వెండితెర సోగ్గాడు @45 ఇయర్స్
ఒక్కో హీరో కెరీర్లో ఒక్కో సినిమా ఉంటుంది... కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా. జనం మనసు దోచి, బాక్సాఫీస్‌ను కొల్లగొట్టిన సినిమా. కాలం మారినా... మరపురాని సినిమా. ఆంధ్రుల అందాల నటుడిగా, ఇద్దరు హీరోయిన్ల ముద్దుల ప్రియుడిగా చరిత్ర సష్టించిన హీరో శోభన్ బాబు కెరీర్లో అలాంటి ఓ స్పెషల్ సినిమా ‘సోగ్గాడు’. అది ఎంత స్పెషల్ అంటే, ‘వెండితెర సోగ్గాడు’ అంటే శోభన్ బాబే అనేటంతగా స్పెషల్. సరిగ్గా 45 ఏళ్ళ క్రితం 1975 డిసెంబర్ 19న రిలీజైన ‘సోగ్గాడు’ చిత్రంలోని ఉర్రూతలూపిన పాటలు, బాక్సాఫీస్‌ను ఊపేసిన వసూళ్ళు ఇవాళ్టికీ ఓ చెరిగిపోని చరిత్రే!
గ్రామీణ నేపథ్యంలోని ఓ కథ గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని కేంద్రాలలో విజయఢంకా మోగించడం విశేషమే. శోభన్ బాబు హీరోగా, సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు అందించిన అలాంటి బాక్సాఫీస్ విశేషం ‘సోగ్గాడు’. ఊరంతా సోగ్గాడుగా పిలిచే శోభనాద్రి (శోభన్ బాబు), అతని మరదలు (జయసుధ), అనుకోకుండా నగరంలోని హోటల్ రూమ్‌లో అతను పెళ్ళాడిన అమ్మాయి (జయచిత్ర) మధ్య నడిచే కథ ఇది. కృష్ణాజిల్లా కోలవెన్ను, ఈడ్పుగల్లు, అలాగే రామానాయుడు తన స్వగ్రామం కారంచేడులో తొలిసారిగా షూటింగ్ చేసిన ఈ చిత్రం అప్పట్లో ఓ సెన్సేషనల్ హిట్. నిజజీవితంలోని తన బాబాయిని అనుకరిస్తూ, కోరమీసం, పంచెకట్టుతో, ఎడ్లబండి నడుపుతూ, ‘తస్సాదియ్యా’ అనే ఊతపదంతో ఆ రోజుల్లో శోభన్ బాబు చేసిన నటన, జయసుధ, జయచిత్రల గ్లామర్ అండగా ఆబాలగోపాలాన్ని అలరించిన సినిమా ఇది.
స్టార్ డమ్ తెచ్చిన సూపర్ హిట్:
శోభన్ బాబు కబడ్డీ ఆటగాడుగా కనిపించే ఈ చిత్రం అప్పట్లో ఎదురులేని ప్రజాదరణతో అఖండ విజయం సాధించింది. ‘సోగ్గాడు’ రిలీజవడానికి సరిగ్గా వారం ముందు... 1975 డిసెంబర్ 12న ఇదే చిత్ర దర్శకుడు కె. బాపయ్య డైరెక్షన్లోనే పెద్ద ఎన్టీఆర్ నటించిన ‘ఎదురులేని మనిషి’ వచ్చింది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మాత అశ్వినీదత్‌కు అదే తొలి సినిమా. ఎన్టీఆర్‌ను ఓ కొత్త పంథాలో చూపించిన ఆ సినిమా ఓ పక్కన ఆడుతుండగానే, సీనియర్ టాప్ హీరోతో పోటాపోటీగా శోభన్ బాబును నిలిపింది ‘సోగ్గాడు’. థియేటర్లలో విజయఢంకా మోగించిన ఈ చిత్రం విడుదలైన అనేక కేంద్రాలలో విజయ విహారం చేస్తూ, వసూళ్ళలో నూతన అధ్యాయం çసృష్టించింది.
బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు నెలకొల్పింది. విడుదలైన 31 కేంద్రాలలో 50 రోజుల పండగ జరుపుకొంది. 19 కేంద్రాలలో వందల రోజుల పైగా ఆడింది. శోభన్ బాబు కెరీర్లో అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న చిత్రం ఇదే. వెరసి... సరికొత్త స్టార్ హీరోగా శోభన్ బాబు అవతరించడానికి తోడ్పడింది. తమిళ స్టార్ శివాజీగణేశన్ ముఖ్య అతిథిగా చిత్రయూనిట్ అంతా పాల్గొనగా, విజయవాడలో వందరోజుల వేడుక జరుపుకొన్న ఈ చిత్రం బాపయ్యను కూడా దర్శకుడిగా మరో మెట్టు పైన పెట్టింది. దర్శకులు బాపయ్య, కె. రాఘవేంద్రరావు కజిన్స్. గమ్మత్తేమిటంటే, ఈ సినిమా షూటింగ్ సమయంలో రాజమండ్రిలో బాపయ్య మరో యూనిట్‌తో బిజీగా ఉండడంతో, రాఘవేంద్రరావు స్వయంగా హైదరాబాద్‌లో కొన్ని షాట్లు, ఇండోర్ సీన్లు తీసిపెట్టారు.
కెరీర్ బెస్ట్ ఇయర్:
నిజానికి, శోభన్ బాబు కెరీర్లోనే ఓ మరపురాని సంవత్సరం – 1975. ఆ ఏడాది శోభన్ బాబు సినిమాలు ఏకంగా 8 రిలీజయ్యాయి (‘దేవుడు చేసిన పెళ్ళి, అందరూ మంచివారే, బాబు, జీవనజ్యోతి, బలిపీఠం, జేబుదొంగ, గుణవంతుడు, సోగ్గాడు’). వాటిలో 5 సూపర్ హిట్లు. అలా ఆ ఏడాది శోభన్ బాబుకు బాగా కలిసొచ్చింది. ఆయన స్టార్ అయిపోయారు. ఒకే ఏడాది ‘జీవన జ్యోతి, సోగ్గాడు’– ఈ రెండు సూపర్ హిట్లతో శోభన్‌బాబు ఇమేజ్ తార స్థాయికి చేరింది. ఈ సినిమాతోనే నటి జయచిత్ర తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమయ్యారు. అప్పటికి వర్ధమాన నటి అయిన జయసుధ హీరో మరదలిగా సినిమాలో ఓ కీలక పాత్ర పోషించారు. తమిళ రచయిత బాలమురుగన్ అందించిన కథకు మోదుకూరి జాన్సన్ మాటలు, కె.వి. మహదేవన్ సంగీతంలో ఆచార్య ఆత్రేయ పాటలు ఆకట్టుకున్నాయి. గమ్మత్తేమిటంటే, నిజానికి ఈ చిత్రాన్ని నాగిరెడ్డి వారసుల విజయ కంబైన్స్, రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా సమర్పించినట్టు సినిమా టైటిల్ కార్డుల్లో ఉన్నా, పోస్టర్లు, పబ్లిసిటీలో మాత్రం విజయా కంబైన్స్ పేరు కనిపించదు. ఈ తెలుగు సూపర్ హిట్‌ను ఆ తరువాత హిందీలో జితేంద్ర, రేఖ జంటగా ‘దిల్ దార్’ పేరిట రీమేక్ చేశారు.
అందరూ కోరిన అందాల నటుడు:
ఆ రోజుల్లో ఎక్కడ విన్నా... మహదేవన్ బాణీల్లోని ‘సోగ్గాడు’ పాటలే. ‘సోగ్గాడు లేచాడు చూసి చూసి నీ దుమ్ము దులుపుతాడు...’ పాట వస్తూ ఉంటే, మాస్లో ఓ హిస్టీరియా. ఫ్యాన్స్ అయితే, తమ అభిమాన హీరో బాక్సాఫీస్ వద్ద జూలు విదిలించి, రికార్డుల దుమ్ము దులుపుతున్నాడని కేరింతలు కొట్టారు. ఈ సినిమాలోని ‘ఏడుకొండలవాడా వెంకటేశా.. ఓరయ్యో ఎంతపని చేశావు తిరుమలేశా’ అనే పాట రేడియోలో కొన్నేళ్ళు ఓ అభిమాన జనరంజక గీతం. అలాగే, ‘అవ్వా బువ్వా కావాలంటే అయ్యేదేనా అబ్బాయి’ పాట. ‘చలివేస్తోంది... చంపేస్తోంది...’ పాట కుర్రకారు మదిలో గిలిగింతలు పెట్టింది. ‘సోగ్గాడు’తో పతాక స్థాయికి చేరిన ఇమేజ్‌తో... పెళ్ళి కావాల్సిన అమ్మాయిలకు ఇలాంటి అబ్బాయి కావాలనే కోరిక పుట్టింది. కన్నవాళ్ళకు అలాంటి కొడుకు కావాలనే ప్రేమ వచ్చింది. తోడబుట్టినవాడు శోభన్ బాబు లాంటి తమ్ముడైతే బాగుండనే అభిమానం వెల్లువెత్తింది. ఆ తరువాత దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇద్దరు ప్రేయసుల మధ్య నలిగే అందాల నటుడిగా శోభన్ బాబు తెలుగుతెరను ఏలారు. అదీ ‘సోగ్గాడు’గా శోభన్‌బాబు చేసిన మేజిక్.
– రెంటాల జయదేవ