'ధాన్యం కొనుగోళ్లలో అధికారిక దందా'
కాకినాడ: ఉభయ గోదావరి జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లలో అధికారిక దందా జరుగుతోందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అధికారంలోకి వచ్చినా గోతులు తీసే కార్యక్రమం చేపడుతారని విమర్శించారు. ఆదివారం కాకినాడలో కురసాల కన్నబాబు విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబుకు ఇంకుడు గుంతలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని ధ్వజమెత్తారు. రైతులకు అందాల్సిన రవాణా హ్యాండిలింగ్ ఛార్జీలు పెద్ద ఎత్తునా పక్కదారి పడుతున్నాయని దుయ్యబట్టారు.
ఈ అక్రమాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే ప్రజా పోరాటం చేస్తుందని వెల్లడించారు. ఎండవేడిమిని తట్టుకోలేక గోదావరి పుష్కరాల్లో తోపులాట జరిగిందని కలెక్టర్ నివేదిక ఇవ్వడం విచారకరమన్నారు. గోదావరి, కృష్ణా జలాలను కాపాడుకోవాలంటే ఎగువన చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 17న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జలదీక్షకు మద్దతుగా తూర్పుగోదావరి జిల్లాలోని మండల కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ దీక్షలు చేపట్టనున్నట్టు కురసాల కన్నబాబు పేర్కొన్నారు.