Joint Collector Rama Rao
-
ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానంలో జిల్లా ఫస్ట్
జాయింట్ కలెక్టర్ రామారావు ప్రొద్దుటూరు కల్చరల్ : ఓటరు కార్డుకు ఆధార్ కార్డు అనుసంధానంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జాయింట్ కలెక్టర్ రామారావు అన్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కృషితో వీఆర్ఓ స్థాయి నుంచి ఆర్డీఓ వరకు అందరు ఎంతో కృషి చేశారని, దీని వలనే 13వ స్థానంలో నుంచి 1వ స్థానంలోకి చేరిందన్నారు. ఇంత వరకు ఆధార్‌తో ఓటరు కార్డు లింకేజి చేసుకోని వారి ఓట్లు ఎందుకు తొలగించకూడదంటూ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. వారం రోజుల గడువులో సరైన వివరణ ఇవ్వకపోతే ఓటరు జాబితా నుంచి తొలగిస్తారన్నారు. జిల్లాలో రైతులకు గతంలోని పాసుపుస్తకాల స్థానంలో ఈ పాస్‌పుస్తకాలు మంజూరు చేశామన్నారు. టైటిల్ డీడ్‌ను జిల్లాలోనే ముద్రించి రైతులకు జారీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఈ పాస్‌పుస్తకాల కోసం 12346 దరఖాస్తులు రాగా వాటిలో 404 దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలిపారు. 8676 మందికి ఈ పాస్ పుస్తకాలను జారీ చేశామన్నారు. పట్టణంలోని గ్యాస్ ఏజెన్సీ డీలర్లు అధిక ధరలను వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులను విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వినాయకం, తహశీల్దార్ రాంభూపాల్‌రెడ్డిలు ఉన్నారు. విషపూరిత డ్రమ్ములను తొలగించాలి గోపవరం పంచాయతీ పరిధిలోని ఇందిరా నగర్లో ఉన్న విషపూరిత లిక్విడ్ డ్రమ్ములను తొలగించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి బాలలక్షుమయ్య, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, మురళీ, ప్రసాద్, రాయుడు జాయింట్ కలెక్టర్ రామారావుకు వినతి పత్రం అందించారు. అలాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మురళీకృష్ణమనాయుడు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని జేసీని కోరారు. -
ట్రక్షీట్ల మాయాజాలంపై విచారణకు ఆదేశం
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ట్రక్షీట్ల మాయాజాలంైపై కలెక్టర్ ఎం.ఎం.నాయక్ సీరియస్‌గా స్పందించారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని జాయింట్ కలెక్టర్ రామారావును ఆదేశించారు. సీరియల్ నంబర్లు లేకుండా ట్రక్షీటులను ఎలా ముద్రించారని, రైసు మిల్లర్ల చేతికి ఎలా వెళ్లాయో నిగ్గుతేల్చాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉండాల్సిన ట్రక్‌షీటు మిల్లర్ల చేతికి వెళ్లాయని, వీటిని ఆధారంగా చేసుకుని పలువురు మిల్లర్లు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, రూ.కోట్లలోనే కుంభకోణం జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ‘ట్రిక్’షీట్లు అనే శీర్షికతో ‘సాక్షి’లో బుధవారం ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీన్ని కలెక్టర్ ఎం.ఎం.నాయక్ సీరియస్‌గా తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సీఎస్‌డీటీల చేత విచారణ జరిపించి, నివేదిక ఇవ్వాలని జేసీని ఆదేశించారు. అలాగే, మిల్లులు కొనుగోలు చేసిన ధాన్యమెంత ? ఉన్న నిల్వలెంత? కస్టమ్ మిల్లింగ్ ఎంత? తదితర వాటిపై కూడా విచారణ జరపాలని ఆదేశించారు. -
భావి పౌరులపైనే దేశ భవిష్యత్తు
ఘనంగా ప్రారంభమైన బాలల చలనచిత్రాల ఫ్రదర్శన కడప కల్చరల్ : దేశ భవిష్యత్తు భావిపౌరులైన నేటి బాలలపైనే ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ రామారావు పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కడప ఆధ్వర్యంలో శుక్రవారం కడప నగరంలోని మురళి థియేటర్లో బాలల దినోత్సవ వేడుకలు, చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేసీ మాట్లాడుతూ బాలల్లో అనుకరించే గుణం ఉంటుందన్నారు. మంచిని మాత్రమే అనుకరించి విజయ సాధనకు పునాదులు వేసుకోవాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలతో ఉజ్వల భవిష్యత్తును సాధించి దేశాభివృద్దికి తోడ్పడాలన్నారు. సమాజం పట్ల బాధ్యతగా మెలగాలని ఉద్బోధించారు. ఆర్డీఓ లవన్న మాట్లాడుతూ బాల్యంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, అందుకు ఆటలు, వ్యాయామం అవసరమన్నారు. సినీ, టీవీ యువ నటి వర్షిణి ఈ సందర్భంగా తన గురించిన విశేషాలను వివరించారు. తన తల్లిదండ్రులు సహకరించడంతోనే తాను నృత్యం, సినీ, టీవీ రంగాలలో పేరు సాధించానన్నారు. ఈ సందర్బంగా ఆమె సీరియల్లోని కొన్ని డైలాగులుచెప్పి అందరినీ అలరించారు. లయన్స్‌క్లబ్ ఆఫ్ కడప అధ్యక్షులు బాలాజీ సుకుమార్ సభకు అధ్యక్షత వహించారు. లయన్స్ క్యాంపు చైర్మన్ పి.రమేష్, కార్యదర్శి లక్ష్మిరెడ్డి, సభ్యులు తిరుపాలయ్య, ఈకే బాబు తదితరులు పాల్గొన్నారు. నిర్వాహకులు ఈ సందర్భంగా అతిథులను సత్కరించారు. నటి వర్షిణితో పలువురు బాలలు ఫొటోలు దిగేందుకు ఉత్సాహం కనబరిచారు. ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. అనంతరం బాలల చలనచిత్రాన్ని ప్రదర్శించారు.