శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్లో శనివారం వరద సహాయక చర్యల్లో పాల్గొన్న తొమ్మిదిమంది జవాన్లు వరద ఉధృతికి కొట్టుకు పోయారు. పుల్వామా జిల్లాలో వరద ఉధృతి శనివారం కూడా కొనసాగుతోంది. సహాయక చర్యలు చేపడుతుండగా.... ఒక్కసారిగా వరద ఉధృతి పెరగటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అలాగే శ్రీనగర్లో జీలమ్ నది పోటెత్తుతోంది.
దాంతో నది వద్ద అయిదు కిలోమీటర్ల మేర రహదారి కొట్టుకుపోయింది. కాగా శ్రీనగర్ విమానాశ్రయంలోకి వరద నీరు వచ్చే అవకాశం ఉండటంతో ఎయిర్పోర్టు అధికారులు అప్రమత్తం అయ్యారు. కాగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో బుధవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలలో మృతి చెందినవారి సంఖ్య 120కి చేరింది. వారిలో కొండచరియలు విరిగి 14మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు పదివేలమంది వరద తాకిడికి గురయ్యారు.