JCC
-
‘మా నాన్న ఎన్నికల్లో పోటీ చేయరు’
రాయ్‌పూర్: మాజీ ముఖ్యమంత్రి, ఛత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్ (జేసీసీ) నాయకుడు అజిత్ జోగి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఈ విషయాన్ని ఆయన తనయుడు అమిత్ జోగి వెల్లడించారు. మహాకూటమి అభ్యర్థుల ప్రచారంపైనే ఆయన దృష్టి కేంద్రీకరిస్తారని తెలిపారు. బహుజన సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐతో కలిసి జేసీసీ మహాకూటమి ఏర్పాటు చేసిందన్నారు. ‘ఆయన (అజిత్ జోగి) రాష్ట్రమంతా ప్రచారం చేయడంపైనే దృష్టి పెడతారు. మహాకూటమి అభ్యర్థులందరి తరపున ప్రచారం సాగిస్తారు. ఎన్నికల్లో ఆయన పోటీ చేయరు. పార్టీ ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే మా లక్ష్యమ’ని అమిత్ జోగి చెప్పారు. (చదవండి: మాయావతి నిర్ణయం రాహుల్‌కు దెబ్బే!) జేసీసీతో కలిసి పోటీ చేయనున్నట్టు సెప్టెంబర్ 20న బహుజన సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. మొత్తం 90 స్థానాల్లో జేసీసీ 55, బీఎస్పీ 35 చోట్ల పోటీ చేస్తాయని మాయావతి తెలిపారు. జేసీసీ 45 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సివుంది. గత ఆదివారం సీపీఐ కూడా చేరడంతో కొంతా, దంతెవాడ స్థానాలను ఆ పార్టీకి ఇవ్వనున్నట్టు అజిత్ జోగి ప్రకటించారు. బస్తర్ ప్రాంతంలో ఈ నెల 20 నుంచి 24 వరకు ఆయన ఎన్నికల ప్రచారం సాగించనున్నారు. -
జీసీసీతో వాల్‌మార్ట్ ఎంవోయూ
అరకు కాఫీ కొనుగోలుకు ఒప్పందం * నెలాఖరుకు కుదిరే అవకాశం * ఏటా రూ.కోటి వ్యాపారం సాక్షి, విశాఖపట్నం: గిరిజన సహకార సంస్థ (జీసీసీ) మరో ముందడుగు వేయబోతోంది. ప్రపంచ ప్రఖ్యాత వాల్‌మార్ట్ సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకోనుంది. రుచిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అరకు కాఫీ కొనుగోలుకు వాల్‌మార్ట్ ఆసక్తిగా ఉంది. గత డిసెంబర్ 13న అరకు కాఫీ మార్కెట్లోకి విడుదలైంది. ఆ తర్వాత జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు, అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్)లలో అరకు కాఫీకి ప్రాచుర్యం లభించింది. సీఐఐ అంతర్జాతీయ సదస్సులో జీసీసీ అరకు కాఫీ స్టాల్‌ను ఏర్పాటు చేసింది. సదస్సుకు వచ్చిన ముఖ్యమంత్రితో పాటు విదేశీ ప్రతినిధులు ఈ కాఫీ రుచి చూశారు. ఫిబ్రవరిలో జరిగిన ఐఎఫ్ఆర్కూ ఏయూ ఇంజినీరింగ్ మైదానంలో ఏర్పాటు చేసిన ఐఎఫ్ఆర్ విలేజిలో జీసీసీకి స్టాల్ కేటాయించారు. అందులో అరకు కాఫీని సేవించిన ప్రధాని నరేంద్రమోదీ క్యా టేస్ట్హై అంటూ మెచ్చుకున్నారు. ఐఎఫ్ఆర్ జరిగిన నాలుగు రోజుల్లోనూ సుమారు పది వేల కాఫీలు అమ్ముడయ్యాయి. ఇలా సీఐఐ సదస్సు, ఐఎఫ్ఆర్ల్లో రూ.20 లక్షల విలువైన కాఫీ పొడి, రూ.5 లక్షల విలువైన లిక్విడ్ కాఫీ అమ్మకాలు విశాఖలోనే జరిగాయి. మరోవైపు ఆన్లైన్ మార్కెట్లోనూ అరకు కాఫీ అందుబాటులో ఉంది. గిఫ్ట్ ప్యాక్లుగా..: అరకు కాఫీ.. గిఫ్ట్ ప్యాక్‌ల రూపంలోనూ ప్రముఖులకు అందజేస్తున్నారు. ఇటీవల విశాఖ వచ్చిన కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లతో పాటు ఆయనతో వచ్చిన అమెరికా ప్రతినిధి బృందానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టక్కర్, బొబ్బిలి వీణతో కలిపి అరకు కాఫీని గిఫ్ట్ ప్యాకెట్లుగా ఇచ్చారు. నెలాఖరుకల్లా ఎంవోయూ ఇటీవల వాల్‌మార్ట్ వైస్ ప్రెసిడెంట్ రజనీష్ కుమార్‌తో జీసీసీ చర్చలు జరిపింది. కొద్దిరోజుల క్రితం వాల్‌మార్ట్ సంస్థ క్వాలిటీ కంట్రోల్ బృందం వచ్చి కాఫీ నాణ్యతను పరిశీలించి వెళ్లింది. నెలాఖరు నాటికి వాల్‌మార్ట్‌తో ఎంవోయూ కుదరవచ్చని జీసీసీ ఎండీ ఏఎస్‌పీఎస్ రవిప్రకాష్ ‘సాక్షి’కి చెప్పారు. వాల్‌మార్ట్‌కు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఔట్లెట్లు ఉన్నాయన్నారు. వాల్‌మార్ట్‌కు ఏటా రూ.కోటి రూపాయల విలువైన అరకు కాఫీని సరఫరా చేసే అవకాశం ఉందని, డిమాం డ్‌ను బట్టి మరింత పెంచుతామని తెలిపారు. -
జీసీసీ సూపర్ బజార్లలో సీసీ కెమెరాలు
సాక్షి, విశాఖపట్నం: ఇన్నాళ్లు సరైన పర్యవేక్షణ లేక ఆదరణ అంతంతమాత్రంగా ఉన్న గిరిజన సహకార సంస్థ (జీసీసీ) సూపర్ బజార్లు మళ్లీ గాడిలో పడుతున్నాయి. వీటిని బలోపేతం చేసేందుకు జీసీసీ పాలకవర్గం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాల నిస్తున్నాయి. క్రమక్రమంగా అమ్మకాల జోరందుకుంటున్నాయి. సిబ్బందిలో కూడా పారదర్శకత పెరుగుతోంది. జీసీసీ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా పాడేరు, అరకు, శ్రీకాకుళం జిల్లా సీతంపేట, తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడవరం, అడ్డతీగలలో సూపర్బజార్లు నడుస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలు నిర్వహిస్తున్న సూపర్ మార్కెట్లకు ధీటుగానే ఈ సూపర్బజార్లు పని చేస్తున్నాయి. ఇన్నాళ్లు వీటి లో పనిచేసే సిబ్బందిని పర్యవేక్షించే నాథుడు లేక... ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారు. కొంతమంది సిబ్బందైతే అందిన కాడకి దోచేసి వీటిని నిర్వీర్యం చేశారు. ఈ నేపథ్యంలో బాధ్యతలు చేపట్టిన జీసీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్.పి.ఎస్.రవిప్రకాష్ వీటిపై ప్రత్యేక దష్టి పెట్టారు. ఆకస్మిక తనిఖీలు చేస్తూ సూపర్ బజార్లలో అమ్మకాలు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. క్షేత్ర స్థాయిలో అవకతవకలకు పాల్పడిన సిబ్బందిపై చర్యలు తీసుకోవడం, వారు కాజేసిన సొమ్ము వసూలు చేస్తున్నారు. మరో పక్క సూపర్ బజార్లలో జరిగే క్రయవిక్రయాలకు సంబంధించిన లావాదేవీలన్నీ ఆన్లైన్ చేశారు. ఖర్చు చేసే ప్రతీరూపాయితో పాటు వచ్చే ప్రతీ పైసా అకౌంట్‌బులిటీ అయ్యే విధంగా ఆన్లైన్ అకౌంటింగ్ సిస్టమ్‌ను అమలులోకి తీసుకొచ్చారు. పైగా ఏ సమయంలో ఎక్కడ ఏం జరుగుతుందో విశాఖ జీసీసీ కార్యాలయంలోని తన చాంబర్ నుంచే తెలుసుకునేందుకు వీలుగా ప్రతీ సూపర్ బజార్లోనూ క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలను అమర్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పాడేరులో ఈ కెమెరాలను అమర్చారు. ప్రస్తుతం ప్రతి నెలా రంపచోడవరం సూపర్‌బజార్ ద్వారా రూ.12 లక్షలు, పాడేరు, అడ్డతీగల బజార్ల ద్వారా రూ.పదేసి లక్షలు, అరకు, సీతంపేట బజార్ల ద్వారా రూ.రెండేసి లక్షల చొప్పున అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ ఐదు బజార్ల ద్వారా ప్రస్తుతం నెలకు రూ.40 లక్షల వరకు అమ్మకాలు సాగుతుండగా, వీటిని రూ.కోటికి పెంచాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు జీసీసీ వైస్ చైర్మన్ రవిప్రకాష్ తెలిపారు. భవిష్యత్తులో ప్రయివేట్ సూపర్ మార్కెట్లకు ధీటుగా వీటిని మరింత ఆధునికీకరించేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. వీటిని పూర్తి స్థాయిలో గాడిలో పెట్టి అమ్మకాలను పెంచి లాభాలబాట పట్టేలా చర్యలు తీసుకు న్నామని, సిబ్బందిలో కూడా జవాబుదారీతనం తీసుకొచ్చామని చెప్పారు. వీటిని బలోపేతం చేసిన తర్వాత వీటిని మరింత విస్తరించే చర్యలు చేపడతామని తెలిపారు. -
విద్యుత్ కోతలతో వెతలు
గుర్గావ్: విద్యుత్ సంక్షోభం కారణంగా గత రెండు వారాలుగా నగరవాసులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆవాస, వాణిజ్య ప్రాంతాలకు రోజుకు 12 గంటలపాటు విద్యుత్ సరఫరాలో కోత విధిస్తున్నారు. విద్యుత్ సరఫరాలో కోతలకు వేళాపాళా లేకుండాపోయింది. ఈ విషయమై నగరంలోని ఆర్డీ సిటీ ప్రాంత నివాసి టీఎన్ కౌల్ మాట్లాడుతూ తమ ప్రాంతంలో గంటకోసారి కరెంట్ పోతోందన్నారు. రోజంతా ఇదే పరిస్థితి కొనసాగుతోందన్నారు. ఒక్కోసారి ఆరు నుంచి ఎనిమిది గంటలవరకూ కరెంట్ రావడం లేదన్నారు. కాగా నగరంలోని డీఎల్ఎఫ్-3, 4, సుశాంత్ లోక్, ఉద్యోగ్ విహార్, ఐఎంటీ మనేసార్లలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ కోతలతో విసిగిపోయిన గుర్గావ్ సిటిజన్స్ కౌన్సిల్ (జీసీసీ) దీనిపై న్యాయపోరాటానికి దిగాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధ్యక్షుడు ఆర్.ఎస్.రథీ వెల్లడించారు. ఆయా కాలనీవాసులు దక్షిణ్ హర్యానా బిజిలీ వితరణ్ నిగం (డీహెచ్‌బీవీఎన్)పై దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలిస్తున్నామని, అదే బాటలో తాము కూడా పయనిస్తామని చెప్పారు. త్వరలో జరగనున్న రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్డబ్ల్యూఎస్) సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తుతామని ఆయన వివరించారు. కాగా కొద్దిరోజుల క్రితం నగరంలో పెనుగాలిదుమారం వీచిన సంగతి విదితమే. దీని ధాటికి డీహెచ్‌బీవీఎన్)కు చెందిన ట్రాన్స్మిషన్ లైన్లు ధ్వంసమయ్యాయి. దీంతో అనేక ప్రాంతాలకు విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారిపోయింది. విద్యుత్ సరఫరాలో కోత ప్రభావం నగరంలో నీటి సరఫరాకు కూడా తీవ్ర విఘాతం కలిగించింది. దీంతో నగరవాసులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. మూడురోజులుగా నగరంలోని అనేక ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. ఈ విషయమై డీఎల్ఎఫ్ అధికార ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ మూడు రోజులుగా చుక్క నీరు రావడం లేదు. బసాయి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఈ పరిస్థితి తలెత్తింది’ అని అన్నారు. ఈ విషయమై డీహెచ్బీవీఎన్కు చెందిన ఉన్నతాధికారి మాట్లాడుతూ విద్యుత్ సంక్షోభం తలెత్తితే దాని ప్రభావం నీటి సరఫరాపై కూడా సహజంగానే పడుతుందన్నారు. అందువల్ల బసాయి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు ప్రత్యేకంగా ఓ సబ్‌స్టేషన్‌ను నిర్మించాలని కోరుతూ ఎంసీజీతోపాటు హుడాకు ఓ లేఖ రాశామన్నారు. ఇదొక్కటే నీటి సరఫరాలో కోతకు శాశ్వత పరిష్కారమన్నారు. మరో అధికారి సంజీవ్ చోప్రా మాట్లాడుతూ దౌలతాబాద్, బాద్షాపూర్ సబ్‌స్టే షన్లలో సాంకేతిక సమస్యల ప్రభావం నగరంపై తీవ్రంగా పడిందన్నారు. పెనుదుమారం కారణంగా దెబ్బతిన్న ఫీడర్లను వీలై నంత త్వరగా పునరుద్ధరిస్తామన్నారు. వాస్తవానికి విద్యుత్ కొరత సమస్య అనేదే లేదని, అయితే సాంకేతిక అవరోధాల వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన వివరించారు. సిబ్బంది కొరతతో సమస్య జటిలం గుర్గావ్: ట్రాన్స్మిషన్ లైన్లలో తలెత్తిన సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు డిస్కం వద్ద తగి నంత సిబ్బంది లేరు. ఇది విద్యుత్ సంక్షోభాన్ని మరింత జటిలం చేస్తోంది. వాస్తవానికి తమకు 1,500 మంది సిబ్బంది అవసరమని, ప్రస్తుతం 500 మంది మాత్రమే ఉన్నారని దక్షిణ్ హర్యానా బిజిలీ వితరణ్ నిగం (డీహెచ్‌బీవీఎన్) జనరల్ మేనేజర్ సంజీవ్ చోప్రా వెల్లడించారు.తమ సర్కిల్లో చివరిసారిగా 30 ఏళ్ల క్రితం నియామకాలు జరిగాయన్నారు. అప్పట్లో తమ సర్కిల్ పరిధిలోని వినియోగదారుల సంఖ్య లక్షమంది మాత్రమేనన్నారు. అయితే ప్రస్తుతం వారి సంఖ్య నాలుగు లక్షలకు చేరుకుందన్నారు. వినియోగదారుల సంఖ్య బాగా పెరిగిపోయినప్పటికీ సిబ్బంది సంఖ్యలో ఎంతమాత్రమూ మార్పు లేదన్నారు. అప్పట్లో ఒకటి లేదా రెండు సబ్స్టేషన్లు మాత్రమే ఉన్నాయన్నారు. తమ సర్కిల్ పరిధిలో తలెత్తే సమస్యలను పరిష్కరించాలంటే కనీసం 1,500 మంది సిబ్బంది అవసరమన్నారు. ప్రతి ఏడాది తమ సర్కిల్ పరిధిలో వినియోగదారుల సంఖ్య ప్రతి ఏడాది కనీసం 2,000 చొప్పున పెరుగుతోందన్నారు. తమ బాధ్యతలను మరింత బాధ్యతాయుతంగా, సమర్థంగా నిర్వర్తిచాలంటే వినియోగదారుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నందువల్ల సిబ్బంది సంఖ్య కూడా పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇక వర్షాకాలంలో అయితే బ్రేక్డౌన్లు అత్యంత సహజమన్నారు.దీంతోపాటు అనేకరకాల సాంకేతిక సమస్యలు అత్యంత సహజంగా తలెత్తుతాయన్నారు. ఎక్కడైనా సాంకేతిక సమస్య తలెత్తితే అక్కడికి పంపేందుకు తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో పరిష్కారమయ్యేందుకు చాలా సమయం పడుతోందన్నారు. ఒక్కోసారి అనేక ప్రాంతాల్లో ఒకేసారి బ్రేక్‌డౌన్ సమస్య కూడా తలెత్తుతుం టుందన్నారు. వేసవి ఆరంభం నుంచేవేసవి కాలం ఆరంభం నుంచే నగరంలో విద్యుత్ సరఫరాలో కోత విధిస్తున్నారని పలు కాలనీలు, సెక్టార్ల వాసులు ఆరోపిస్తున్నారు. దానికి కూడా వేళాపాళా ఉండదన్నారు. ఇష్టారాజ్యంగా కోత విధిస్తున్నారంటూ వాపోయారు. ఎన్నో పర్యాయాలు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఇదిలావుంచితే వడగాడ్పులు, ఉక్కపోతలను తట్టుకునేందుకు బిల్డర్లకు చెందిన జనరేటర్లపై ఆధారపడుతున్నారు.