jamat ud dawa
-
సయీద్‌కు 11 ఏళ్ల జైలు
లాహోర్: ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దవా అధ్యక్షుడు హఫీజ్ సయీద్‌కు పాక్‌లో జైలు శిక్ష పడింది. ఉగ్రవాదానికి నిధులు అందించారన్న కేసులో విచారణ జరిపిన పాకిస్తాన్‌లోని ఉగ్రవ్యతిరేక (ఏటీసీ) పదకొండేళ్ల జైలుశిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది. సయీద్‌తోపాటు అతడి సన్నిహిత సహచరుడు జఫర్ ఇక్బాల్‌కూ 11 ఏళ్ల శిక్ష విధిస్తూ ఏటీసీ జడ్జి అర్షద్ హుస్సేన్ భుట్టా ఆదేశాలు జారీ చేశారు. సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి గతంలోనే ప్రకటించింది. అతడి తలకు అమెరికా గతంలో కోటి డాలర్ల వెలకట్టింది. గత ఏడాది జూలై 17న అరెస్ట్ అయిన సయీద్ లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైల్లో ఉన్నారు. లాహోర్, గుజ్రన్‌వాలాల్లో దాఖలైన రెండు కేసుల్లో సయీద్‌కు శిక్ష విధించారని, ఒక్కో కేసులో ఐదున్నర ఏళ్లు జైలు శిక్ష, మొత్తం 15 వేలరూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని, రెండు శిక్షలు ఒకేసారి అమలవుతాయని కోర్టు అధికారి ఒకరు తెలిపారు. ఏటీసీ కోర్టు గత ఏడాది డిసెంబర్ 11న సయీద్, అతడి సన్నిహిత సహచరులను దోషులుగా ప్రకటించగా..శిక్ష ఖరారును ఫిబ్రవరి 11వ తేదీ వరకూ వాయిదా వేయడం తెల్సిందే. ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందిస్తున్న వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామన్న పాకిస్తాన్ హామీని నెరవేర్చాలని పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ఒకటి ఇచ్చిన పిలుపుతో పాక్ ప్రభుత్వం సయీద్, అతడి అనుచరులపై విచారణ ప్రారంభించింది. -
‘మోదీ హత్య-భారత్ ముక్కలు..’
ఇస్లామాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ అనుచరుడొకడు భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు గురవుతారని, ఆ వెంటనే భారత దేశం ముక్కలు అవటం ఖాయమని సంచలన ప్రకటన చేశాడు. రంజాన్ సందర్భంగా శుక్రవారం పీఓకే పరిధిలోని రావాలాకోట్ నగరంలోని ఓ కార్యక్రమం నిర్వహించారు. దీనికి జమాత్-ఉద్-దవా(జేయూడీ) నేత మౌలానా బషీర్ హాజరయి ప్రసంగించాడు. ‘త్వరలో ఇస్లాం జెండా.. అమెరికా, ఇండియాల్లో ఎగురుతుంది. భారత ప్రధాని మోదీ హత్యకు గురవుతారు. భారత్, ఇజ్రాయెల్ దేశాల్లో ఎంతో మంది అమరులవుతారు. ఆయా దేశాలు ముక్కలు కావటం ఖాయం’ అని బషీర్ వ్యాఖ్యానించాడు. జిహాద్(పవిత్ర యుద్ధం) రంజాన్ పవిత్ర నెలలోనే జరగాలని, అలాంటప్పుడే అసువులు బాసినా యుద్ధ వీరులు స్వర్గానికి వెళ్తారని బషీర్ ఆవేశపూరితంగా ప్రసంగించారు. జేయూడీ వర్గాలు భారత్ నాశనాన్ని, కశ్మీర్ స్వతంత్ర్యాన్ని కోరుకుంటున్నాయని, పీఓకేలో ఉన్న ప్రజలంతా తమ ఇంట్లోని పిల్లలను జిహాద్‌కు సిద్ధం చెయ్యాలని రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు. అవసరమైతే ఆర్థిక సాయం చేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చాడు. ఆ ప్రసంగం తాలూకు వీడియోలు కశ్మీర్ వాట్సాప్ గ్రూప్‌లలో చక్కర్లు కొడుతున్నాయి. -
అమెరికా ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్
కరాచీ: భారత్‌పై ఎలాంటి ఉగ్ర దాడులు జరగకుండా చూడాలన్న అమెరికా ఒత్తిడికి పాకిస్తాన్ తలొగ్గింది. దీనిలో భాగంగానే హఫీజ్ సయ్యిద్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవాపై పాక్ తాజాగా నిషేధం విధించింది. భారత్ లో సీమాంతర ఉగ్రవాద దాడి జరగకుండా చూడాలని పాకిస్తాన్‌ను అమెరికా అధ్యక్షుడు బరాక్ బబామా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఒకవేళ అలాంటి దాడి ఏదైనా జరిగితే, అది పాక్ నుంచే జరిగిందని వెల్లడైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ముందస్తు చర్యల్లో భాగంగా జమాత్ ఉద్ దవా పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. భారత గణతంత్ర దినోత్సవంలో పాల్గొనేందుకు ఒబామా భారత్‌లో పర్యటిస్తున్నారు. ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరిగే ఈ వేడుకల్లో పాల్గొంటున్న ఒబామా.. రెండు గంటల కన్నా ఎక్కువ సేపు బహిరంగ వేదికపై ఉండనున్నారు. దీంతో ఆయన భద్రత విషయమై అమెరికా, భారత భద్రతా సంస్థలు మరింత ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా భారత్ లో ఉగ్రవాదులు దాడులు చేసే ప్రమాదం ఉందని ఐబీ (నిఘా సంస్థ) హెచ్చరికలు జారీ చేయడంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని ఎయిర్ పోర్టుల్లో హై అలర్ట్ ప్రకటించారు.