Japan open super series
-
‘మిక్స్డ్’ సెమీస్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్ జంట
ఇన్నాళ్లూ గ్రాండ్‌ప్రి గోల్డ్, గ్రాండ్‌ప్రి, ఇంటర్నేషనల్ చాలెంజ్ స్థాయి టోర్నమెంట్లలో మెరిపించిన సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జంట ఎట్టకేలకు ‘సూపర్ సిరీస్’ టోర్నీలో తమ సత్తా చాటుకుంది. టోక్యో వేదికగా ఈ భారత జంట జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గతేడాది బ్రెజిల్, రష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నీలలో విజేతగా నిలిచిన సిక్కి–ప్రణవ్ ద్వయం తొలిసారి సూపర్ సిరీస్ టోర్నీలో ఫైనల్ బెర్త్‌పై దృష్టి పెట్టింది. టోక్యో: ఒకవైపు సింగిల్స్ విభాగాల్లో భారత స్టార్ ఆటగాళ్లు నిష్క్రమించినా... మరోవైపు మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా ద్వయం ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి తమ కెరీర్లో తొలిసారి ఓ సూపర్ సిరీస్ టోర్నీలో సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో పంజాబ్‌కు చెందిన తన డబుల్స్ భాగస్వామి ప్రణవ్ చోప్రాతో కలిసి బరిలోకి దిగిన హైదరాబాద్ అమ్మాయి సిక్కి రెడ్డి మరో స్ఫూర్తిదాయక విజయంతో ముందంజ వేసింది. శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సిక్కి–ప్రణవ్ ద్వయం 21–18, 9–21, 21–19తో సెయుంగ్ జె సియో–కిమ్ హా నా (దక్షిణ కొరియా) జోడీపై గెలిచింది. శనివారం జరిగే సెమీఫైనల్లో టకురో హోకి–సయాకా హిరోటా (జపాన్) జంటతో సిక్కి – ప్రణవ్ జోడీ తలపడుతుంది. వరుసగా ఐదు పాయింట్లు... ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 19వ స్థానంలో ఉన్న సిక్కి–ప్రణవ్ జోడీ క్వార్టర్ ఫైనల్లో ఓటమి అంచుల్లో నుంచి విజయతీరాలకు చేరింది. 58 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణాయక మూడో గేమ్ చివర్లో సిక్కి–ప్రణవ్ ద్వయం 16–19తో వెనుకబడింది. ఈ దశలో భారత జోడీ ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది. శ్రీకాంత్ జోరుకు బ్రేక్... వరుసగా మూడో సూపర్ సిరీస్ టైటిల్‌పై గురి పెట్టిన భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ జోరుకు ప్రపంచ చాంపియన్ విక్టర్ అక్సెల్సన్ అడ్డుకట్ట వేశాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ శ్రీకాంత్ 17–21, 17–21తో ప్రపంచ రెండో ర్యాంకర్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. 40 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ రెండు గేముల్లోనూ ఆధిక్యంలో నిలిచి ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కోల్పోవడం గమనార్హం. మరో క్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్ 15–21, 14–21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ షి యుకి (చైనా) చేతిలో ఓడిపోయాడు. -
సైనా నెహ్వాల్ అవుట్
టోక్యో: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నుంచి భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ నిష్ర్కమించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ ఫైనల్లో సైనా 16-21, 13-21 తేడాతో ఒలిపింక్స్ స్వర్ణ పతక విజేత, స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ చేతిలో ఓటమి పాలయ్యారు. తొలి గేమ్ లో సైనా 11-9తో ఆధిక్యంలో నిలిచినా, దాన్ని కాపాడుకోవడంలో విఫలమయ్యారు. కరోలినా ఒక్కసారిగా విజృంభించడంతో సైనా వెనుకబడిపోయింది. ఈ క్రమంలోనే కరోలినా 21-16తో తొలి గేమ్ ను సొంతం చేసుకున్నారు. ఆపై రెండో గేమ్ లో సైనాకు ఎటువంటి అవకాశం ఇవ్వని కరోలినా 21-13తో గేమ్ ను మ్యాచ్ ను సాధించారు. అంతకుముందు ఒకుహారా చేతిలో పివి సింధు ఓటమి పాలైన సంగతి తెలిసిందే. -
క్వార్టర్స్‌కు శ్రీకాంత్
టోక్యో: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ లో భారత స్టార్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్స్ లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్ పోరులో శ్రీకాంత్ 21-12,21-11 తేడాతో హు యున్ (హాంకాంగ్)పై గెలిచి క్వార్టర్స్‌లోకి చేరాడు. తొలి గేమ్ ను అవలీలగా గెలుచుకున్న శ్రీకాంత్.. రెండో గేమ్ ను కూడా అదే ఊపులో సాధించి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకున్నాడు. ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో శ్రీకాంత్ ఎటువంటి పొరపాట్లు చేయకుండా హు యున్ ను మట్టికరిపించాడు. శ్రీకాంత్ తన తదుపరి పోరులో డెన్మార్క్ ఆటగాడు అక్సెల్సెన్తో తలపడతాడు. మరో పురుషుల సింగిల్స్ లో భారత్ కు చెందిన మరో ఆటగాడు హెచ్ ఎస్ ప్రణయ్ క్వార్టర్స్ కు చేరాడు. ప్రిక్వార్టర్స్ లో ప్రణయ్ 21-16,23-21 తేడాతో సు జెన్ హావో (చైనీస్ తైపీ)పై గెలిచి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకున్నాడు. తొలి గేమ్ ను శ్రమించి సొంతం చేసుకున్న ప్రణయ్ కు రెండో గేమ్ లో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నాడు.. అయితే కడవరకూ పోరాటాన్ని కొనసాగించిన ప్రణయ్ 23-21 తేడాతో గేమ్ ను సొంతం చేసుకోవడమే కాకుండా మ్యాచ్ ను కూడా సాధించాడు. ఇదిలా ఉంచితే, సమీర్ వర్మ పోరాటం మాత్రం ప్రిక్వార్టర్స్ లోనే ముగిసింది. ప్రిక్వార్టర్స్ లో సమీర్ వర్మ 21-10,17-21,15-21 తేడాతో షి యుకి (చైనా) చేతిలో ఓటమి పాలైయ్యాడు. తొలి గేమ్ ను సునాయాసంగా సాధించినప్పటికీ, మిగతా రెండు గేమ్ ల్లో సమీర్ విఫలమయ్యాడు. -
సైనా, శ్రీకాంత్‌లకు షాక్
టోక్యో : అన్ని మెగా ఈవెంట్స్‌లో పతకాలు సాధించడంతో... ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగినప్పటికీ... ప్రపంచ నంబర్‌వన్ సైనా నెహ్వాల్‌కు జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో అనూహ్య ఓటమి ఎదురైంది. సైనాతోపాటు పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ 4వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్, ప్రపంచ 12వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్‌లు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టారు. కేవలం పారుపల్లి కశ్యప్ మాత్రమే బరిలో మిగిలాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన రెండో సీడ్ సైనా నెహ్వాల్ 13-21, 16-21తో అన్‌సీడెడ్ మినత్సు మిటాని (జపాన్) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ 8వ ర్యాంకర్ కశ్యప్ 21-11, 21-19తో సహచరుడు శ్రీకాంత్‌పై విజయం సాధించి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. 45 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో... కశ్యప్ అద్భుతమైన షాట్లతో ఆకట్టుకున్నాడు. మరో మ్యాచ్‌లో హెచ్ఎస్ ప్రణయ్ 9-21, 16-21తో క్వాలిఫయర్ లీ డాంగ్ కెన్ (కొరియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో తియెన్ చెన్ చౌ (చైనీస్ తైపీ)తో కశ్యప్ ఆడతాడు. ముఖాముఖి రికార్డులో కశ్యప్ 2-1తో ఆధిక్యంలో ఉన్నాడు. -
భారత్ పోరాటం ముగిసింది
జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోక్యో: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్ల పోరు రెండో రౌండ్లోనే ముగిసింది. సింగిల్స్‌లో తాన్వి లాడ్, సౌరభ్‌వర్మ వెనుదిరగ్గా...డబుల్స్ జోడీలు ప్రభావం చూపలేకపోయాయి. తొలి రౌండ్లో సంచలనం సృష్టించిన తాన్వి తర్వాతి మ్యాచ్‌లో అదే ఆటతీరును పునరావృతం చేయలేకపోయింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి జిన్ ల్యూ 21-18, 21-12 తేడాతో తాన్విని సునాయాసంగా ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సౌరభ్ వర్మ 9-21, 6-21 స్కోరుతో నాలుగో సీడ్ కెనిచి టగో (జపాన్) చేతిలో చిత్తుగా ఓడాడు. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల- అశ్విని పొన్నప్ప జోడి పరాజయం పాలైంది. యున్ జంగ్-న కిమ్ (కొరియా) జంట 21-12, 21-23, 21-12తో భారత ద్వయంపై విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్‌లో కూడా ఇండియాకు కలిసి రాలేదు. అశ్విని-తరుణ్ కోన 17-21, 11-21 తేడాతో మిసాకి మట్సుటొమొ-కెనిచి హయకవ (జపాన్) జంట చేతిలో ఓడిపోయారు.