'పాకిస్థాన్ మాటలు నమ్మొద్దు'
న్యూఢిల్లీ: అబద్దాలు ఆడడం పాకిస్థాన్ డీఎన్ ఏ భాగమని, దేనిని అంగీకరించకపోవడం ఆ దేశం నైజమని ఆర్మీ మాజీ చీఫ్ జేజే సింగ్ అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో పాకిస్థాన్ మాటలు నమ్మొద్దని, మన సైన్యానికి అందరూ బాసటగా నిలవాలని కోరారు. అసత్యాలు ప్రచారం చేయడానికి దాయాది దేశం ఎప్పుడు వెనుకాడబోదని మండిపడ్డారు. పాక్ నాయకులు పచ్చి అబద్దాలుకోరులని దుయ్యబట్టారు. పాకిస్థాన్ మిలటరీ, దౌత్యపరంగా కార్గిల్ లోనే ఓడిపోయిందని గుర్తు చేశారు. బిన్ లాడెన్ ను చంపినపుడే పాకిస్థాన్ ఎటువంటిదో ప్రపంచానికి తెలిసిందని చెప్పారు.
సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించిన వీడియోలు బయటపెట్టమని అడిగే అధికారం అందరికీ లేదని స్పష్టం చేశారు. ఇది చాలా సున్నితమైన అంశమని, దీనికి సంబంధించిన ఆధారాలు ఎవరికీ పడితే వారికి ఇవ్వడం కుదరదని పేర్కొన్నారు. ఆర్మీ ఒక విషయం చెప్పిన తర్వాత అనుమానాలు అవసరం లేదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం మంచిది కాదన్నారు.