Judicial Department
-
న్యాయ రాజధానిని కర్నూలులోనే ఏర్పాటు చేయాలి..
కర్నూలు సిటీ: న్యాయ రాజధానిని, కృష్ణా నది యాజమాన్య బోర్డును కర్నూలులోనే ఏర్పాటు చేయాలని రాయలసీమ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలులోని ప్రభుత్వ జూనియర్(టౌన్ మోడల్) కళాశాల ఆవరణలో గురువారం రాయలసీమ ఆత్మగౌరవ సభ నిర్వహించారు. సభలో రాయలసీమ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ నాయకులు సునీల్‌కుమార్‌రెడ్డి, శ్రీరాములు, చంద్రప్ప, రామకృష్ణ, రాయలసీమ మేధావుల ఫోరం నేత చంద్రశేఖర్, విద్యావేత్త డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు రాయలసీమ అభివృద్ధిపై తమ వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. కొందరు రాయలసీమ నేతలు అమరావతి రియల్టర్లకు అనుకూలంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఆ ప్రాంతానికి చెందిన రియల్టర్లు రైతుల ముసుగులో చేపట్టిన పాదయాత్రకు.. విరాళాలివ్వడం దారుణమన్నారు. ఇలాంటి నేతలకు చీర, సారెలు పంపిస్తామని ఎద్దేవా చేశారు. సీమ పట్ల చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని, తీరు మార్చుకోకుంటే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. అమరావతి రైతుల ముసుగులోని ఆర్టిస్టులు రాయలసీమలోకి వచ్చాక తిరుపతిలో ఫ్లెక్సీలు చింపివేయడాన్ని బట్టి చూస్తే.. వారెంత అరాచకవాదులో అర్థమవుతోందన్నారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నేతలు రాజునాయుడు, రామచంద్రుడు, ఓబులేసు, సూర్య, మహేంద్ర, నరసన్న, నాగరాజు, శివ, ముక్తార్, వెంకటేష్, రామరాజు, రియాజ్, బన్నీ పాల్గొన్నారు. -
మహిళల ప్రాతినిధ్యం అంతంతమాత్రమే..!
ఢిల్లీ: మహిళలకు అన్నిరంగాల్లో అధిక ప్రాధాన్యం కల్పిస్తూ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కొన్ని రంగాల్లో వారి సంఖ్య చాలా పేలవంగా ఉంది. పోలీసు, న్యాయ వ్యవస్థ వంటి కీలక విభాగాల్లో మరీ తక్కువ సంఖ్యలో ఉన్నారు. అయితే తాజాగా టాటా ట్రస్ట్స్ విడుదల చేసిన ‘ఇండియా జస్టిస్ రిపోర్టు- 2019’ నివేదికలో మహిళల ఉద్యోగాలకు సంబంధించిన పలు అంశాలు వెల్లడయ్యాయి. భారతదేశంలో 2.4 మిలియన్ల పోలీసు సిబ్బందిలో కేవలం ఏడు శాతం మహిళలు మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది. ఉన్నతస్థాయి పోలీసు ఉద్యోగాల్లో కేవలం ఆరు శాతం మంది మహిళలకు ప్రాతినిధ్యం ఉన్నట్లు వెల్లడించింది. మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా ఏడాదికి ఒక శాతం చొప్పున వారి సంఖ్యను పెంచుతున్నామని రాష్ట్రాలు చెబుతున్నప్పటికీ వారికి కేటాయించిన 33 శాతం చేరుకోవడానికి దశాబ్దాల కాలం పడుతుందని నివేదిక తేటతెల్లం చేసింది. కొన్ని రిజర్వు స్థానాల్లో భారీ సంఖ్యలో ఖాళీలు ఉండటం వల్ల మహిళల సంఖ్యతో పాటు ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీల ప్రాతినిధ్యం కూడా చాలా పేలవంగా ఉందని ఆ నివేదిక కుండబద్దలు కొట్టింది. దీంతోపాటు గత ఐదేళ్లలో దేశంలోని మొత్తం పోలీసు బలగాల్లో 6.4 శాతం మందికి మాత్రమే సరైన శిక్షణ ఇవ్వబడిందని పేర్కొంది. దేశంలో ప్రస్తుతం 90 శాతం మంది పోలీసులకు సరైన శిక్షణ లేకుండానే విధులు నిర్వహిస్తున్నారని స్పష్టం చేసింది. పోలీసు విభాగాల్లోనే కాకుండా న్యాయవ్యవస్థలో కూడా మహిళల ప్రాతినిధ్యం అంతంత మాత్రంగానే ఉందని ఆ నివేదిక వెల్లడించింది. న్యాయవాదుల్లో కేవలం 18 శాతం మాత్రమే మహిళలు ఉన్నారని పేర్కొంది. దేశ వ్యాప్తంగా సబార్డినేట్ కోర్టుల్లో 28 మిలియన్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. 24 శాతం కేసులు ఐదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించింది. కాగా మొత్తం 2.3 మిలియన్ కేసులు పదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా 4,071 కోర్టు గదుల కొరత ఉందని పేర్కొంది. 2017 డేటా ప్రకారం ఉత్తర ప్రదేశ్‌లో పోలీసు శాఖలో 50 శాతానికి పైగా ఖాళీలు ఉన్నాయని వెల్లడించింది. భారత జైళ్ల పరిస్థితి కూడా దారుణంగా ఉందని.. దేశంలో 1,412 జైళ్లలో కేవలం 621 జైళ్లల్లో మాత్రమే సరైన సిబ్బంది ఉన్నారని వెల్లడించింది. కాగా, ఈ నివేదిక తయారిలో సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్, కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్, డీఏకేఎస్‌హెచ్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ - ప్రయాస్, విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ వంటి పలు ప్రతిష్టాత్మకమైన సంస్థలు భాగస్వామ్యం అయ్యాయి. -
కోర్టు ఆదేశాలంటే లెక్క లేదా?
సాక్షి, అమరావతి: ఓ ఖైదీ విడుదల విషయంలో తమ ఆదేశాలను అమలు చేయని అధికారులది ముమ్మాటికీ కోర్టు ధిక్కారమేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి, నెల్లూరు కేంద్ర కారాగార సూపరింటెండెంట్, న్యాయశాఖ కార్యదర్శి ఎవరో ఒకరు తప్పనిసరిగా బాధ్యులవుతారని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గని శ్రీనివాసులు అనే ఖైదీని విడుదల చేయాలంటూ హైకోర్టు ఏప్రిల్ 9న ఆదేశాలు జారీ చేయగా అధికారులు అమలు చేయలేదు. దీనిపై కోర్టు ప్రశ్నించగా ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపారు. తర్వాత జూన్ 14న విడుదల చేయాలని కోర్టు మరోసారి ఆదేశించింది. అయినా స్పందించకపోడంతో శ్రీనివాసులు సోదరుడు పవన్‌కుమార్ అధికారులపై కోర్టు ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు కోర్టు ఆదేశాలను అమలు చేయని మీ చర్యలను ఎందుకు కోర్టు ధిక్కారం కింద పరిగణించరాదో స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని అప్పటి హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, నెల్లూరు కేంద్ర కారాగార సూపరింటెండెంట్ ఎం.రవికిరణ్ తదితరులను ఆదేశించారు. వారు శనివారం కోర్టు ముందు హాజరవ్వగా ధర్మాసనం విచారణ జరిపింది. అధికారుల తీరుపై మండిపడుతూ కోర్టు ఆదేశాలంటే అధికారులకు లెక్క లేకుండా పోయిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జూన్ 14న ఆ ఖైదీ విడుదలకు ఆదేశిస్తూ జూలై 4న విడుదల చేశారని, అది కూడా కోర్టు ధిక్కార వ్యాజ్యం దాఖలైన తరువాతని తెలిపింది. దీనిని ఉపేక్షించేది లేదని, తగిన ఉత్తర్వులిస్తామని తీర్పును వాయిదా వేసింది. -
జ్యుడీషియల్ ప్రివ్యూ లోగో ఆవిష్కరణ
సాక్షి, అమరావతి: జడ్జి జ్యుడీషియల్ ప్రివ్యూ అధికారిక లోగోను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. దీనితో పాటు ఏపీ జ్యుడీషియల్ ప్రివ్యూ వెబ్సైట్ judicialpreview. ap. gov. in ను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిష్టాత్మకమైన ఈ చట్టం ఆగస్టు 14 నుంచి అమలులోకి వచ్చిన విషయం విదితమే. ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల (న్యాయపరమైన ముందస్తు సమీక్ష తద్వారా పారదర్శకత)–2019, చట్టాన్ని అనుసరించి న్యాయపరమైన ముందస్తు సమీక్ష ద్వారా పారదర్శకతను తెచ్చి, ప్రభుత్వ వనరులను అనుకూలమైన రీతిలో వినియోగించుకునేటట్లు చూడటానికి ఇది వీలును కలిగిస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఏజెన్సీ గానీ, స్థానిక అధికారి గానీ రూ. 100 కోట్లు, అంతకుమించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల టెండరు పత్రాలన్నింటినీ న్యాయపరమైన ముందస్తు సమీక్ష కోసం న్యాయమూర్తికి సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వం జడ్జి జ్యుడీషియల్ ప్రివ్యూగా బి.శివశంకరరావును నియమించింది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాంఛనంగా జరిగిన ఈ కార్యక్రమంలో జడ్జి జ్యుడిషియల్ ప్రివ్యూ డాక్టర్ బి.శివశంకరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం, ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ, స్టాంపులు–రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ సిద్ధార్థ జైన్, రాష్ట్ర ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ ఏవీ పటేల్, ఏపీఐఐసీ డిప్యూటీ జోనల్ మేనేజర్–గుంటూరు వై.శరత్‌బాబు పాల్గొన్నారు. -
హెచ్1బీ వీసా మోసం
వాషింగ్టన్: అమెరికాలో విదేశీ నిపుణులకు జారీచేసే హెచ్1బీ వీసాల ప్రక్రియలో మోసానికి పాల్పడిన నలుగురు భారత సంతతి అమెరికన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పుడు ధ్రువపత్రాలతో విజయ్ మానే(39), వెంకటరమణ మన్నెం(47), ఫెర్నాండో సిల్వ(53), సతీశ్ వేమూరి(52) వీసా మోసానికి పాల్పడ్డారని న్యాయశాఖ అధికారులు తెలిపారు. ఈ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచగా, రూ.1.72 కోట్ల(2.50 లక్షల డాలర్ల) పూచీకత్తుపై వీరికి న్యాయస్థానం బెయిల్ మంజారుచేసింది. ఈ విషయమై అమెరికా న్యాయశాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..‘విజయ్ మానే, మన్నెం వెంకటరమణ, సతీశ్ వేమూరి కలిసి న్యూజెర్సీలోని మిడిల్సెక్స్ ప్రాంతంలో ప్రొక్యూర్ ప్రొఫెషనల్స్ ఇంక్, క్రిప్టో ఐటీ సొల్యూషన్స్ ఇంక్ అనే స్టాఫింగ్ కంపెనీలను ప్రారంభించారు. అదే సమయంలో ఫెర్నాండో సిల్వ, మన్నెం వెంకటరమణ కలిసి ‘క్లయింట్ ఏ’ అనే మరో సంస్థను మొదలుపెట్టారు. ఐటీ కంపెనీలకు నిపుణులైన సిబ్బందిని ఈ సంస్థలు సిఫార్సు చేయడంతో పాటు వారి తరఫున హెచ్1బీ వీసాలకు దరఖాస్తు చేస్తాయి. అయితే ప్రొక్యూర్ ప్రొఫెషనల్స్ ఇంక్, క్రిప్టో ఐటీ సొల్యూషన్స్ ఇంక్ ఇక్కడే మోసానికి తెరలేపాయి. తమ ఏజెన్సీల తరఫున హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తు చేసిన విదేశీయులకు ఇప్పటికే ‘క్లయింట్ ఏ’ సంస్థలో ఉద్యోగాలు లభించాయని తప్పుడు పత్రాలు సృష్టించాయి. దీంతో మిగతా వీసా దరఖాస్తుల కంటే ఈ రెండు సంస్థల తరఫున దాఖలైన హెచ్1బీ వీసాలు త్వరితగతిన ఆమోదం పొందాయి. తద్వారా ఇతర స్టాఫింగ్ కంపెనీలతో పోల్చుకుంటే ప్రొక్యూర్ ప్రొఫెషనల్స్ ఇన్, క్రిప్టో ఐటీ సొల్యూషన్స్ ఇన్ సంస్థలు అనుచితంగా లబ్ధిపొందాయి’ అని తెలిపారు. -
విరాళాల ‘మొత్తం’ను 2 వేలు చేయండి
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాల విషయంలో పారదర్శకత పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక సూచన చేసింది. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి పార్టీలు స్వీకరించే విరాళాల గరిష్ట మొత్తాన్ని రూ.20 వేల నుంచి రూ.2 వేలకు తగ్గించాలని కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ఎన్నికల సంఘం గత వారం కేంద్ర న్యాయశాఖకు లేఖ రాసింది. తాము కోరినట్లు ఒక్కో వ్యక్తి నగదు రూపంలో పార్టీలకు చెల్లించే గరిష్ట మొత్తాన్ని కేంద్రం రూ.2,000కు తగ్గించిందని లేఖలో తెలిపింది. గుప్త విరాళాల విషయంలో రూ.2 వేలు పరిమితిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని గుర్తు చేసింది. రాజకీయ పార్టీలు గుప్త విరాళాలు అందుకోవడంపై రాజ్యాంగంలో నిషేధం లేదన్న ఈసీ.. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 29సీ మాత్రం గుర్తుతెలియని వ్యక్తుల నుంచి విరాళాలను అందుకోవడాన్ని పరోక్షంగా నిషేధిస్తుందని తెలిపింది. గుప్తవిరాళాల కింద రూ.20 వేలు అందుకున్న అవకాశమున్న నేపథ్యంలో అది నగదు రూపంలో కూడా ఉండొచ్చనీ, దీని కారణంగా గరిష్టంగా రూ.2 వేల నగదు మాత్రమే ఇవ్వాలన్న నిబంధనకు తూట్లు పొడిచినట్లే అవుతుందని అభిప్రాయపడింది. -
19 ఏళ్లు.. అదే నిరీక్షణ!
- న్యాయం కోసం 1998 డీఎస్సీ అభ్యర్థుల పోరాటం - చివరకు సీఎం హామీ ఇచ్చినా ముందుకు పడని అడుగులు - న్యాయ శాఖ, జీఏడీ పరిశీలన అంటూ తిప్పుతున్న అధికారులు - పోస్టింగుల కోసం వేల మంది ఎదురుచూపులు సాక్షి, హైదరాబాద్: 1998 డీఎస్సీలో నష్టపోయిన నిరుద్యోగులకు న్యాయం చేయడంలో అడుగు ముందుకు పడటం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చినా ఆచరణకు నోచుకోవడం లేదు. ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో నిరుద్యోగులు ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నా.. ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నా ఎవరికీ పట్టడం లేదు. 2015 జనవరిలో సీఎం కేసీఆర్ వరంగల్‌లో పర్యటించిన సందర్భంగా 1998 డీఎస్సీలో నష్టపోయిన నిరుద్యోగులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో వారికి ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో 1998 డీఎస్సీలో నష్టపోయిన వారికే కాకుండా 2012 వరకు నిర్వహించిన మిగతా డీఎస్సీల్లో నష్టపోయి కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారందరికీ పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే అది ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదు. ప్రస్తుతం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్న నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఎన్నో అక్రమాలు 1998 డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ దాదాపు 40 వేల టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. అయితే ఇందులో ఎన్నో అక్రమాలకు తెరతీశారు. బీఎడ్ లేని వారికీ పోస్టింగులు ఇచ్చారు. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల్లో పండిట్లకు పోస్టింగులు ఇచ్చారు. రాత పరీక్షలో 4 మార్కులు వచ్చిన వారికి కూడా ఇంటర్వ్యూల్లో ఎక్కువ మార్కులు వేసి పోస్టింగులు ఇచ్చారు. రాత పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించిన వారికి ఇంటర్వ్యూల్లో తక్కువ మార్కులు వేసి అన్యాయం చేశారు. తమ అనుయాయుల కోసం రాత పరీక్ష కటాఫ్ మార్కులను తగ్గించి అక్రమాలకు పాల్పడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశించినా.. 1998 డీఎస్సీలో మొత్తం 100 మార్కుల్లో 15 మార్కులు ఇంటర్వ్యూలకు పోగా 85 మార్కులకు రాత పరీక్ష నిర్వహించారు. ఇందులో ఓసీలకు 50 మార్కులు, బీసీలకు 45 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ కేటగిరీ వారికి 40 మార్కులను అర్హత మార్కులుగా నిర్ణయించారు. అయితే పోస్టుల సంఖ్య కంటే అభ్యర్థులు తక్కువగా ఉన్నారనే సాకుతో రాత పరీక్షలో కనీస అర్హత మార్కులను 45, 40, 35కు విద్యా శాఖ కుదించింది. దీంతో నియామకాల సందర్భంగా తక్కువ మార్కులు వచ్చిన వారికి ఇంటర్వ్యూల్లో ఎక్కువ మార్కులు వేసి, రాత పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన తమకు తక్కువ మార్కులు వేసి పోస్టులకు ఎంపిక కాకుండా చేశారని వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు చెందిన అభ్యర్థులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనిపై 1999లో విచారణ జరిపిన ట్రిబ్యునల్.. రాత పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులకు పోస్టింగులు ఇవ్వాలని ఆదేశించింది. దీన్ని సవాలు చేస్తూ 2000 సంవత్సరంలో విద్యా శాఖ హైకోర్టును ఆశ్రయించగా అక్కడా అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయినా దాన్ని అమలు చేయని విద్యా శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీం కూడా కింది కోర్టు ఉత్తర్వుల మేరకు నడుచుకోవాలని స్పష్టం చేసింది. అయితే ఆ తీర్పును మాత్రం అమలు చేయలేదు. అప్పటి నుంచి 2010 వరకు ట్రిబ్యునల్, హైకోర్టులో మళ్లీ కేసు కొనసాగింది. చివరకు 2011 నవంబరు 8న వారికి ఉద్యోగాలు ఇవ్వాలని, నియామక తేదీ నుంచి సీనియారిటీ తదితర ప్రయోజనాలు కల్పించాలని ఆదేశించినా.. అమలు చేయలేదు. దీంతో అభ్యర్థులు సుప్రీంకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ వేశారు. దీనిపై సుప్రీంకోర్టులో చీవాట్లు తిన్న విద్యా శాఖ.. చివరకు ఆ పోస్టులు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అందరికీ పోస్టింగ్ ఇస్తామని హామీ ఇచ్చినా.. పరిస్థితిలో ఇసుమంతైనా మార్పు లేదు.