హస్తిన హస్తానికి మరమ్మతులు | Arvinder Singh Lovely slams AAP for using 'derogatory language' against Congress | Sakshi
Sakshi News home page

హస్తిన హస్తానికి మరమ్మతులు

Published Sat, Dec 21 2013 12:24 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM

Arvinder Singh Lovely slams AAP for using 'derogatory language' against Congress

సాక్షి, న్యూఢిల్లీ: హస్తినలో పదిహేనేళ్లుగా అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా కుదేలవడంపై ఆ పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టిసారించింది. లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యం లో పార్టీకి మరమ్మతులు ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీశాఖపై ప్రత్యేకంగా దృష్టిసారించిన పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్‌గాంధీ ఇందుకోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. యువతకు పెద్ద పీట వేయడంతోపాటు కొత్తవారికి అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే సీనియర్ నాయకులను పక్కన పెట్టి 46 ఏళ్ల అర్విందర్‌సింగ్ లవ్లీకి ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిని కట్టబెట్టినట్టు తెలుస్తోంది.

దీనిద్వారా ఢిల్లీలో పార్టీకి యువరక్తం ఎక్కించనున్నట్టు సంకేతాలు పంపింది. పార్టీలో ఏళ్లుగా పాతుకుపోయిన నాయకులపై ఉన్న వ్యక్తిగత వ్యతిరేకత సైతం అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణంగా అధిష్టానం భావిస్తోందని కొందరు నాయకులు పేర్కొన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయ లోపంతో షీలాసర్కార్ 15ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లలే కపోయామని రాహూల్ గాంధీ స్వయంగా వ్యాఖ్యానించినట్టు తెలిపారు. డీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న జైప్రకాశ్ అగర్వాల్, ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలాదీక్షిత్ మధ్య అంతరాల కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు కొత్త నిర్ణయాలు తీసుకున్నట్టు సమచారం. కొత్తగా డీపీసీసీ పగ్గాలు చేపట్టిన అర్విందర్‌సింగ్ లవ్లీకి షీలాదీక్షిత్‌కి సాన్నిహిత్యం ఉండడంతో ఇకపై ఎలాంటి విభేదాలు ఉండబోవన్నది అధిష్టానం వ్యూహంగా కనిపిస్తోంది.
 యువతకు చేరువయ్యేందుకే...
 ఢిల్లీలో అత్యధిక సంఖ్యలో ఓటర్లుగా ఉన్న యువతకు చేరువ కాలేకపోవడమూ ఎన్నికల్లో ఓటమికి ఓ కారణంగా పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు. దీంతో యువతకు ప్రాధాన్యం పెంచితే కొత్త ఉత్సాహాన్ని పార్టీలో నింపవచ్చన్నది వారి భావన. 1987 నుంచి ఢిల్లీ రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న అర్విందర్‌సింగ్ లవ్లీ 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. షీలాదీక్షిత్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. పార్టీ నాయకులతో లవ్లీకి ఉన్న సాన్నిహిత్యం అంతర్గత విభేదాలు తొలగించేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లోనే వీలైనంత మంది కొత్తవారికి అవకాశం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. కానీ షీలాదీక్షిత్‌పై ఉన్న నమ్మకంతో ఆమె సలహా మేరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలనే ఎక్కువ స్థానాల్లో పోటీకి దింపారు. సరిగ్గా అదే వ్యూహం బెడిసికొట్టడంతో పార్టీ నాయకత్వం మరోమారు ఆలోచనలో పడింది.
 కత్తిమీద సామే...
 పార్టీ పూర్తిగా ఢీలా పడిపోయిన పరిస్థితుల్లో డీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న అర్విందర్‌సింగ్ లవ్లీ ఎంతో నేర్పుగా వ్యవహరించాల్సి ఉంది. లోక్‌సభ ఎన్నిక లకు గడువు చాలా తక్కువగా ఉండడంతో పార్టీని బలోపేతం చేయడంతోపాటు, పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తేవడం అంతసులువైన పనేంకాదు. ఇన్నాళ్లు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంక్‌గా ఉన్న జుగ్గీ జోపిడీలు, అనధికారిక కాలనీల్లో, ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పాగా వేసింది. ఆ ప్రాంతాలను తిరిగి కాంగ్రెస్‌కు అనుకూలంగా మార్చడం అంత సులువేం కాదు. ఇన్నాళ్లు అధికార మంత్ర దండంతో ప్రజలను ఆకర్షించినట్టు చేసేం దుకు కాంగ్రెస్ పార్టీకి ఈసారి అవకాశం లేదు. వీట న్నింటి నడుమ పార్టీ పూర్వవైభవం తేవడంలో లవ్లీ ఏమేరకు సఫలమవుతారో మరికొద్ది నెలల్లో తేల నుంది. మరోవైపు పార్టీ అధిష్టాన వర్గం తనపై ఉంచిన అంచనాలు అందుకుంటానన్న ఆత్మవిశ్వాసాన్ని అర్విందర్‌సింగ్ లవ్లీ వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement