దాడి జరిగిన పత్రికా కార్యాలయం వద్ద పోలీసులు. (ఇన్‌సెట్‌లో) నిందితుడు వారెన్ రామోస్
వాషింగ్టన్: ఒక వార్తాపత్రికపై కక్ష పెంచుకున్న వ్యక్తి.. అమెరికాలోని అన్నాపోలిస్ నగరంలో మారణహోమం సృష్టించాడు. పత్రిక కార్యాలయంలోకి చొరబడి స్మోక్ గ్రనేడ్‌లు విసిరి గన్‌తో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఐదురుగు మరణించగా.. వారిలో నలుగురు జర్నలిస్టులు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌కు 50 కి.మీ దూరంలో ఉన్న మేరిల్యాండ్ రాష్ట్రం అన్నాపోలిస్‌లోని ‘క్యాపిటల్ గెజిట్’ పత్రికా కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం(భారత కాలమానం శుక్రవారం అర్ధరాత్రి) జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు గాయపడ్డారు.
దుండగుడు జరోద్ వారెన్ రామోస్(38)ను పోలీసులు అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. క్యాపిటల్ గెజిట్ పత్రికకు వ్యతిరేకంగా 2012లో పరువునష్టం దావా వేసిన రామోస్ ఆ కేసులో ఓడిపోవడంతో కక్ష పెంచుకుని ఈ ఘోరానికి పాల్పడ్డాడు. అంత ఘోరం జరిగినా.. క్యాపిటల్ గెజిట్ సిబ్బంది బాధను దిగమింగుకుని తర్వాతి రోజు పత్రికను మార్కెట్లోకి తీసుకురావడం ద్వారా కాల్పుల్లో మరణించిన సహచర సిబ్బందికి నివాళులర్పించారు.
ముందస్తు లక్ష్యంతోనే దాడి
‘ముందస్తు లక్ష్యంతోనే దుండగుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. కాల్పులు జరిపేందుకు అన్నీ సిద్ధం చేసుకుని పత్రికా కార్యాలయానికి వచ్చాడు’ అని స్థానిక కౌంటీ డిప్యూటీ పోలీసు చీఫ్ విలియం క్రాంఫ్ తెలిపారు. కాల్పుల్లో పత్రిక అసిస్టెంట్ ఎడిటర్ రాబ్ హియాసెన్, ఎడిటోరియల్ పేజ్ ఎడిటర్ గెరాల్డ్ పిస్క్‌మేన్, ఎడిటర్ అండ్ రిపోర్టర్ జాన్ మెక్‌నమార, స్పెషల్ పబ్లికేషన్స్ ఎడిటర్ వెండీ వింటర్స్, సేల్స్ అసిస్టెంట్ రెబెక్కా స్మిత్‌లు మరణించారని ఆయన వెల్లడించారు. మీడియా కథనాల ప్రకారం.. 2011లో పత్రికలో వచ్చిన ఒక వార్త తనను అపఖ్యాతి పాలు చేసేలా ఉందని రామోస్ పరువునష్టం కేసు వేశాడు. ఆ కేసులో అతను ఓడిపోయాడు. సోషల్ మీడియాలో ఒక మహిళను వేధించిన కేసులో రామోస్ నేరాంగీకార వివరాలు పత్రికలో ప్రచురితమయ్యాయి.
విచారణకు సహకరించని నిందితుడు
సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి నిందితుడు బల్ల కింద దాక్కున్నాడని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన కొద్దిసేపటికే రామోస్‌ను అదుపులోకి తీసుకున్నామని... విచారణకు అతను సహకరించడం లేదని వారు వెల్లడించారు. తన గుర్తింపును కనుగొనకుండా రామోస్ చేతివేళ్లకు గాయం చేసుకున్నాడని.. అయితే అతని ముఖాకృతి ఆధారంగా పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ వివరాల్ని పోలీసులు సేకరించారని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న గెజిట్ పత్రిక విలేకరి ట్వీట్ చేస్తూ.. ‘దుండగుడు న్యూస్‌రూం గాజు తలుపుపై గుళ్ల వర్షం కురిపించి పలువురు ఉద్యోగులపై కాల్పులకు పాల్పడ్డాడు’ అని ఘోరాన్ని గుర్తుచేశారు.
ట్రంప్ సంతాపం
ఈ సంఘటన పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. డెమొక్రటిక్ పార్టీ నేత నాన్సీ పెలోసీ మాట్లాడుతూ.. సామూహిక కాల్పులు, రోజువారీ తుపాకీ హింస అనేక మంది ప్రాణాల్ని బలి తీసుకుంటుందని, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా అమెరికన్ కాంగ్రెస్ తక్షణం చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. తుపాకీ హింసపై కాంగ్రెస్ స్పందించాలని భారతీయ సంతతి కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా కూడా డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment