాటిపోతోందని గమనించి బయటకు వెళ్లిపోయారు. జనసేన రాష్ట్ర నేత పిలిచినా.. డోంట్ కేర్! విశాఖ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన పార్టీల ఆత్మియ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ వచ్చారు. ఆయన రాగానే జనసేన నాయకులు లేచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ పక్కన కుర్చీ వేశారు. అయితే మూర్తియాదవ్ అక్కడ కాకుండా లైన్ చివరిలో కూర్చున్నాడు. సత్యనారాయణ పలుమార్లు పిలిచినా కనీసం ఆయన వైపు కూడా మూర్తియాదవ్ చూడలేదు. టీడీపీ నాయకులు సైతం పిలిచినా ఆయన స్పందించలేదు. జనసేన నేతలకు అధిష్టానం షోకాజ్.. సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని అడిగిన అనకాపల్లి నియోజకవర్గంలోని జనసేన నేతలకు పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసులిచ్చింది. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న తమకు షోకాజ్ నోటీసులిచ్చి అవమానించడం అన్యాయమని దూలం గోపీనాథ్, మళ్ల శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆటో ఢీకొని వ్యక్తి మృతి
జగ్గంపేట (తూర్పుగోదావరి) : వేగంగా వెళ్తున్న ఆటో రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలోని దేవి సెంటర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న పైడా నాగేశ్వరరావు(45)ను లింగంపర్తి నుంచి పెద్దాపురం వెళ్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పుష్కర కాలువలో విద్యార్థి గల్లంతు
జగ్గంపేట (తూర్పు గోదావరి) : స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన బాలుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సలాడి వీరబాబు(16) ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి శుక్రవారం పుష్కర కాలువలో ఈత కొట్టడానికి వెళ్లి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు బాలుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
వ్యాను ఢీ: భవానీ భక్తులకు తీవ్రగాయాలు
జగ్గంపేట (తూర్పు గోదావరి) : తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట సమీపంలో వ్యాను ఢీకొనడంతో భవానీ దీక్షలో ఉన్న ఇద్దరు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. పత్తిపాడు మండలం వొమ్మంగి గ్రామం నుంచి 14 మంది భవానీ దీక్షాపరులు ఇరుముడి తీసుకుని శనివారం ఉదయం పాదయాత్రగా విజయవాడ ఇంద్రకీలాద్రికి బయల్దేరారు. జగ్గంపేట సమీపంలో వెనుక నుంచి వచ్చిన వ్యాను ఢీకొనడంతో సుంకర రమేష్ (25), రాజు (16)కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని పెద్దాపురం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ జీజీహెచ్‌కు తరలించే ఏర్పాటు చేశారు. -
స్కూల్ బస్సు బోల్తా: ఒకరి మృతి
జగ్గంపేట: తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం జె.కొత్తూరు గ్రామం వద్ద బుధవారం ఉదయం ఓ స్కూల్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. స్వామి వివేకానంద స్కూల్ కు చెందిన బస్సు పిల్లలను తీసుకు రావడానికి వెళుతుండగా మార్గ మధ్యంలో చెట్టును ఢీకొని బోల్తాపడింది. అదే సమయంలో చెట్టు కింద ఉన్నదిమ్మెపై కూర్చున్న కె.నారాయణ (75) అనే వ్యక్తి పై బస్సు పడటంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్‌కు స్వల్ప గాయలయ్యాయి. ప్రమాదం అనంతరం డ్రైవర్ పరారయ్యాడు. స్థానికులు సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేశారు. -
ఆ ‘తోట’కు ఈ ‘తోట’కు మధ్య...
*బాబాయ్‌కి ఝలక్ *తోట నరసింహంపై పోటీకి తోట రవి సిద్ధం *జిల్లా కాంగ్రెస్ నేతల మంతనాలు జగ్గంపేట : రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదనేది నానుడి. తమ స్వార్థ ప్రయోజనాలు కోసం రాజకీయ భవితవ్యాన్ని, పేరు ప్రతిష్టలు ఇచ్చిన పార్టీలను మార్చేసే నేతలకు బదులిచ్చేందుకు వారి కుటుంబ సభ్యులే సై అంటున్న పరిస్థితులు తెరపైకి వస్తున్నాయి. దివంగత మాజీ ఎమ్మెల్యే తోట వెంకటాచలం రాజకీయ వారసుడిగా ఆరంగేట్రం చేసి రెండు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి పదవిని కాంగ్రెస్ పార్టీలో అందిపుచ్చుకున్న తోట నరసింహం ఉన్నట్టుండి ఒక్కసారిగా పార్టీ కండువా మార్చేశారు. అభిమానులు ఒత్తిడి అనే పదాన్ని ప్రయోగించి తన రాజకీయ భవిష్యత్ కోసం మార్గాన్ని సుగమం చేసుకునేందుకు టీడీపీ పంచన చేరారు. రెండు కళ్ల సిద్ధాం తం అంటూ చంద్రబాబును నాడు విమర్శించి నేడు ఆయన ద్వారానే అభివృద్ధి జరుగుతుందని వేదాలు వల్లిస్తున్న నరసింహానికి ఇంటి పోరు మొదలైంది. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే సామెతను ఆచరణలోకి తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలు నరసింహం కుటుంబం నుంచే ఆ పార్టీకి నాయకుడిని బరిలో దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జగ్గంపేట నుంచి అసెంబ్లీ స్థానానికి ఆయనకు వరసకు కుమారుడయ్యే తోట సూర్యనారాయణ మూర్తి (రవి)ని రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా నరసింహం విజయం సాధించేందుకు రవి ఎంతగానో కృషి చేశారు. జగ్గంపేట ఇన్చార్జి బాధ్యతలను చేపట్టి పూర్తి మైనస్‌లో ఉన్న పార్టీకి జవసత్వాలు అందించిన రవిని ఎన్నికల అనంతరం తనకు పోటీగా తయారవుతాడని భావించి కావాలని దూరంగా పెట్టారు. నమ్ముకున్న వాడినే దూరంగా పెట్టడంతో తోట బంధువులు రకరకాలుగా చర్చించుకున్నారు. జెడ్పీటీసీ, ఎంపీపీగా గెలిపించుకునే అవకాశం ఉన్నప్పటికీ కేవలం తన స్వార్థం కోసం ఎన్నికల్లో ఉపయోగించుకుని తరువాత పక్కన పెట్టడం, గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉన్న రవిని బాబాయ్‌కి పోటీగా కాంగ్రెస్‌లోకి తీసుకురావాలని ఆ పార్టీ జిల్లా నాయకులు చేసిన ప్రయత్నాలు దాదాపుగా ఫలించాయి. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి జగ్గంపేట స్థానానికి బరిలో దిగేందుకు రవి సిద్ధమవుతున్నారు. ఇది నరసింహానికి ఏం చిచ్చు పెడుతుందోనని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.