జూన్ 22న ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
కాకినాడ (తూర్పు గోదావరి) : ఎంసెట్ ఇంజినీరింగ్ అభ్యర్థులకు సీట్ల కేటాయింపు ఈ నెల 22న ఉంటుందని ఏపీ ఎంసెట్ కన్వీనర్, జేఎన్టీయూకే ఓఎస్డీ సీహెచ్ సాయిబాబు గురువారం తెలిపారు. ఈ సంవత్సరం జేఎన్టీయూకే పరిధిలో కొత్తగా మంజూరైన గుంటూరు జిల్లా నరసారావుపేట కళాశాల, రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ యూనివర్సీటీలలో సీట్లకు ఆప్షన్లను విద్యార్థులు ఎంచుకోవచ్చన్నారు.
ఈ నెల 19,20 తేదీల్లో మార్పులు, చేర్పులకు అవకాశం ఉందని, దీన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవచ్చునన్నారు. గుంటూరు జిల్లా నరసారావుపేట కళాశాలలో సీఎస్ఈ, సివిల్, మెకానికల్, ఈసీఈ, ఈఈఈ బ్రాంచీల్లో 60 సీట్ల చొప్పున, నన్నయ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో 30, ఐటీలో 30 సీట్లు ఉన్నాయన్నారు. నరసారావుపేట కళాశాలకు జేఎన్‌టీఎన్, నన్నయ్య వర్సిటీకు ఏకేఎన్‌యూ కౌన్సెలింగ్ కోడ్లని తెలిపారు.