కిడ్నాప్ నుంచి తప్పించుకునేందుకు.. ఆటో దూకిన మహిళా టెకీ
థానె: దారి మళ్లించి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన డ్రైవర్ నుంచి రక్షించుకునేందుకు ఓ మహిళా టెకీ ఆటో నుంచి బయటకు దూకేసింది. థానెలో జరిగిన ఈ సంఘటనలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు.
కపుర్బౌడీ ఇన్స్పెక్టర్ ఎస్ ఎస్ కడమ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. టీసీఎస్‌లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని స్వప్నాలీ లాడ్ శుక్రవారం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు రాత్రి 9 గంటల ప్రాంతంలో కపూర్బౌడీ నాకా వద్ద ఆటో ఎక్కారు. ఆమె నివాసం కోల్షెట్లో ఉంది. కాగా ఆటో డ్రైవర్ దారి మళ్లించి ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ విషయం గమనించిన స్పప్పాలీ భయంతో అలారమ్ మోగించి ఆటోలో నుంచి బయటకు దూకేశారు. ఆమె తల, కడుపులో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం జూపిటర్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆమె అపస్మారకస్థితిలో ఉందని, ఇప్పటికి రెండు మేజర్ సర్జరీలు చేసినా పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆటో డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.