ఆ ‘తోట’కు ఈ ‘తోట’కు మధ్య... | Sakshi
Sakshi News home page

ఆ ‘తోట’కు ఈ ‘తోట’కు మధ్య...

Published Sat, Apr 5 2014 2:19 PM

ఆ ‘తోట’కు ఈ ‘తోట’కు మధ్య... - Sakshi

  *బాబాయ్‌కి ఝలక్
  *తోట నరసింహంపై పోటీకి తోట రవి సిద్ధం
  *జిల్లా కాంగ్రెస్ నేతల మంతనాలు

 
 జగ్గంపేట :  రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదనేది నానుడి. తమ స్వార్థ ప్రయోజనాలు కోసం రాజకీయ భవితవ్యాన్ని, పేరు ప్రతిష్టలు ఇచ్చిన పార్టీలను మార్చేసే నేతలకు బదులిచ్చేందుకు వారి కుటుంబ సభ్యులే సై అంటున్న పరిస్థితులు తెరపైకి వస్తున్నాయి. దివంగత మాజీ ఎమ్మెల్యే తోట వెంకటాచలం రాజకీయ వారసుడిగా ఆరంగేట్రం చేసి రెండు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి పదవిని కాంగ్రెస్ పార్టీలో అందిపుచ్చుకున్న తోట నరసింహం ఉన్నట్టుండి ఒక్కసారిగా పార్టీ కండువా మార్చేశారు.

అభిమానులు ఒత్తిడి అనే పదాన్ని ప్రయోగించి తన రాజకీయ భవిష్యత్ కోసం మార్గాన్ని సుగమం చేసుకునేందుకు టీడీపీ పంచన చేరారు. రెండు కళ్ల సిద్ధాం తం అంటూ చంద్రబాబును నాడు విమర్శించి నేడు ఆయన ద్వారానే అభివృద్ధి జరుగుతుందని వేదాలు వల్లిస్తున్న నరసింహానికి ఇంటి పోరు మొదలైంది. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే సామెతను ఆచరణలోకి తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలు నరసింహం కుటుంబం నుంచే ఆ పార్టీకి నాయకుడిని బరిలో దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జగ్గంపేట నుంచి అసెంబ్లీ స్థానానికి ఆయనకు వరసకు కుమారుడయ్యే తోట సూర్యనారాయణ మూర్తి (రవి)ని రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నారు.

రెండు సార్లు ఎమ్మెల్యేగా నరసింహం విజయం సాధించేందుకు రవి ఎంతగానో కృషి చేశారు.  
జగ్గంపేట ఇన్‌చార్జి బాధ్యతలను చేపట్టి పూర్తి మైనస్‌లో ఉన్న పార్టీకి జవసత్వాలు అందించిన రవిని ఎన్నికల అనంతరం తనకు పోటీగా తయారవుతాడని భావించి కావాలని దూరంగా పెట్టారు. నమ్ముకున్న వాడినే దూరంగా పెట్టడంతో తోట బంధువులు రకరకాలుగా చర్చించుకున్నారు.

జెడ్పీటీసీ, ఎంపీపీగా గెలిపించుకునే అవకాశం ఉన్నప్పటికీ కేవలం తన స్వార్థం కోసం ఎన్నికల్లో ఉపయోగించుకుని తరువాత పక్కన పెట్టడం,  గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉన్న రవిని బాబాయ్‌కి పోటీగా కాంగ్రెస్‌లోకి తీసుకురావాలని ఆ పార్టీ జిల్లా నాయకులు చేసిన ప్రయత్నాలు దాదాపుగా ఫలించాయి. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి జగ్గంపేట  స్థానానికి బరిలో దిగేందుకు రవి సిద్ధమవుతున్నారు. ఇది నరసింహానికి ఏం చిచ్చు పెడుతుందోనని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement