ఈశాన్య ఢిల్లీ ఎన్నికల చిత్రం కాంగ్రెస్ వ్యతిరేక పవనాల జోరు
అనుభవం, నిరాడంబరత, స్థానికుల్లో మంచి పేరున్నా ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జైప్రకాశ్ అగర్వాల్ గెలుపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అందుకు కారణం ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు జోరుగా వీస్తుండడమే. ఇదే బీజేపీ అభ్యర్థి, భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీ గెలుపు అవకాశాలను మెరుగుపర్చవచ్చంటున్నారు. ఇక ఆప్ అభ్యర్థి ఆనంద్‌కుమార్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల గెలుపు అవకాశాలపై కొంతమేర ప్రభావం చూపవచ్చని రాజకీయ పండితులు చెబుతున్నారు.
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఏడు లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటైన ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గం 2008లో డీలిమిటేషన్ కమిషన్ సిఫారసు మేరకు ఏర్పాటైంది. ఈస్ట్ ఢిల్లీ నియోజవర్గంలోని ప్రాంంతాలతో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో 2009లో జరిగిన మొట్టమొదటి లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌కు చెందిన జైప్రకాశ్ అగర్వాల్, బీజేపీకి చెందిన బి.ఎల్. శర్మ ప్రేమ్‌ను 2 లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు.
అయితే కొత్తగా ఢిల్లీ రాజకీయాలలో బలమైన శక్తిగా ఎదిగిన ఆమ్ ఆద్మీ పార్టీ కారణంగా ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ జరగనుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి జేఎన్‌యూ ప్రొఫెసర్ అనంద్కుమార్ను అభ్యర్థిగా నిలబెట్టింది.
సమాజశాస్త్ర నిపుణుడిగా ఆనంద్‌కుమార్‌కు విద్యారంగంలో మంచి పేరుంది. ఆయన ఆప్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు, ఆప్ జాతీయ కార్యవర్గంలోనూ సభ్యుడు. అయితే సైద్ధాంతిక ప్రజాస్వామ్యంలో అనుభవజ్ఞుడైన ఆనంద్‌కుమార్ ఈశాన్య ఢిల్లీలోని కుల, మత రాజకీయాలలోఎలా నెట్టుకురాగలరన్న సందేహం ఆప్ కార్యకర్తలను వేధిస్తోంది.
అదీకాక బయటి వ్యక్తిని లోక్‌సభ అభ్యర్థిగా ఎంపిక చేయడాన్ని కొందరు స్థానిక కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ఆనంద్‌కుమార్‌కు రాజకీయాలలో అనుభవం లేకపోవడం కూడా ఆప్ విజయానికి ప్రతికూలాంశమని అంటున్నారు. అయితే నిజాయితీపరుడన్న పేరు, ఆమ్ ఆద్మీ పార్టీ పాపులారిటీ ఆనంద్‌కుమార్‌ను గెలిపిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ముస్లిం ఓటర్లు కూడా ఆయనకు మద్దతు ఇస్తారని భావిస్తున్నారు.
ఢిల్లీలోని ఏడు నియోజకవర్గాలలో ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న నియోజవర్గం ఇదే. ఇక్కడి ఓటర్లలో 27 శాతం మంది ముస్లింలున్నారు. ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్నందున ఇక్కడి నుంచి ముస్లిం అభ్యర్థిని నిలబెట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. కానీ పార్టీ వారి డిమాండ్‌ను పట్టించుకోలేదు. సిట్టింగ్ ఎంపీ జైప్రకాశ్ అగర్వాల్‌కు టికెట్ ఇచ్చింది.
ఆయన అభ్యర్థిత్వం ప్రైమరీ ఎన్నికల ద్వారా ఖరారైంది. కాంగ్రెస్ ఢిల్లీలో ప్రైమరీ ఎన్నికల ద్వారా అభ్యర్థులను ఖరారు చేసిన రెండు నియోజకవర్గాలలో ఇదొకటి. జేపీ అగర్వాల్ సరళస్వభావం, నిరాడంబరత, అనుభవం ఈశాన్య ఢిల్లీ ఓటర్లకు నచ్చినప్పటికీ నగరంలో తీవ్రంగా వీస్తున్న కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు, స్థానిక సమస్యలు ఆయన విజయానికి అడ్డంకిగా మారవచ్చన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈశాన్య ఢిల్లీలో అనధికార కాలనీల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఈ నియోజకవర్గం మిగతా ఢిల్లీ నుంచి దూరంగా ఉన్నట్లు ఉంటుంది. మెట్రో సదుపాయం లేదు. ఇతర ప్రజారవాణా సదుపాయాల లభ్యత కూడా తక్కువే.
బీజేపీ విషయానికి వస్తే ప్రస్తుతం దేశమంతటా రాజకీయ వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉందని, మైనారిటీల ఓట్లు దక్కకపోయినా పూర్వాంచలీయుల ఓటర్లను కొల్లగొట్టాలన్న ఉద్దేశంతో ఆపార్టీ భోజ్‌పురి గాయకుడు, నటుడు మనోజ్ తివారీకి టికెట్ ఇచ్చింది.
ఈ నియోజవర్గం జనాభాలో 45 శాతం మంది పూర్వాంచలీయులున్నారు. పూర్వాంచలీ ఓటర్లను దృష్టిలో పెట్టుకునే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బయటివాడన్న వ్యతిరేకతను ఖాతరు చేయకుండా ఆనంద్‌కుమార్‌కు టికెట్ ఇచ్చిందని కొందరు రాజకీయ పండితులు అంటున్నారు. ఆనంద్‌కుమార్ వారణాసిలో జన్మించారని, ఆయన కొంతకాలం బెనారస్ హిందూ యూనివర్సిటీలో కూడా పనిచేశారని వారు అంటున్నారు. ముస్లిం ఓటర్లను దృష్టిలో పెట్టుకుని హజ్ కమిటీ సభ్యుడు సమీ సల్మానీకి బీఎస్పీ టికెట్ ఇచ్చింది.
బురాడీ, తిమార్పుర్, సీమాపురి, రోహతాస్‌నగర్, సీలంపూర్, ఘోండా, బాబర్పూర్, గోకుల్పూర్, ముస్తఫాబాద్, కరావల్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధి కిందకు వస్తాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఈ పది నియోజకవర్గాలలో ఐదింటిలో బీజేపీ, మూడింటిలో ఆమ్ ఆద్మీ పార్టీ, రెండింటిలో కాంగ్రెస్ విజయం సాధించింది.