70 ఏళ్ల తర్వాత ప్రియురాలి చెంతకు..!
అడిలైడ్: ఆస్ట్రేలియాలో అపురూప సంఘటన జరగబోతోంది. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఓ పైలట్ 70 ఏళ్ల తర్వాత తన గర్ల్ ఫ్రెండ్‌ను కలుసుకోబోతున్నాడు. వచ్చే వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) ఇందుకు వేదిక కాబోతోంది.
అమెరికాలోని వర్జీనియా రాష్ట్రానికి చెందిన పైలట్ నోర్వూద్ థామస్ (93) రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. ఆ సమయంలో ఆస్ట్రేలియాకు చెందిన జాయ్సే మోరిస్ పరిచయమైంది. ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. అయితే యుద్ధానంతరం ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు థామస్ వయసు 93 ఏళ్లు కాగా, మోరిస్‌కు 88 ఏళ్లు.
70 ఏళ్ల విరామం తర్వాత థామస్‌కు మోరిస్‌ను చూడాలనిపించింది. ఆమె చిరునామా తెలుసుకుని ఇటీవల స్కైప్ ద్వారా మాట్లాడాడు. వీరిద్దరి లవ్ స్టోరీ ఆన్లైన్లో పాపులర్ అయింది. 300 మందికిపైగా నెటిజెన్లు స్పందించి ఈ జంటను కలిపేందుకు విరాళాలు పంపారు. దాదాపు 5 లక్షల రూపాయలు పోగయ్యాయి. ఇక థామస్, మోరిస్‌ను కలిపేందుకు ఎయిర్ న్యూజిలాండ్ ముందుకొచ్చింది. థామస్, ఆయన కొడుకును విమానంలో ఉచితంగా ఆస్ట్రేలియా తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రేమికుల రోజున అలనాటి ఈ ప్రేమ జంట మళ్లీ కలుసుకోబోతోంది.