ఓటరు కార్డుకు ఆధార్ కార్డు అనుసంధానంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జాయింట్ కలెక్టర్ రామారావు అన్నారు.
జాయింట్ కలెక్టర్ రామారావు
ప్రొద్దుటూరు కల్చరల్ : ఓటరు కార్డుకు ఆధార్ కార్డు అనుసంధానంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జాయింట్ కలెక్టర్ రామారావు అన్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కృషితో వీఆర్‌ఓ స్థాయి నుంచి ఆర్డీఓ వరకు అందరు ఎంతో కృషి చేశారని, దీని వలనే 13వ స్థానంలో నుంచి 1వ స్థానంలోకి చేరిందన్నారు. ఇంత వరకు ఆధార్‌తో ఓటరు కార్డు లింకేజి చేసుకోని వారి ఓట్లు ఎందుకు తొలగించకూడదంటూ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు.
వారం రోజుల గడువులో సరైన వివరణ ఇవ్వకపోతే ఓటరు జాబితా నుంచి తొలగిస్తారన్నారు. జిల్లాలో రైతులకు గతంలోని పాసుపుస్తకాల స్థానంలో ఈ పాస్‌పుస్తకాలు మంజూరు చేశామన్నారు. టైటిల్ డీడ్‌ను జిల్లాలోనే ముద్రించి రైతులకు జారీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఈ పాస్‌పుస్తకాల కోసం 12346 దరఖాస్తులు రాగా వాటిలో 404 దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలిపారు. 8676 మందికి ఈ పాస్ పుస్తకాలను జారీ చేశామన్నారు. పట్టణంలోని గ్యాస్ ఏజెన్సీ డీలర్లు అధిక ధరలను వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులను విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వినాయకం, తహశీల్దార్ రాంభూపాల్‌రెడ్డిలు ఉన్నారు.
విషపూరిత డ్రమ్ములను తొలగించాలి
గోపవరం పంచాయతీ పరిధిలోని ఇందిరా నగర్‌లో ఉన్న విషపూరిత లిక్విడ్ డ్రమ్ములను తొలగించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి బాలలక్షుమయ్య, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, మురళీ, ప్రసాద్, రాయుడు జాయింట్ కలెక్టర్ రామారావుకు వినతి పత్రం అందించారు. అలాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మురళీకృష్ణమనాయుడు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని జేసీని కోరారు.