విద్యుత్ కోతలతో వెతలు | power cuts in new Gurgaon | Sakshi
Sakshi News home page

విద్యుత్ కోతలతో వెతలు

Published Tue, Jun 17 2014 10:42 PM | Last Updated on Thu, Sep 27 2018 2:34 PM

power cuts in new Gurgaon

గుర్గావ్: విద్యుత్ సంక్షోభం కారణంగా గత రెండు వారాలుగా నగరవాసులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆవాస, వాణిజ్య ప్రాంతాలకు రోజుకు 12 గంటలపాటు విద్యుత్ సరఫరాలో కోత విధిస్తున్నారు. విద్యుత్ సరఫరాలో కోతలకు వేళాపాళా లేకుండాపోయింది. ఈ విషయమై నగరంలోని ఆర్డీ సిటీ ప్రాంత నివాసి టీఎన్ కౌల్ మాట్లాడుతూ తమ ప్రాంతంలో గంటకోసారి కరెంట్ పోతోందన్నారు. రోజంతా ఇదే పరిస్థితి కొనసాగుతోందన్నారు. ఒక్కోసారి ఆరు నుంచి ఎనిమిది గంటలవరకూ కరెంట్ రావడం లేదన్నారు. కాగా నగరంలోని డీఎల్‌ఎఫ్-3, 4, సుశాంత్ లోక్, ఉద్యోగ్ విహార్, ఐఎంటీ మనేసార్‌లలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ కోతలతో విసిగిపోయిన గుర్గావ్ సిటిజన్స్ కౌన్సిల్ (జీసీసీ) దీనిపై న్యాయపోరాటానికి దిగాలని యోచిస్తోంది.
 
 ఈ విషయాన్ని ఆ సంస్థ అధ్యక్షుడు ఆర్.ఎస్.రథీ వెల్లడించారు. ఆయా కాలనీవాసులు దక్షిణ్ హర్యానా బిజిలీ వితరణ్ నిగం (డీహెచ్‌బీవీఎన్)పై దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలిస్తున్నామని, అదే బాటలో తాము కూడా పయనిస్తామని చెప్పారు. త్వరలో జరగనున్న రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్‌డబ్ల్యూఎస్) సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తుతామని ఆయన వివరించారు. కాగా కొద్దిరోజుల క్రితం నగరంలో పెనుగాలిదుమారం వీచిన సంగతి విదితమే. దీని ధాటికి డీహెచ్‌బీవీఎన్)కు చెందిన  ట్రాన్స్‌మిషన్ లైన్లు ధ్వంసమయ్యాయి. దీంతో అనేక ప్రాంతాలకు విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారిపోయింది. విద్యుత్ సరఫరాలో కోత ప్రభావం నగరంలో నీటి సరఫరాకు కూడా తీవ్ర విఘాతం కలిగించింది. దీంతో నగరవాసులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.
 
 మూడురోజులుగా నగరంలోని అనేక ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. ఈ విషయమై డీఎల్‌ఎఫ్ అధికార ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ మూడు రోజులుగా చుక్క నీరు రావడం లేదు. బసాయి వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఈ పరిస్థితి తలెత్తింది’ అని అన్నారు. ఈ విషయమై డీహెచ్‌బీవీఎన్‌కు చెందిన ఉన్నతాధికారి మాట్లాడుతూ విద్యుత్ సంక్షోభం తలెత్తితే దాని ప్రభావం నీటి సరఫరాపై కూడా సహజంగానే పడుతుందన్నారు. అందువల్ల బసాయి వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు ప్రత్యేకంగా ఓ సబ్‌స్టేషన్‌ను నిర్మించాలని కోరుతూ ఎంసీజీతోపాటు హుడాకు ఓ లేఖ రాశామన్నారు.
 
 ఇదొక్కటే నీటి సరఫరాలో కోతకు శాశ్వత పరిష్కారమన్నారు. మరో అధికారి సంజీవ్ చోప్రా మాట్లాడుతూ దౌలతాబాద్, బాద్షాపూర్ సబ్‌స్టే షన్లలో సాంకేతిక సమస్యల ప్రభావం నగరంపై తీవ్రంగా పడిందన్నారు. పెనుదుమారం కారణంగా దెబ్బతిన్న ఫీడర్లను వీలై నంత త్వరగా పునరుద్ధరిస్తామన్నారు. వాస్తవానికి విద్యుత్ కొరత సమస్య అనేదే లేదని, అయితే సాంకేతిక అవరోధాల వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన వివరించారు.
 
 సిబ్బంది కొరతతో సమస్య జటిలం
 గుర్గావ్: ట్రాన్స్‌మిషన్ లైన్లలో తలెత్తిన సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు డిస్కం వద్ద తగి నంత సిబ్బంది లేరు. ఇది విద్యుత్ సంక్షోభాన్ని మరింత జటిలం చేస్తోంది. వాస్తవానికి తమకు 1,500 మంది సిబ్బంది అవసరమని, ప్రస్తుతం 500 మంది మాత్రమే ఉన్నారని దక్షిణ్ హర్యానా బిజిలీ వితరణ్ నిగం (డీహెచ్‌బీవీఎన్) జనరల్ మేనేజర్ సంజీవ్ చోప్రా వెల్లడించారు.తమ సర్కిల్‌లో చివరిసారిగా 30 ఏళ్ల క్రితం నియామకాలు జరిగాయన్నారు. అప్పట్లో తమ సర్కిల్ పరిధిలోని వినియోగదారుల సంఖ్య లక్షమంది మాత్రమేనన్నారు. అయితే ప్రస్తుతం వారి సంఖ్య నాలుగు లక్షలకు చేరుకుందన్నారు. వినియోగదారుల సంఖ్య బాగా పెరిగిపోయినప్పటికీ సిబ్బంది సంఖ్యలో ఎంతమాత్రమూ మార్పు లేదన్నారు. అప్పట్లో ఒకటి లేదా రెండు సబ్‌స్టేషన్లు మాత్రమే ఉన్నాయన్నారు. తమ సర్కిల్ పరిధిలో తలెత్తే సమస్యలను పరిష్కరించాలంటే కనీసం 1,500 మంది సిబ్బంది అవసరమన్నారు.
 
 ప్రతి ఏడాది తమ సర్కిల్ పరిధిలో వినియోగదారుల సంఖ్య ప్రతి ఏడాది కనీసం 2,000 చొప్పున పెరుగుతోందన్నారు. తమ బాధ్యతలను మరింత బాధ్యతాయుతంగా, సమర్థంగా నిర్వర్తిచాలంటే వినియోగదారుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నందువల్ల సిబ్బంది సంఖ్య కూడా పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇక వర్షాకాలంలో అయితే బ్రేక్‌డౌన్లు అత్యంత సహజమన్నారు.దీంతోపాటు అనేకరకాల సాంకేతిక సమస్యలు అత్యంత సహజంగా తలెత్తుతాయన్నారు. ఎక్కడైనా సాంకేతిక సమస్య తలెత్తితే అక్కడికి పంపేందుకు తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో పరిష్కారమయ్యేందుకు చాలా సమయం పడుతోందన్నారు.
 
 ఒక్కోసారి అనేక ప్రాంతాల్లో ఒకేసారి బ్రేక్‌డౌన్ సమస్య కూడా తలెత్తుతుం టుందన్నారు. వేసవి ఆరంభం నుంచేవేసవి కాలం ఆరంభం నుంచే నగరంలో విద్యుత్ సరఫరాలో కోత విధిస్తున్నారని పలు కాలనీలు, సెక్టార్ల వాసులు ఆరోపిస్తున్నారు. దానికి కూడా వేళాపాళా ఉండదన్నారు. ఇష్టారాజ్యంగా కోత విధిస్తున్నారంటూ వాపోయారు. ఎన్నో పర్యాయాలు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఇదిలావుంచితే వడగాడ్పులు, ఉక్కపోతలను తట్టుకునేందుకు బిల్డర్లకు చెందిన జనరేటర్లపై ఆధారపడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement