ఏటీఎంలో డబ్బుల వర్షం
జైపూర్: డీమానిటైజేషన్, నగదు కొరతతో ఇబ్బందులు పడ్డ ఖాతాదారులకు రాజస్థాన్ లోని ఒక ఏటీఎం డబ్బుల వర్షం కురిపించడం కలకలం రేపింది. రాజధాని జైపూర్ కు సమీపంలోని టాంక్ గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఏంలో డబ్బులు డ్రా చేసుకున్న వ్యక్తుల్ని లక్కీస్టార్స్ ని చేసేసింది. అడిగిన దానికంటే ఎక్కువగా భారీ మొత్తంలో నగదును అందించింది. దీంతో ఏటిఎం కేంద్రానికి వచ్చిన ప్రజలు హఠాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బులో రావడంతో భలే చాన్సులే.. లల..లల. లక్కీ ఛాన్స్ లే అంటూ చాలా సంతోషంగా సంబరాలు చేసుకున్నారు. అయితే 100 నోట్లకు బదులుగా రెండు వేల నోట్లు జారీ కావడంతో ఈ పరిణామం సంభవించిందని ప్రాథమికంగా భావిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే జితేష్ దివాకర్ ఏటీఎంకు వెళ్లి.. 3500 కావాలని టైప్ చేశాడు. కానీ రూ 3,500 స్థానంలో రూ 70వేలు రావడంతో షాకయ్యాడు. దాదాపు ఇదే అనుభవం మిగిలినవారికి కూడా ఎదురైంది. అయితే ఏటీఎం మిషీన్ లో లోపాన్ని తండ్రి, ఇతర బంధువులకు చేరవేశాడు దివాకర్. వారు బ్యాంక్ మేనేజర్ కు సమాచారం అందించడంతో బ్యాంక్ సిబ్బంది అప్రమత్తయ్యారు. వెంటనే ఏటీఎంను మూసివేశారు. కానీ అప్పటికే రూ.6.76 లక్షలు విత్ డ్రా అయిపోయాయి.
రూ.100 నోట్ల స్లాట్ లో రూ.2 వేల నోట్లను లోడ్ చేయడం వల్ల లోపం తలెత్తిందని బ్యాంక్ ప్రతినిధి హరిశంకర్ మీనా తెలిపారు. కానీ సాధారణంగా ఇలా జరగదనీ, సాంకేతికంగా రూ 100 కేసెట్ లో రూ 2వేల నోట్లు లోడ్ చేయడం సాధ్యం కాదని అందుకే ఈ తప్పిదంపై సాంకేతిక నిపుణులతో సంప్రదించనున్నట్టు తెలిపారు. అలాగే ఏటీఎం మెషీన రికార్డుల అధారంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. వారి సహకారంతో నగదును ఖాతాదారులనుండి తిరిగి రాబడతామ చెప్పారు. దివాకర్ ఒక్కరే తమకు సమాచారం అందించాడనీ.. మిగిలినవారు అదనపు నగదు తో ఇంటికి వెళ్లి మిన్నకుండిపోయారని మీనా వ్యాఖ్యానించారు.