న్యాయాధికారుల విభజనలో మరో ముందడుగు
సాక్షి, హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని న్యాయవ్యవస్థలో ప్రస్తుతం నెలకొని ఉన్న వివాదాలకు ఫుల్స్టాప్ పెట్టే దిశగా హైకోర్టు ప్రారంభించిన కిందిస్థాయి న్యాయ వ్యవస్థ విభజన ప్రక్రియలో మరో ముందడుగు పడింది. ఇప్పటికే న్యాయాధికారులను ‘ఆప్షన్లు’ కోరిన ఉమ్మడి హైకోర్టు, ఇప్పుడు వారు కోరుతున్న విధంగా మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. మార్గదర్శకాల ప్రకారం ‘ఆప్షన్ల’ ప్రక్రియను ఈ నెల 10వ తేదీ కల్లా ముగించాలని రిజిస్ట్రార్ జనరల్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్ న్యాయాధికారులకు స్పష్టం చేశారు. ఆప్షన్లను ప్రతీ న్యాయాధికారి కూడా సీల్డ్ కవర్లో ఉంచి ఆయా జిల్లా జడ్జీలకు సమర్పించాల్సి ఉంటుంది.
తరువాత వాటిని జిల్లా జడ్జీలు రిజిస్ట్రార్ జనరల్‌కు పంపుతారు. ఆయన వాటిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేసిన విజభన పర్యవేక్షణ కమిటీ ముందుంచుతారు. కమిటీ పరిశీలనానంతరం తాత్కాలిక కేటాయింపుల జాబితా విడుదలవుతుంది. ఈ నెలాఖరులోపు తాత్కాలిక కేటాయింపుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ తాత్కాలిక కేటాయింపులపై అభ్యంతరాలు, విజ్ఞప్తులు ఉంటే వాటిని కూడా ఆయా న్యాయాధికారులు జిల్లా జడ్జీలకు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యంతరాలు, విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న తరువాత తుది జాబితా విడుదలవుతుంది.