ముహూర్తం ఎప్పుడో?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో నెలకొన్న జాప్యం ఆశావహుల్లో ఉత్కంఠ పెంచుతోంది. కేబినెట్ కొలువులకు ముహూర్తం ఎప్పుడో తెలియక వారిలో ఆందోళన ఎక్కువవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు ఈ నెల 13న రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం, ఆయనతోపాటు మహమూద్ అలీ ఒక్కరే మంత్రిగా ప్రమాణం చేయడం తెలిసిందే. ఐదారు రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రమాణస్వీకారానికి ముందు రోజు కేసీఆర్ స్వయంగా చెప్పారు. అయితే ప్రభుత్వం ఏర్పడి రెండు వారాలు దాటినా మంత్రివర్గ విస్తరణపై స్పష్టత రాకపోవడంతో పదవులను ఆశిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరీక్షణకు తెరపడటంలేదు.
జనవరి 4 వరకు మాత్రమే మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉంటుందని... అయితే అష్టమి, నవమి కారణంగా ఆదివారం, సోమవారం... జనవరి 4న చతుర్దశి కావడంతో ఈ రోజుల్లో వీలుకాదని వేద పండితులు చెబుతున్నారు. జనవరి 5 నుంచి ఫిబ్రవరి 7 వరకు పుష్యమాసం ఉంటుందని... ఈ రోజుల్లో మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉండదని అంటున్నారు. దీంతో జనవరి 1, 2, 3 తేదీల్లోనే ముహూర్తాలు ఉంటాయని చెబుతున్నారు. సాధారణంగా ముహూర్తాల విషయంలో బాగా గురి ఉండే సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణకు ఏ తేదీని ఎంచుకుంటున్నారనేది ఆసక్తి పెంచుతోంది.
అప్పటివరకు కేబినెట్ విస్తరణ జరగకుంటే ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలకు ముందు చేపట్టే అవకాశం ఉండనుంది. అయితే వివిధ రాష్ట్రాల్లో పర్యటన ముగించుకొని సీఎం కేసీఆర్ శుక్రవారం హైదరాబాద్ చేరుకోవడంతో మంత్రివర్గ విస్తరణ తేదీలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆశావహులు భావిస్తున్నారు. ప్రస్తుతం చేపట్టే మంత్రివర్గ విస్తరణలో గరిష్టంగా 8 మందికి అవకాశం ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత మిగిలిన ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.
చేరికల తర్వాతే ప్రక్రియ...
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల తరఫున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని టీఆర్ఎస్ ముఖ్యలు చెబుతున్నారు. దీంతో ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరిక ప్రక్రియ ముగిశాకే మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని అంటున్నారు. టీడీపీ తరఫున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారని, త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెబుతున్నారు. అలాగే కాంగ్రెస్‌కు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్తో టచ్‌లో ఉన్నారని, వారి చేరిక తర్వాత అప్పటి సమీకరణలకు అనుగుణంగా కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.
అధికారులలో చర్చ...
మంత్రివర్గ విస్తరణపై అధికార వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణలో ఎందరికి అవకాశం ఉంటుంది, వారిలో ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనే అంశాలపై ఐఎస్ఎస్ అధికారులు చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులనే కొనసాగిస్తే వారికి అవే శాఖలను కేటాయిస్తారా లేదా అనే అంశంపైనా వారు మాట్లాడుకుంటున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు వారాలు గడిచినా మంత్రివర్గం ఏర్పడకపోవడం అరుదైన సందర్భమని సీనియర్ అధికారులు చెబుతున్నారు.
‘సీఎం కేసీఆర్ చాలా విషయాల్లో ఎన్టీఆర్‌ను అనుసరిస్తున్నారు. ప్రజాసంక్షేమ కార్యక్రమాల్లో ఇంకాస్త ముందుకు వెళ్లి నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాజకీయ నిర్ణయాల్లోనూ ఇలాగే చేస్తున్నారు. బడ్జెట్ అంశాలు బహిర్గతమయ్యాయని ఎన్టీఆర్ 1989లో మంత్రివర్గం మొత్తాన్ని రద్దు చేశారు. 15 రోజుల వరకు ఎన్టీఆర్ ఒక్కరే సీఎంగా ఉన్నారు. ఆ తర్వాతే మంత్రివర్గాన్ని విస్తరించారు’అని సచివాయలంలోని ఓ సినియర్ ఐఏఎస్ అధికారి ప్రస్తుత సందర్భాన్ని ఉదహరించారు.
హైదరాబాద్‌కు సీఎం కేసీఆర్...
ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ పర్యటన కోసం ఈ నెల 23న హైదరాబాద్ నుంచి వెళ్లిన కేసీఆర్... ఆరు రోజుల పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. కేసీఆర్ హైదరాబాద్ రావడంతో మంత్రివర్గ విస్తరణ, అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహణపై చర్చ మొదలైంది. కేబినెట్లో చోటు కోసం ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను కలిసే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.
ఢిల్లీలో టీఆర్ఎస్ ఆఫీసు కోసం స్థలాల మ్యాపుల పరిశీలన...
దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ ఆఫీసు ఏర్పాటుకు సంబంధించి మూడు ప్రాంతాల మ్యాపులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శుక్రవారం పరిశీలించారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సభ్యుల సంఖ్యాబలం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం పార్టీ ఆఫీసు నిర్మాణం కోసం వెయ్యి గజాల స్థలం కేటాయింపునకు మూడు ప్రాంతాలను ప్రతిపాదించింది. ఢిల్లీలోని సాకేత్, వసంత్ విహార్, ఐటీవో సమీపంలోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లలో స్థలం కేటాయింపు ప్రతిపాదనలు చేసింది. ఎంపీ బి. వినోద్ కుమార్ ఇటీవలే ఆ ప్రాంతాలను పరిశీలించగా ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వెళ్లే ముందు కేసీఆర్ ఆయా ప్రాంతాల మ్యాపులను పరిశీలించారు. వాటి వివరాలను తెలంగాణ భవన్ అధికారులు కేసీఆర్‌కు వివరించారు. సంక్రాంతి తర్వాత ఢిల్లీలో కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి 2, 3 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.