సైనా, శ్రీకాంత్‌లకు షాక్
టోక్యో : అన్ని మెగా ఈవెంట్స్‌లో పతకాలు సాధించడంతో... ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగినప్పటికీ... ప్రపంచ నంబర్‌వన్ సైనా నెహ్వాల్‌కు జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో అనూహ్య ఓటమి ఎదురైంది. సైనాతోపాటు పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ 4వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్, ప్రపంచ 12వ ర్యాంకర్ హెచ్‌ఎస్ ప్రణయ్‌లు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టారు. కేవలం పారుపల్లి కశ్యప్ మాత్రమే బరిలో మిగిలాడు.
భారీ అంచనాలతో బరిలోకి దిగిన రెండో సీడ్ సైనా నెహ్వాల్ 13-21, 16-21తో అన్‌సీడెడ్ మినత్సు మిటాని (జపాన్) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ 8వ ర్యాంకర్ కశ్యప్ 21-11, 21-19తో సహచరుడు శ్రీకాంత్‌పై విజయం సాధించి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. 45 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో... కశ్యప్ అద్భుతమైన షాట్లతో ఆకట్టుకున్నాడు. మరో మ్యాచ్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ 9-21, 16-21తో క్వాలిఫయర్ లీ డాంగ్ కెన్ (కొరియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో తియెన్ చెన్ చౌ (చైనీస్ తైపీ)తో కశ్యప్ ఆడతాడు. ముఖాముఖి రికార్డులో కశ్యప్ 2-1తో ఆధిక్యంలో ఉన్నాడు.