19 ఏళ్లు.. అదే నిరీక్షణ!
- న్యాయం కోసం 1998 డీఎస్సీ అభ్యర్థుల పోరాటం
- చివరకు సీఎం హామీ ఇచ్చినా ముందుకు పడని అడుగులు
- న్యాయ శాఖ, జీఏడీ పరిశీలన అంటూ తిప్పుతున్న అధికారులు
- పోస్టింగుల కోసం వేల మంది ఎదురుచూపులు
సాక్షి, హైదరాబాద్: 1998 డీఎస్సీలో నష్టపోయిన నిరుద్యోగులకు న్యాయం చేయడంలో అడుగు ముందుకు పడటం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చినా ఆచరణకు నోచుకోవడం లేదు. ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో నిరుద్యోగులు ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నా.. ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నా ఎవరికీ పట్టడం లేదు. 2015 జనవరిలో సీఎం కేసీఆర్ వరంగల్‌లో పర్యటించిన సందర్భంగా 1998 డీఎస్సీలో నష్టపోయిన నిరుద్యోగులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో వారికి ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు.
ఆ తర్వాత జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో 1998 డీఎస్సీలో నష్టపోయిన వారికే కాకుండా 2012 వరకు నిర్వహించిన మిగతా డీఎస్సీల్లో నష్టపోయి కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారందరికీ పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే అది ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదు. ప్రస్తుతం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్న నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.
ఎన్నో అక్రమాలు
1998 డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ దాదాపు 40 వేల టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. అయితే ఇందులో ఎన్నో అక్రమాలకు తెరతీశారు. బీఎడ్ లేని వారికీ పోస్టింగులు ఇచ్చారు. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల్లో పండిట్‌లకు పోస్టింగులు ఇచ్చారు. రాత పరీక్షలో 4 మార్కులు వచ్చిన వారికి కూడా ఇంటర్వ్యూల్లో ఎక్కువ మార్కులు వేసి పోస్టింగులు ఇచ్చారు. రాత పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించిన వారికి ఇంటర్వ్యూల్లో తక్కువ మార్కులు వేసి అన్యాయం చేశారు. తమ అనుయాయుల కోసం రాత పరీక్ష కటాఫ్ మార్కులను తగ్గించి అక్రమాలకు పాల్పడ్డారు.
సుప్రీంకోర్టు ఆదేశించినా..
1998 డీఎస్సీలో మొత్తం 100 మార్కుల్లో 15 మార్కులు ఇంటర్వ్యూలకు పోగా 85 మార్కులకు రాత పరీక్ష నిర్వహించారు. ఇందులో ఓసీలకు 50 మార్కులు, బీసీలకు 45 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ కేటగిరీ వారికి 40 మార్కులను అర్హత మార్కులుగా నిర్ణయించారు. అయితే పోస్టుల సంఖ్య కంటే అభ్యర్థులు తక్కువగా ఉన్నారనే సాకుతో రాత పరీక్షలో కనీస అర్హత మార్కులను 45, 40, 35కు విద్యా శాఖ కుదించింది. దీంతో నియామకాల సందర్భంగా తక్కువ మార్కులు వచ్చిన వారికి ఇంటర్వ్యూల్లో ఎక్కువ మార్కులు వేసి, రాత పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన తమకు తక్కువ మార్కులు వేసి పోస్టులకు ఎంపిక కాకుండా చేశారని వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు చెందిన అభ్యర్థులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.
దీనిపై 1999లో విచారణ జరిపిన ట్రిబ్యునల్.. రాత పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులకు పోస్టింగులు ఇవ్వాలని ఆదేశించింది. దీన్ని సవాలు చేస్తూ 2000 సంవత్సరంలో విద్యా శాఖ హైకోర్టును ఆశ్రయించగా అక్కడా అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయినా దాన్ని అమలు చేయని విద్యా శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీం కూడా కింది కోర్టు ఉత్తర్వుల మేరకు నడుచుకోవాలని స్పష్టం చేసింది. అయితే ఆ తీర్పును మాత్రం అమలు చేయలేదు. అప్పటి నుంచి 2010 వరకు ట్రిబ్యునల్, హైకోర్టులో మళ్లీ కేసు కొనసాగింది. చివరకు 2011 నవంబరు 8న వారికి ఉద్యోగాలు ఇవ్వాలని, నియామక తేదీ నుంచి సీనియారిటీ తదితర ప్రయోజనాలు కల్పించాలని ఆదేశించినా.. అమలు చేయలేదు. దీంతో అభ్యర్థులు సుప్రీంకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ వేశారు. దీనిపై సుప్రీంకోర్టులో చీవాట్లు తిన్న విద్యా శాఖ.. చివరకు ఆ పోస్టులు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అందరికీ పోస్టింగ్ ఇస్తామని హామీ ఇచ్చినా.. పరిస్థితిలో ఇసుమంతైనా మార్పు లేదు.