జీసీసీతో వాల్‌మార్ట్ ఎంవోయూ
అరకు కాఫీ కొనుగోలుకు ఒప్పందం
* నెలాఖరుకు కుదిరే అవకాశం
* ఏటా రూ.కోటి వ్యాపారం
సాక్షి, విశాఖపట్నం: గిరిజన సహకార సంస్థ (జీసీసీ) మరో ముందడుగు వేయబోతోంది. ప్రపంచ ప్రఖ్యాత వాల్‌మార్ట్ సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకోనుంది. రుచిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అరకు కాఫీ కొనుగోలుకు వాల్‌మార్ట్ ఆసక్తిగా ఉంది. గత డిసెంబర్ 13న అరకు కాఫీ మార్కెట్లోకి విడుదలైంది. ఆ తర్వాత జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు, అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)లలో అరకు కాఫీకి ప్రాచుర్యం లభించింది.
సీఐఐ అంతర్జాతీయ సదస్సులో జీసీసీ అరకు కాఫీ స్టాల్‌ను ఏర్పాటు చేసింది. సదస్సుకు వచ్చిన ముఖ్యమంత్రితో పాటు విదేశీ ప్రతినిధులు ఈ కాఫీ రుచి చూశారు. ఫిబ్రవరిలో జరిగిన ఐఎఫ్‌ఆర్‌కూ ఏయూ ఇంజినీరింగ్ మైదానంలో ఏర్పాటు చేసిన ఐఎఫ్‌ఆర్ విలేజిలో జీసీసీకి స్టాల్ కేటాయించారు. అందులో అరకు కాఫీని సేవించిన ప్రధాని నరేంద్రమోదీ క్యా టేస్ట్‌హై అంటూ మెచ్చుకున్నారు. ఐఎఫ్‌ఆర్ జరిగిన నాలుగు రోజుల్లోనూ సుమారు పది వేల కాఫీలు అమ్ముడయ్యాయి. ఇలా సీఐఐ సదస్సు, ఐఎఫ్‌ఆర్‌ల్లో రూ.20 లక్షల విలువైన కాఫీ పొడి, రూ.5 లక్షల విలువైన లిక్విడ్ కాఫీ అమ్మకాలు విశాఖలోనే జరిగాయి. మరోవైపు ఆన్‌లైన్ మార్కెట్లోనూ అరకు కాఫీ అందుబాటులో ఉంది.
గిఫ్ట్ ప్యాక్‌లుగా..: అరకు కాఫీ.. గిఫ్ట్ ప్యాక్‌ల రూపంలోనూ ప్రముఖులకు అందజేస్తున్నారు. ఇటీవల విశాఖ వచ్చిన కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లతో పాటు ఆయనతో వచ్చిన అమెరికా ప్రతినిధి బృందానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టక్కర్, బొబ్బిలి వీణతో కలిపి అరకు కాఫీని గిఫ్ట్ ప్యాకెట్లుగా ఇచ్చారు.
నెలాఖరుకల్లా ఎంవోయూ
ఇటీవల వాల్‌మార్ట్ వైస్ ప్రెసిడెంట్ రజనీష్ కుమార్‌తో జీసీసీ చర్చలు జరిపింది. కొద్దిరోజుల క్రితం వాల్‌మార్ట్ సంస్థ క్వాలిటీ కంట్రోల్ బృందం వచ్చి కాఫీ నాణ్యతను పరిశీలించి వెళ్లింది. నెలాఖరు నాటికి వాల్‌మార్ట్‌తో ఎంవోయూ కుదరవచ్చని జీసీసీ ఎండీ ఏఎస్‌పీఎస్ రవిప్రకాష్ ‘సాక్షి’కి చెప్పారు. వాల్‌మార్ట్‌కు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఔట్‌లెట్‌లు ఉన్నాయన్నారు. వాల్‌మార్ట్‌కు ఏటా రూ.కోటి రూపాయల విలువైన అరకు కాఫీని సరఫరా చేసే అవకాశం ఉందని, డిమాం డ్‌ను బట్టి మరింత పెంచుతామని తెలిపారు.