అమ్మ కూర్చుంటున్నారు కానీ...!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చాలావరకు స్పృహలోనే ఉంటున్నారని, ఆస్పత్రిలో బెడ్ మీద లేచి కూర్చుంటున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. శ్వాసకోశ సమస్యల కారణంగా ఆమెకు కృత్రిమ శ్వాస మాత్రం అందించాల్సి వస్తోందన్నారు. సెప్టెంబర్ 22వ తేదీన జ్వరం, డీహైడ్రేషన్‌తో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత.. గత నెల రోజుల నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. ఆమెకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందని, దానికి చికిత్స చేస్తున్నామని వైద్యులు తెలిపారు. ఆమె మరన్నిరోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందాల్సి ఉంటుందని, ఆ తర్వాత మాత్రమే ఊపిరి అందించే ట్యూబును ఉంచాలా తీసేయాలా అన్నది నిర్ణయించగలమని అన్నారు.
జయలలితకు పూర్తిగా నయమైపోయిందని, ఆమె త్వరలోనే ఇంటికి తిరిగివస్తారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి గురువారం అన్నారు. వైద్యుల సలహా మేరకు ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారని, అది తప్ప ఆమెకు పూర్తిగా నయమైపోయిందని చెప్పారు. ఆరోగ్యం విషయంలో దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడని, త్వరలోనే ఆమె తిరిగి ఇంటికి వస్తారని ఆమె తెలిపారు.
ఆమె ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నందువల్ల లండన్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ఎయిమ్స్ నుంచి వచ్చిన ముగ్గురు వైద్యుల బృందం కూడా ఆమె చికిత్సను పర్యవేక్షించింది. దాదాపు నెల రోజుల నుంచి అమ్మ ఆస్పత్రిలోనే ఉండిపోవడంతో ఆమె వద్ద ఉన్న కీలక శాఖలను ఆర్థికమంత్రి ఓ పన్నీరు సెల్వంకు అప్పగించారు. గతవారం టేబుల్ మీద జయలలిత ఫొటో ఉంచి, ఆమె కుర్చీని ఖాళీగానే ఉంచి ఆయన కేబినెట్ సమావేశం నిర్వహించారు.