ఫ్లైట్లో జిహాద్ అంటూ కాక్ పీట్ వైపు దూసుకెళ్లి..
అలెగ్జాండ్రియా(వర్జీనియా): విమానం వెళుతుండగా జిహాద్ అంటూ అరుస్తూ కాక్పీట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తికి అమెరికా కోర్టు తొమ్మిది నెలల జైలు శిక్షను విధించింది. గత ఏడాది మార్చి 2015న 36 ఏళ్ల డేవిడ్ ప్యాట్రిక్ డియాజ్ అనే వ్యక్తి డల్లెస్ నుంచి డెన్వెర్కు బయలుదేరాడు. తొలుత అందరితోపాటు కుదురుగా కూర్చున్న అతడు ఫ్లైట్ బయలుదేరి గగనతలానికి వెళ్లిన కాసేపటికి జిహాద్ అంటూ బిగ్గరగా కేకలు పెడుతూ కాక్ పీట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు.
దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన సిబ్బంది ఉన్నపలంగా అతడిని బంధించి తిరిగి విమానాన్ని వెనక్కితిప్పి వర్జీనియాలోని డల్లెస్ ఎయిర్ పోర్ట్ లో దింపేశారు. అనంతరం అతడిని అరెస్టు చేశారు. అయితే, అతడి తరుపు న్యాయవాది అలెగ్జాండ్రియా కోర్టులో వాదిస్తూ అతడు ఆ సమయంలో మద్యం సేవించిన కారణంగా మానసికంగా బలహీనుడయ్యాడని అందుకే అలా ప్రవర్తించాడని చెప్పారు. అయితే, ఎయిర్ లైన్స్ తరుపు న్యాయవాది మాత్రం అతడికి కనీసం 21 నెలలు జైలు శిక్ష విధించాలని కోరారు. కాగా, న్యాయమూర్తి మాత్రం తొమ్మిది నెలల శిక్ష విధించడంతోపాటు 22 వేల డాలర్ల ఫైన్ వేశారు.