జమ్మూలో వరదలు: 8 మంది మృతి
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో బుధవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జమ్మూ ప్రాంతంలో వరద పోటెత్తింది. ఆ వరదల కారణంగా శుక్రవారం 8 మంది మృతి చెందారని ఉన్నతాధికారులు శనివారం జమ్మూలో వెల్లడించారు. వారిలో ఐదుగురు ఇళ్లు కూలి మరణించగా, మరో ముగ్గురు నదీ నీటీ ప్రవాహా ఉధృతికి కొట్టుకుపోయారని వివరించారు. అయితే వరద సహాయ చర్యల్లో భాగంగా సైనికాధికారులు వివిధ ప్రాంతాల్లో వరదలలో కొటుకుపోతున్న 80 మందిని రక్షించారని ఉన్నతాధికారులు తెలిపారు.
వరదల నేపథ్యంలో ఆ ప్రాంతంలో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించిందని ఉన్నతాధికారులు గుర్తు చేశారు. వరదల్లో చిక్కుకున్న వారి సహయ పునరావాసం అందించేందుకు కంట్రోల్ రూమ్‌ను ఏర్పటు చేసినట్లు వివరించారు. ఆగకుండా కురుస్తున్న వర్షాల కారణంగా దాదాపు 1500 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. అలాగే పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడటంతో రైలు, బస్సు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు.
దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాగా రహదారులపై పడిన కొండ చరియలను తొలగించేందుకు సైనికులు రంగంలోకి దిగారని అధికారులు వివరించారు. జమ్మూ ప్రాంతంలో వచ్చే సోమవారం వరకు ఇలానే వర్షాలు కురుస్తునే ఉంటాయని, అలాగే మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని జమ్మూలోని వాతావరణ శాఖ సూచించింది.