జనగామలో జగడం.. సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఫిట్టింగ్ పెడుతున్న ఎమ్మెల్సీ
జనగామ గులాబీ గూటిలో ముసలం ముదిరిందా?... సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఫిట్టింగ్ పెడుతుంది ఎమ్మెల్సీలేనా?... ఇంటిపోరుతో సతమతం అవుతున్న ముత్తిరెడ్డి సీటుకు ఎసరు పెట్టారా?...అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజమే అనిపిస్తుంది. గ్రూప్ రాజకీయాలతో గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తున్న పుల్లల రాయుడు ఎవరు?.. జనగామ జగడానికి కారణం ఏంటీ?
ఉద్యమాల ఖిల్లా జనగామలో బీఆర్ఎస్ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వ్యతిరేక వర్గం తాజా ఆడియో సంభాషణ కలకలం సృష్టిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన సీటును పదిలపర్చుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఓ వైపు ఆయన కూతురు తుల్జా భవానీ రెడ్డి, మరోవైపు వ్యతిరేక వర్గం వ్యూహాలు ఆయనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
రసవత్తరంగా జనగామ రాజకీయం
ఇదే సమయంలో స్వపక్షంలోని స్థానికులు గ్రూప్ కట్టి స్థానికతను తెరపైకి తీసుకొస్తున్నారు. ఓ ఎమ్మెల్సీ అందుకు ఆజ్యం పోస్తున్నట్లు తాజా ఆడియో వైరల్ తో స్పష్టమౌతుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి స్థానికేతరుడనేది అడొస్తే.. పట్టభద్రుల స్థానానికి మరో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కలిసేందుకు జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి పలువురితో సంప్రదింపులు జరపడం హాట్ టాఫిక్‌గా మారింది.
పోచంపల్లి'.. లేదంటే 'పల్లా'కు జై
జనగామ నుంచి పోటీ కోసం ఇప్పటికే యాదగిరిరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిల పేర్లుండగా.. తాజాగా తెరమీదకు ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు వచ్చింది. ఈ మేరకు జనగామ జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి పలువురు నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇదే క్రమంలో నర్మెట జెడ్పీటీసీ సభ్యుడు ఎం.శ్రీనివాస్‌తో ఫోన్లో మాట్లాడిన ఆడియో లీక్ అయింది.
చదవండి: పిల్లల టిఫిన్ బాక్సులు తెరిచి చూసి షాకయ్యా: గవర్నర్ తమిళిసై
జడ్పీ చైర్మన్ ఆడియో వైరల్ కలకలం
'పల్లా రాజేశ్వర్ రెడ్డి లోకల్ వాడు.. జనగామ నియోజకవర్గం నుంచి నిలబడమని మనం సపోర్ట్ చేద్దాం.. ఇంకొకటి ఏమిటంటే మొత్తం జనగామ నియోజకవర్గంలో 8 మండలాలు ఉన్నాయి.. కాబట్టి 4 మండలాల వారు (చేర్యాల, మద్దూరు, దులిమిట, కొమురవెల్లి) వస్తారో రారోగాని నువ్వు, మన 4 మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు కలిసి ఒక రిప్రజెంటేషన్ కేసీఆర్ సార్‌కు ఇవ్వాలి.
అన్ని నేను చూసుకుంటా.. సీటు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి వస్తే అభ్యంతరం లేదు.. శ్రీనన్న కనుక నాన్ లోకల్ అంటే మనం రాజేశ్వర్ రెడ్డికి ఇవ్వమందాం.. మన ఆలోచన ఇది. నువ్వు వెంటనే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఫోన్ చెయ్యి, సారుతోటి మంచిగా మాట్లాడు. మీకు అంతా అనుకూలంగా ఉంటది. అందరూ ఒకే అంటారు అని చెప్పు.. నర్మెట సీను ఫోన్ చేస్తాడని చెప్పిన మన తమ్ముడే, మీరంటే పడి చస్తాడని చెప్పిన నువ్ కూడా అదే విధంగా మాట్లాడు.. మళ్లీ నాకు వెంటనే కాల్ చేసి చెప్పు' అంటూ జెడ్పీటీసీ శ్రీనివాస్‌తో మాట్లాడిన పాగాల సంపత్ రెడ్డి ఆడియో రాజకీయవర్గాల్లో దుమారం రేపుతోంది.
ముత్తిరెడ్డికి ఇంటిపోరు
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కొంత కాలంగా వివాదాలకు కేంద్రంగా ఉన్నారు. ఇటీవల తన కూతురు తుల్జా భవానిరెడ్డి ఆయన తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడమే కాకుండా చేర్యాలలో తండ్రి ఇచ్చిన స్థలాన్ని కూడా మున్సిపాలిటీకి ధారాదత్తం చేశారు. ఓ వైపు ఇంటిని చక్కబెట్టుకుంటూనే అధిష్టానాన్ని కన్విన్స్ చేసుకుంటున్న తరుణంలో సొంత పార్టీలోనూ కుంపటి రాజుకుంటోంది. ఆయనంటే ససేమిరా అనే గ్రూపు ఈసారి ఎన్నికల నుంచి తప్పించాలని అధిష్టానంపై ఒత్తిడి తీసుకువస్తుంది.
చదవండి: కమలం గూటికి జయసుధ.. ఎవరికి చెక్ పెట్టేందుకు?.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదేనా?
ఈ క్రమంలో ముత్తిరెడ్డి వ్యతిరేక వర్గం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సన్నిహితంగా వ్యవహరిస్తూ ఆయనను కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆయనతో దిగిన ఫొటో లతోపాటు కార్యక్రమాలను విస్తృతంగా ఒక వర్గం ప్రచారం చేస్తోంది. ఇంత జరుగుతున్నా తన పని తాను చేసుకుంటూ పోతున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. 'సిట్టింగ్'గా ఉన్న టికెట్ నాకే, గెలుపు నాదే నంటూ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇదే సమయంలో తెరపైకి పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు రావడం నియోజకవర్గంలో కలకలం సృష్టిస్తుంది. గ్రూప్ రాజకీయాలు అందుకు ఆజ్యం పోస్తున్నాయి.
పుల్లల రాయుడి ఫిట్టింగ్
గ్రూపు రాజకీయాలకు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఫిట్టింగ్ పెడుతుంది పుల్లల రాయుడిని ప్రచారం సాగుతుంది. అధిష్టానం పెద్దలకు దగ్గరగా ఉండే నాయకుడు అటు జనగామ, ఇటు స్టేషన్ ఘన్పూర్, మరోవైపు వరంగల్ పశ్చిమ లో సిట్టింగ్ ఎమ్మెల్యే లు సీట్లకు ఎసరు పెట్టి తన సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మూడు నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలకు అంతర్గత విబేదాలకు పుల్లల రాయుడు కారణమని భావిస్తున్నారు.
ఇప్పటికే స్టేషన్ ఘన్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు బదులు ఎమ్మెల్సీ కడియం పేరు తెరపైకి రావడం, అటు జనగామలో ముత్తిరెడ్డికి బదులు పోచంపల్లి, పల్లా పేర్లు తెరపైకి తేవడం వెనుక పొలిటికల్ డ్రామాగా ఓరుగల్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎన్నికల నాటికి ఇంకా ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయోనని ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.