Jaya Kumar
-
నేనేమైనా తీవ్రవాదినా..?
సాక్షి, చెన్నై: ‘నేను తీవ్ర వాదినా..?’ అని మాజీ మంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆ విధంగా తనను జైలులో వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్ లభించడంతో శనివారం ఆయన జైలు నుంచి ఇంటికి చేరుకున్నారు. డీఎంకే నాయకుడిపై దాడి, అనుమతి లేకుండా ఆందోళన, స్థల కబ్జా తదితర కేసుల్లో జయకుమార్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఆయనకు శుక్రవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇందుకు తగ్గ ఉత్తర్వులు శనివారం ఉదయం జైళ్ల శాఖకు చేరింది. దీంతో ఆయన్ను విడుదల చేశారు. బయటకు వచ్చిన ఆయనకు అన్నాడీఎంకే వర్గాలు బ్రహ్మరథం పట్టాయి. పట్టినంబాక్కంలోని ఇంటి వద్ద మద్దతుదారులు హంగామా సృష్టించారు. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం (ఓపీఎస్), కో కన్వీనర్ పళని స్వామి(ఈపీఎస్), సీనియర్లు సీవీ షణ్ముగం, విజయభాస్కర్, దళవాయి సుందరం తదితర నేతలు ఇంటికి చేరుకుని జయకుమార్‌ను పరామర్శించారు. వేధించారు.. ఓ తీవ్రవాది తరహాలో తనతో పోలీసులు వ్యవహరించారని జయకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తనను అరెస్టు చేసిన రోజు కోర్టులో హాజరుపరచకుండా, ఎక్కడికెక్కడో వాహనంలో తిప్పారని ఆరోపించారు. తీవ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులను బంధించే పూందమల్లి జైల్లో తనను తీసుకెళ్లి పడేశారని వాపోయారు. చుట్టూ సీఆర్పీఎఫ్ బలగాల మధ్య జైల్లో నేలపై పడుకోవాల్సి వచ్చిందని ఉద్వేగానికి లోనయ్యారు. పలు మార్లు మంత్రిగా పనిచేశానన్న విషయాన్ని మరిచి తనతో దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తమ వాళ్లపై కేసులు పెడుతున్నారని సీవీ షణ్ముగం మండిపడ్డారు. అరెస్టుల పేరిట వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. -
శృంగార క్యాషియర్‌పై కేసు
తిరువొత్తియూరు: పలువురి మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్న క్యాషియర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తిరుచ్చి జిల్లా మణప్పారై మస్తాన్ వీధికి చెందిన ఎడ్విన్ జయకుమార్ (36) పుదుకోటై విరాలిమలైలోని ఇండియన్ బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి పలువురు స్త్రీలతో వివాహేతర సంబంధం ఉందని అతని భార్య పోలీసులను ఆశ్రయించింది. (శృంగార క్యాషియర్ ) దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేయగా బ్యాంకులో ఎడ్విన్ జయకుమార్ నాలుగేళ్లుగా పని చేస్తున్నాడని, అతను బ్యాంక్‌కు వచ్చే అందమైన మహిళల సెల్‌ఫోన్ నంబర్లను నోట్ చేసుకుని వారితో మాట కలిపి తన బుట్టలో వేసుకుంటాడని, తరువాత వారితో శృంగారాన్ని కొనసాగిస్తాడని తెలిసింది. బ్యాంకులో కాంట్రాక్టు ఉద్యోగిగా చేరిన ఓ మహిళను జయకుమార్ తన వైపు తిప్పుకుని ఆమెతో రాసలీలలు నడిపినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జయకుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న అతని కోసం విచారణ చేస్తున్నారు. -
ఎంపీనయ్యి ఆరునెలలే... అంతలోనేనా ?
తిరువళ్లూరు : ఎంపీగా గెలిచి ఆరునెలలు కూడా కాకుండానే సమస్యలు పరిష్కరించమంటే ఎలా సాధ్యమవుతుందటూ అర్జీదారులపై తిరువళ్లూరు ఎంపీ జయకుమార్ ఆగ్రహం వెళ్లగక్కారు. దీంతో చేసేదేమీలేక రైల్వే సంఘం నేతలు నిరాశతో వెనుదిరిగారు. వివరాల్లోకి వెళితే.. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు బీడీఓ కార్యాలయంలో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించే కార్యకమాన్ని మంగళవారం ఉదయం ఎంపీ జయకుమార్, ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ నేతృత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కడంబత్తూరుకు చెందిన 43 గ్రామాల నుంచి 467 మంది వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతిపత్రం సమర్పించారు. ఎంపీ వినతిపత్రాలు తీసుకుంటున్నారన్న విషయం తెలుసుకున్న కడంబత్తూరు రైలు ప్రయాణికులసంఘం నేతలు కూడా అక్కడికి వచ్చారు. ఎన్నికల హమీలో భాగంగా కడంబత్తూరు రైల్వేస్టేషన్‌కు అబివృద్ధి నిధులు కేటాయించడంతో పాటు పాస్ట్ ప్యాసింజర్ రైలు కడంబత్తూరులో ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైల్వే బ్రిడ్జి పనులు వేగంగా పూర్తి చేసేలా అధికారులపై ఒత్తిడి తేవాలన్నారు. 'ఇంతమంది ఒకేసారి వచ్చి తమ సమస్యలు పరిష్కరించమంటే ఎలా సాధ్యమవుతుందటూ మండిపడ్డారు. అయినా నేను ఎంపీనయ్యి ఆరు నెలలు కూడా కాలేదు.. కాస్త ఓపిక పట్టండి అంటూ ఎంపీ జయకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రయాణికుల సంఘం నేతలు నిరసన వ్యక్తం చేస్తూ బయటకు వచ్చారు. ఎంపీగా ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో ఎన్నో హమీలను గుప్పించారని ప్రజలతో నిత్యం మమేకమవుతాననీ హమీ ఇచ్చి ఇప్పడు ఇలా ప్రవర్తించడం సరికాదనీ వారు ఆసహనం వ్యక్తం చేశారు. వినతిపత్రాలు తీసుకున్న ఎంపీ వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పరిష్కారం కాని వినతిపత్రాలపై ప్రజలకు సమాచారం ఇవ్వాలని, ఎందుకు పరిష్కారం కాలేదో కూడా వివరించాలని సూచించారు. అయితే పరిష్కారం పేరిట భాదితులను తరచూ కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని ఎంపీ అధికారులను హెచ్చరించడం కొసమెరుపు. -
‘నాగార్జున గారు న్యాయం చేయండి’
దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘ఆఫీసర్’ చిత్ర కథ తనదేనంటూ రచయిత జయకుమార్ తెలిపారు. సర్కార్3 సమయంలో జయకుమార్...వర్మతో కలిసి పని చేశారు. గతంలో ఇలాగే తన కథను కాపీ కొట్టారని జయకుమార్ పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ‘ ఆఫీసర్’ కథ తనదే అంటూ, వర్మ కాపీ కొట్టారంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. జయకుమార్ తన ట్వీటర్ ఖాతాలో ‘నాగార్జున గారు.. మీరు సదరు డైరెక్టర్ గారికి బ్రేక్ ఇచ్చారు. కానీ ఆయన కొత్త వాళ్ల కెరీర్‌ను బ్రేక్ చేస్తున్నాడు. దయచేసి న్యాయం చేయండి’ అంటూ పోస్ట్ చేశారు. జయకుమార్ ఆఫీసర్ స్క్రిప్టును కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నాగార్జున గారు, @iamnagarjuna, సదరు డైరెక్టర్ గారికి మీరు break ఇచ్చారు కానీ ఆయన కొత్త వాళ్ళ careers ని break చేస్తున్నాడు. దయచేసి న్యాయం చెయ్యండి.https://t.co/mAmLA0qZRo — P Jaya Kumar (@iampjayakumar) May 18, 2018 -
వర్మ నన్ను లైంగికంగా వేధించారు
సాక్షి, హైదరాబాద్ : సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనను లైంగికంగా వేధించారంటూ సినీ రైటర్ పీ జయ కుమార్ శనివారం సంచలన ఆరోపణలు చేశారు. తనతో పాటు పలువురిని వర్మ లైంగికంగా వేధించారని అన్నారు. బాధితులు అందరూ త్వరలో బయటకు వస్తారని చెప్పారు. గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ షార్ట్‌ఫిలిం కథ తనదేనని అన్నారు. వర్మ వద్ద రైటర్‌గా పని చేసిన సమయంలో ఆయనకు జీఎస్టీ కథ వినిపించినట్లు చెప్పారు. ఇప్పుడు వర్మ తన కథను కాపీ కొట్టి జీఎస్టీని తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. రచయితలంటే వర్మకు గౌరవం లేదని అన్నారు. జీఎస్టీ విషయంలో తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. జయ కుమార్ ‘సర్కార్-3’ సినిమా స్క్రిప్టు విభాగంలో పని చేశారు. జయ కుమార్ ఆరోపణలను రామ్ గోపాల్ వర్మ ఖండించారు. కాగా, జీఎస్టీ చిత్రాన్ని వర్మ ప్రత్యేక వెబ్సైట్లో శనివారం ఉదయం విడుదల చేశారు. గత కొద్దిరోజులుగా ఈ చిత్రంపై వరుస వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. -
ఉక్కిరి బిక్కిరి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : అప్రకటిత విద్యుత్ కోతలు.. మండుతున్న ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాలో వారం రోజులుగా 42 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సమయంలో విద్యుత్ సరఫరా ఉండకపోవడంతో ప్రజలు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. = ప్రాజెక్టులో తగినంత నీరు లేకపోవడంతో శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి నిలిచిపోయింది. = మరోవైపు నాణ్యమైన బొగ్గు దొరకకపోవడంతో బొగ్గుతో పనిచేసే థర్మల్ విద్యుత్ కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదు. = కృష్ణా జిల్లాలోని ఎన్టీటీపీఎస్(నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్)లో సుమారు ఐదు వందల మెగావాట్ల విద్యుత్ తక్కువగా ఉత్పత్తి అవుతోంది. ఇదే పరిస్థితి రామగుండం, కొత్తగూడెం విద్యుత్ కేంద్రాల్లో ఉండగా ముద్దనూరు విద్యుత్ కేంద్రం పూర్తిగా మూతపడింది. విద్యుత్ ఉత్పత్తి తగ్గి వినియోగం పెరగడంతో ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ విధిస్తున్నట్టు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఎపీఎస్పీడీసీఎల్) అధికారులు చెబుతున్నారు. = ఒంగోలు నగరంలో కూడా అప్రకటిత విద్యుత్ కోత అమలవుతోంది. నాలుగు రోజులుగా వేళాపాళా లేకుండా సరఫరా నిలిపివేస్తున్నారు. రోజుకు కనీసం నాలుగైదు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. జిల్లా కేంద్రం ఒంగోలులోనూ ఇదే పరిస్థితి ఉండటం గమనార్హం. = జిల్లాలోని మున్సిపాలిటీల్లో కూడా లోడ్ రిలీఫ్ పేరుతో కోతలు విధిస్తున్నారు. = నైరుతీ రుతుపవనాలు వచ్చి వాతావరణం చల్లబడే వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. = కర్ణాటక, మహారాష్ట్రల్లో వర్షాలు పడి శ్రీశైలం జలాశయానికి నీరు వ చ్చి జల విద్యుత్ ఉత్పత్తి పెరిగితే అప్పుడు విద్యుత్ కోతలు తగ్గించే అవకాశం ఉంది. జలవిద్యుత్ నిలిచిపోవడం వల్లే : జయకుమార్, ఎస్ఈ, ట్రాన్స్‌కో రాష్ట్ర వ్యాప్తంగా జల విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. దీనికి తోడు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకావడం విద్యుత్ వినియోగం పెరిగిపోయింది. జిల్లాకు 390 మిలియన్ యూనిట్లు కావాల్సి ఉండగా 340 మిలియన్ యూనిట్ల వరకే సరఫరా అవుతోంది. ఉత్పత్తికి మించి వినియోగం పెరగడం వల్ల గ్రిడ్‌కు సాంకేతిక లోపం తలెత్తకుండా ఉండేందుకు అత్యవసరంగా విద్యుత్ లోడ్ రిలీఫ్ ఇవ్వాల్సి వస్తోంది. విద్యుత్ కోతలతో ఇబ్బంది : కె.ప్రసాద్, వ్యాపారి, పామూరు వేలకు వేలు వెచ్చించి కోత మిషన్, ఫినిషింగ్ యంత్రాలు తెచ్చి పెట్టుకున్నా విద్యుత్ కోతలతో ఉపయోగం లేకుండా పోతోంది. దుకాణంలో ఇద్దరికి జీతాలు ఇవ్వాలి. పగటి వేళ, ముఖ్యంగా పని సమయాల్లో కోతల పేరుతో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నా. కంప్యూటర్ సెంటర్ నిర్వహించడం కష్టంగా ఉంది : పశుపులేటి నారాయణ, పామూరు విద్యుత్ కోతలతో కంప్యూటర్ సెంటర్ నిర్వహించడం కష్టంగా ఉంది. ఇన్వర్టర్ ఉన్నా దాని ప్రభావం కొద్ది గంటలే. కంప్యూటర్ నేర్చుకోవాలన్న విద్యార్థుల ఆశలపై విద్యుత్ కోతలు నీళ్లు చల్లుతున్నాయి. వేల రూపాయల బాడుగలు చెల్లించి నెట్ సెంటర్లు నిర్వహించడం నిరుద్యోగ యువతకు కత్తిమీద సాములా మారింది.