బ్లాక్ బెరీకి భారీ నష్టాలు
లండన్: కెనడా మొబైల్ కంపెనీ బ్లాక్ బెరీ ఊహించని విధంగా నష్టాలు చవిచూసింది. స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు బాగా పడిపోవడంతో గత రెండేళ్లలో ఎన్నడులేని విధంగా భారీగా నష్టపోయింది. ఈ ఏడాది మొదటి ఆర్థిక త్రైమాసికంలో కేవలం 5 లక్షల ఫోన్లు మాత్రమే విక్రయించింది. దీంతో కంపెనీకి సుమారు రూ.4500 కోట్ల (670 మిలియన్ డాలర్లు) నష్టం వాటిల్లింది. గతేడాది మొదటి త్రైమాసికంలో 6 లక్షల ఫోన్లు విక్రయించింది.
ఫోన్ల అమ్మకాలు పెంచుకునేందుకు బ్లాక్ బెరీ చేసిన పునర్ వ్యవస్థీకరణ ప్రయత్నాలు ఫలించలేదు. గతేడాది ఆండ్రాయిడ్ ఓఎస్ తో ప్రివ్ స్మార్ట్ ఫోన్లు ప్రవేశపెట్టింది. అయినప్పటికీ ఫోన్ల అమ్మకాలు ఏమాత్రం పెరగలేదు. హేండ్ సెట్ల బిజినెస్ తో పెద్దగా లాభం లేదని బ్లాక్ బెరీ సీఈవో జాన్ చెన్ అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో ఫోన్ల అమ్మకాల నుంచి వైదొలగాలని బ్లాక్ బెరీ భావిస్తోంది. దీనిపై సెప్టెంబర్ లో నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి బ్లాక్ బెరీ ఓఎస్ 10కు సేవలు నిలిపివేస్తామని వాట్సప్ ఇప్పటికే ప్రకటించింది. బ్లాక్ బెరీ ప్లాట్ ఫామ్ నుంచి వైదొలుగుతున్నట్టు ఇటీవలే ఫేస్బుక్ వెల్లడించింది.