గుడిబండ మండలం కేఎన్‌పల్లికి చెందిన హరీష్ (42) అనే జర్నలిస్టు పాముకాటుకు గురై శుక్రవారం మృతి చెందాడు.
మడకశిర : గుడిబండ మండలం కేఎన్‌పల్లికి చెందిన హరీష్ (42) అనే జర్నలిస్టు పాముకాటుకు గురై శుక్రవారం మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. ఓ దినపత్రికలో మడకశిర టౌన్‌కు జర్నలిస్టుగా పనిచేస్తున్న హరీష్ గురువారం సాయంత్రం తన స్వగ్రామంలో మల్బరీ ఆకులు కోయడానికి వెళ్లిన సమయంలో పాము కాటు వేసింది. వెంటనే ఇతడిని మడకశిర ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి హిందూపురం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యుల సూచన మేరకు బెంగళూరు ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు.
మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మడకశిర ప్రభుత్వ ఆస్పత్రిలో జర్నలిస్టు మృతదేహాన్ని ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఈరన్న సందర్శించి నివాళులర్పించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైఎన్ రవిశేఖర్‌రెడ్డి, ఏడీసీసీ బ్యాంకు ఉపాధ్యక్షుడు కే ఆనందరంగారెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి రంగేగౌడ్, గుడిబండ వైఎస్సార్‌సీపీ నేత జీబీ కరుణాకర్‌గౌడ్, గుడిబండ జెడ్పీటీసీ డాక్టర్ శ్రీనివాసమూర్తి, కాంగ్రెస్ నాయకులు ఎస్ ప్రభాకర్‌రెడ్డి, నాగేంద్ర, అక్రమ్, నారాయణప్ప తదితరులు కూడా నివాళులర్పించిన వారిలో ఉన్నారు. పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి కూడా జర్నలిస్ట్ మృతికి సంతాపం తెలిపారు.