అరుదైన వ్యక్తిత్వం
సమాజ గమనాన్ని చూసి అసహనం ప్రదర్శించేవారుంటారు. ఆగ్రహావేశాలు వ్యక్తం చేసేవారుంటారు. కానీ ఆ సమాజాన్ని ప్రభావితం చేయడానికి, చక్కదిద్దడానికి తమ వంతు బాధ్యతగా క్రియాశీలంగా పనిచేసేవారు చాలా అరుదు. అలాంటి అరుదైన కోవకు చెందినవారిలో తన 95వ ఏట శుక్రవారం కన్నుమూసిన ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజిందర్ సచార్ అగ్రగణ్యులు. రిటైరైన తర్వాత వచ్చే పదవుల కోసం, వాటి ద్వారా లభించే అధికారాల కోసం వెంపర్లాడేవారు ఇంచుమించు అన్ని వ్యవస్థల్లోనూ కనబడతారు. అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. కానీ సచార్ది విలక్షణమైన వ్యక్తిత్వం. సోషలిస్టు నాయకుడు రాంమనోహర్ లోహియా అనుచరుడిగా తనకంటూ ఒక సామాజిక దృక్పథాన్ని ఏర్పరుచుకుని చివరంటా దాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించిన వ్యక్తి ఆయన.
ఏడేళ్లక్రితం పౌరహక్కుల ఉద్యమకారుడు కణ్ణబీరన్ మరణించినప్పుడు నివాళులర్పిస్తూ మానవ హక్కుల కోసం ఆయన అవిశ్రాంతం శ్రమించారని జస్టిస్ సచార్ చెప్పారు. ఈమాటే ఆయనకు కూడా వర్తిస్తుంది. హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా ప్రశ్నించడం, బాధితులకు న్యాయం చేసేందుకు అందరినీ కూడగట్టడం ఆయన విధానం. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనపై, అక్కడి శాంతిభద్రతల స్థితిగతులపై 1990లో ఆయన ఆధ్వర్యంలోని కమిటీ నిజనిర్ధారణ చేసి నివేదిక రూపొందించింది. జాతీయ మానవ హక్కుల సంఘం మరింత చురుగ్గా పనిచే యడం కోసం చేయవలసిన మార్పులపై 2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీలో ఆయన సభ్యుడు. పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని గొంతెత్తి పోరాడినవారిలో ఆయన ప్రముఖుడు.
జస్టిస్ సచార్ పేరు చెప్పగానే ఆయన ఆధ్వర్యంలోని కమిటీ దేశంలో ముస్లింల స్థితిగతులపై సమర్పించిన నివేదిక గుర్తొస్తుంది. ముస్లింల సంక్షేమానికి పథకాలు రూపొందించాలనుకునే ఏ ప్రభుత్వమైనా సచార్ కమిటీ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేయాల్సిందే. దేశ జనాభాలో 15 శాతంగా ఉన్న ముస్లింలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ఎంత వెనకబడి ఉన్నారో 400 పేజీల ఆ నివేదిక వెల్లడించింది. ఉన్నతాధికార వ్యవస్థలోనూ, శాంతిభద్రతల పరిరక్షణ విభాగంలోనూ ఆ వర్గానికి సరైన ప్రాతినిధ్యంలేని సంగతిని గణాంకాలతోసహా వివరించింది.
వారి అభ్యున్నతికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చునో సూచించింది. సైన్యంతోసహా ప్రభుత్వానికి చెందిన సకల విభాగాల్లోనూ ముస్లింల సంఖ్య ఏవిదంగా ఉన్నదో తేల్చడానికి ఆ కమిటీ చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఆ ప్రాతి పదికన గణాంకాలిస్తే దురభిప్రాయాలు ఏర్పడతాయని అభ్యంతరాలు వ్యక్తం చేసినా వాస్తవ స్థితిగతులను తెలుసుకోవడానికి వేరే మార్గం ఉండదని జస్టిస్ సచార్ నిష్కర్షగా చెప్పారు. ఇతర విభాగాలు దారికొచ్చినా సైన్యం మాత్రం అయి ష్టంగా వివరాలందజేసి, వాటిని బయటకు వెల్లడించడం మంచిది కాదని సూచిం చింది. ఎంతో శ్రమకోర్చి 2006లో ప్రభుత్వానికి సమర్పించిన ఆ నివేదికను అప్పటి యూపీఏ ప్రభుత్వం సక్రమంగా అమలు చేసి ఉంటే ముస్లింల స్థితి మరింత మెరుగ్గా ఉండేది.
అణగారిన వర్గాలకోసం, అసహాయుల కోసం జరిగే ఏ ఉద్యమానికైనా మద్ద తునీయడం, వారి సమావేశాల్లో పాల్గొనడం సచార్‌కు అలవాటు. పిలిస్తే వక్తగా వెళ్లడం, లేనట్టయితే సభికుల్లో ఒకరిగా ఉండి నైతిక మద్దతునందించడం పాటిం చేవారు. దేశంలో ఏమూల ఏ అన్యాయం జరిగిందని తెలిసినా, చదివినా దాన్ని ఖండిస్తూ ప్రకటనలిచ్చేవారు. 1985లో రిటైరైన తర్వాత పౌరహక్కుల ప్రజా సంఘం(పీయూసీఎల్) కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 2008లో ముంబైపై ఉగ్రదాడి జరిగాక యూపీఏ సర్కారు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) తెచ్చినప్పుడు దాన్ని నిశితంగా విమర్శించారు. అంతక్రితం పాలించిన ఎన్డీఏ ప్రభుత్వం రూపొందించిన ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం(పోటా) దుర్వినియోగమైందని ఆరోపించి, దాన్ని రద్దు చేసిన పాలకులు అంతకన్నా కఠినమైన చట్టాన్ని అమలు చేయాలని చూడటంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించారు.
ఉగ్రవాదాన్ని నిరోధించడానికి అనుసరించే విధానాలు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉండాలే తప్ప, వాటిని ఉల్లంఘించేవిగా మారకూడదని ఎలుగెత్తారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే పేరిట మానవ హక్కులను హరిస్తే అది ఉగ్రవాదం మరింత పెరగడానికి దోహదపడుతుందని హెచ్చరించారు. ఇక్కడే కాదు... ప్రపంచంలో ఏమూల హక్కుల ఉల్లంఘన జరిగినా జస్టిస్ సచార్ గళం వినబడేది. శ్రీలంకలో లిబరేషన్ టైగర్ల సాకుతో తమిళులపై సాగిన అకృత్యాలనూ, అత్యాచారాలు... ఇరాక్‌లో అగ్ర రాజ్యాల దురాక్రమణ, లిబియాలో అమెరికా దురంతం, అక్కడి అంతర్యుద్ధం వగైరాలన్నీ ఆయనను కలవరపెట్టేవి. వాటిపై పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాశారు. ప్రపంచంలో పౌరహక్కుల కోసం, మానవ హక్కుల కోసం ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఐక్యరాజ్యసమితి మైనా రిటీల పరిరక్షణ, గృహ నిర్మాణం వంటి అంశాల్లో ఆయన నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేసింది.
ఎన్నో వైరుధ్యాలు, అసమానతలు నిండి ఉండే సమాజంలో ఆధిపత్య వర్గాల తీరుతెన్నులను ప్రశ్నించడం, అసహాయులకు అన్యాయం జరిగినప్పుడు దృఢంగా పోరాడటం, నిరంకుశ ప్రభుత్వాలను ఎదిరించి నిలవడం అందరికీ సాధ్యం కాదు. అందుకు ఎన్నో త్యాగాలు చేయాలి. ఎంతో సమయాన్ని వెచ్చించాలి. జస్టిస్ సచార్ దేనికీ వెరవలేదు. మన రాజ్యాంగాన్ని త్రికరణశుద్ధిగా పాటిస్తే దేశంలో అసమాన తలు, అన్యాయాలు రూపుమాసిపోతాయని ఆయన విశ్వసించారు. ఆ విలువలను పాలకులతో పాటింపజేయడానికి శక్తి మేరకు కృషి చేశారు. వినని సందర్భాల్లో విమ ర్శించారు. ఉద్యమించేవారితో సైతం ఈ విషయంలో ఆయన తగువుపడిన సంద ర్భాలున్నాయి. ఎందరికో స్ఫూర్తినిచ్చే ఇలాంటి అరుదైన వ్యక్తుల అవసరం పెరుగు తున్న దశలో సచార్ కనుమరుగు కావడం దురదృష్టకరం.