journalist dies
-
మద్యంసేవించి ఐఏఎస్ డ్రైవింగ్.. జర్నలిస్ట్ మృతి
తిరువనంతపురం: మద్యం సేవించే కారు ప్రమాదం చేసిన ఐఏఎస్ అధికారి ఓ జర్నలిస్ట్ మృతికి కారణమయ్యాడు. మితిమీరిన వేగంతో కారును నడిపి ఓ జర్నలిస్ట్ ప్రాణాన్ని బలిగొన్నాడు. కేరళకు చెందిన శ్రీరామ్ వెంకటరామన్ అనే ఐఏఎస్ అధికారి కారు వేగంగా నడిపి బైక్‌పై వెళ్తున్న పాత్రికేయుడిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ప్రముఖ మలయాళ పత్రిక ‘సిరాజ్’ బ్యూరో ఛీఫ్ మహమ్మద్ బషీర్(35) మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున త్రివేండ్రం మ్యూజియం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో కారులో అఫ్జా అనే మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో బైక్‌పై ఉన్న బషీర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కారులో ఉన్న ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంకటరామన్ మోతాదుకి మించి మద్యం సేవించినట్లు వైద్యుల పరీక్షల్లో తేలింది. అయితే తాను కారు నడపలేదని, తన స్నేహితురాలే నడిపారని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడున్న స్థానికలు మాత్రం దీనికి భిన్నంగా చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ప్రమాదానికి గురైన కారు ఆ మహిళ పేరిట రిజిస్టర్ అయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే బషీర్ మృతిపై సరైన విధంగా విచారణలో జరపాలని కేరళ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. బషీర్ మృతిపట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. -
పత్రికపై కక్ష.. మారణహోమం
వాషింగ్టన్: ఒక వార్తాపత్రికపై కక్ష పెంచుకున్న వ్యక్తి.. అమెరికాలోని అన్నాపోలిస్ నగరంలో మారణహోమం సృష్టించాడు. పత్రిక కార్యాలయంలోకి చొరబడి స్మోక్ గ్రనేడ్లు విసిరి గన్‌తో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఐదురుగు మరణించగా.. వారిలో నలుగురు జర్నలిస్టులు. అమెరికా రాజధాని వాషింగ్టన్కు 50 కి.మీ దూరంలో ఉన్న మేరిల్యాండ్ రాష్ట్రం అన్నాపోలిస్‌లోని ‘క్యాపిటల్ గెజిట్’ పత్రికా కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం(భారత కాలమానం శుక్రవారం అర్ధరాత్రి) జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు గాయపడ్డారు. దుండగుడు జరోద్ వారెన్ రామోస్(38)ను పోలీసులు అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. క్యాపిటల్ గెజిట్ పత్రికకు వ్యతిరేకంగా 2012లో పరువునష్టం దావా వేసిన రామోస్ ఆ కేసులో ఓడిపోవడంతో కక్ష పెంచుకుని ఈ ఘోరానికి పాల్పడ్డాడు. అంత ఘోరం జరిగినా.. క్యాపిటల్ గెజిట్ సిబ్బంది బాధను దిగమింగుకుని తర్వాతి రోజు పత్రికను మార్కెట్లోకి తీసుకురావడం ద్వారా కాల్పుల్లో మరణించిన సహచర సిబ్బందికి నివాళులర్పించారు. ముందస్తు లక్ష్యంతోనే దాడి ‘ముందస్తు లక్ష్యంతోనే దుండగుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. కాల్పులు జరిపేందుకు అన్నీ సిద్ధం చేసుకుని పత్రికా కార్యాలయానికి వచ్చాడు’ అని స్థానిక కౌంటీ డిప్యూటీ పోలీసు చీఫ్ విలియం క్రాంఫ్ తెలిపారు. కాల్పుల్లో పత్రిక అసిస్టెంట్ ఎడిటర్ రాబ్ హియాసెన్, ఎడిటోరియల్ పేజ్ ఎడిటర్ గెరాల్డ్ పిస్క్మేన్, ఎడిటర్ అండ్ రిపోర్టర్ జాన్ మెక్నమార, స్పెషల్ పబ్లికేషన్స్ ఎడిటర్ వెండీ వింటర్స్, సేల్స్ అసిస్టెంట్ రెబెక్కా స్మిత్‌లు మరణించారని ఆయన వెల్లడించారు. మీడియా కథనాల ప్రకారం.. 2011లో పత్రికలో వచ్చిన ఒక వార్త తనను అపఖ్యాతి పాలు చేసేలా ఉందని రామోస్ పరువునష్టం కేసు వేశాడు. ఆ కేసులో అతను ఓడిపోయాడు. సోషల్ మీడియాలో ఒక మహిళను వేధించిన కేసులో రామోస్ నేరాంగీకార వివరాలు పత్రికలో ప్రచురితమయ్యాయి. విచారణకు సహకరించని నిందితుడు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి నిందితుడు బల్ల కింద దాక్కున్నాడని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన కొద్దిసేపటికే రామోస్‌ను అదుపులోకి తీసుకున్నామని... విచారణకు అతను సహకరించడం లేదని వారు వెల్లడించారు. తన గుర్తింపును కనుగొనకుండా రామోస్ చేతివేళ్లకు గాయం చేసుకున్నాడని.. అయితే అతని ముఖాకృతి ఆధారంగా పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ వివరాల్ని పోలీసులు సేకరించారని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న గెజిట్ పత్రిక విలేకరి ట్వీట్ చేస్తూ.. ‘దుండగుడు న్యూస్‌రూం గాజు తలుపుపై గుళ్ల వర్షం కురిపించి పలువురు ఉద్యోగులపై కాల్పులకు పాల్పడ్డాడు’ అని ఘోరాన్ని గుర్తుచేశారు. ట్రంప్ సంతాపం ఈ సంఘటన పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. డెమొక్రటిక్ పార్టీ నేత నాన్సీ పెలోసీ మాట్లాడుతూ.. సామూహిక కాల్పులు, రోజువారీ తుపాకీ హింస అనేక మంది ప్రాణాల్ని బలి తీసుకుంటుందని, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా అమెరికన్ కాంగ్రెస్ తక్షణం చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. తుపాకీ హింసపై కాంగ్రెస్ స్పందించాలని భారతీయ సంతతి కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా కూడా డిమాండ్ చేశారు. -
పాముకాటుతో జర్నలిస్టు మృతి
మడకశిర : గుడిబండ మండలం కేఎన్పల్లికి చెందిన హరీష్ (42) అనే జర్నలిస్టు పాముకాటుకు గురై శుక్రవారం మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. ఓ దినపత్రికలో మడకశిర టౌన్‌కు జర్నలిస్టుగా పనిచేస్తున్న హరీష్ గురువారం సాయంత్రం తన స్వగ్రామంలో మల్బరీ ఆకులు కోయడానికి వెళ్లిన సమయంలో పాము కాటు వేసింది. వెంటనే ఇతడిని మడకశిర ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి హిందూపురం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యుల సూచన మేరకు బెంగళూరు ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మడకశిర ప్రభుత్వ ఆస్పత్రిలో జర్నలిస్టు మృతదేహాన్ని ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఈరన్న సందర్శించి నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైఎన్ రవిశేఖర్‌రెడ్డి, ఏడీసీసీ బ్యాంకు ఉపాధ్యక్షుడు కే ఆనందరంగారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి రంగేగౌడ్, గుడిబండ వైఎస్సార్సీపీ నేత జీబీ కరుణాకర్‌గౌడ్, గుడిబండ జెడ్పీటీసీ డాక్టర్ శ్రీనివాసమూర్తి, కాంగ్రెస్ నాయకులు ఎస్ ప్రభాకర్‌రెడ్డి, నాగేంద్ర, అక్రమ్, నారాయణప్ప తదితరులు కూడా నివాళులర్పించిన వారిలో ఉన్నారు. పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి, వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి కూడా జర్నలిస్ట్ మృతికి సంతాపం తెలిపారు.