jyothula
-
ఫిరాయింపు దారునికే పట్టం!
జెడ్పీ చైర్మన్‌గా నవీన్ ఎంపిక సాంప్రదాయాన్ని మంటకలిపిన టీడీపీ ఎన్నిక విధానాన్ని తప్పుపట్టిన ప్రతిపక్షం ప్రజాస్వామ్యం ఖూనీకి గురైందని ఆవేదన భానుగుడి (కాకినాడ) : జిల్లా పరిషత్ సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. ఓట్లేసి గెలిపించిన ఆ ప్రజల నమ్మకాన్నే పదవి కోసం తాకట్టుపెట్టిన జ్యోతుల నవీన్ తీరు చర్చనీయాంశమైంది. ఒక పార్టీ జెండాతో గెలిచి మరో పార్టీకి ఫిరాయించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, తనయుడు నవీన్ జెడ్పీ చైర్మన్‌గా అధికారిక ఎన్నికల ద్వారా బాధ్యతలు చేపట్టారు. ప్రతిపాదనలకే పరిమితమైన పేరాబత్తుల గత నెల 21న జెడ్పీ చైర్మన్‌గా నామనను తప్పించి జ్యోతుల నవీన్‌కు పదవిని కట్టబెడుతూ జీవో వచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రకారం ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాను ప్రిసైండింగ్ అధికారిగా నియమించి బుధవారం ఉదయం 11 గంటలకు జెడ్పీకి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించి జెడ్పీటీసీ సభ్యులు ప్రతిపాదించిన జ్యోతుల నవీన్‌ను చైర్మన్‌గా ఎన్నికచేశారు. ఈ ఎన్నికలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. 2015 లో జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికల అనంతరం నామనకు పోటీగా నిలిచిన ఐ.పోలవరం జెడ్పీటీసీ సభ్యుడు పేరాబత్తుల రాజశేఖర్ పార్టీ అదేశాలతో పోటీ నుంచి వైదొలిగి అనంతరం నిర్వహించిన ఎన్నికల్లో నామనను స్వయంగా ప్రతిపాదించారు. ప్రస్తుతం ఫిరాయింపు దారునికి పదవేంటని, నామనను తప్పించేందుకు వీల్లేదని వాదించారు. గతంలో భంగపడ్డ ఆయన, ఇప్పుడు మరోసారి నవీన్ ఎన్నికను వ్యతిరేకించి మరోసారి డీలాపడ్డారు. ఇలా రెండుసార్లూ చైర్మన్ ఎంపిక ప్రతిపాదన తానే చేయడం సభలో ఆసక్తిగా మారింది. ఎన్నికల నియమావళి ప్రకారం నవీన్‌ను చైర్మన్‌గా పేరాబత్తుల ప్రతిపాదించగా కాట్రేనికొన జెడ్పీటీసీ సభ్యుడు నాగిడి నాగేశ్వరరావు బలపర్చారు. వైస్ చైర్మన్‌గా రంగంపేట జెడ్పీటీసీ సభ్యుడు పెండ్యాల నళినీకాంత్ పేరును రాజానగరం జెడ్పీటీసీ సభ్యులు పల్లం రత్నం ప్రతిపాదించగా కూనవరం జెడ్పీటీసీ సభ్యులు వై.కన్యకాపరమేశ్వరి బలపర్చారు. ఎన్నికల సమయంలో ఎటవంటి అభ్యంతరాలు రాకపోవడంతో చైర్మన్‌గా జ్యోతుల నవీన్, వైస్‌చైర్మన్‌గా పెండ్యాల నళినీ కాంత్‌లను ఖరారు చేస్తూ ప్రిసైండింగ్ అధికారి కార్తికేయ మిశ్రా ప్రమాణం చేయించి, నియామక పత్రాలను అందించారు. 47 మంది సభ్యుల హాజరు. ప్రస్తుతం ముంపు మండలాలతో కలిపి 60 మంది జెడ్పీటీసీ సభ్యులున్న పరిషత్ ఎన్నికలకు 47మంది మాత్రమే హాజరయ్యారు. వారిలో వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన ఆరుగురు సభ్యులు సమావేశానికి హాజరై అధికార పార్టీకి అనుకూలంగా ఓటువేశారు. 48 మంది టీడీపీ సభ్యుల్లో 7 గురు సమావేశానికి హాజరుకాలేదు. పూర్వపు జెడ్పీచైర్మన్ నామన రాంబాబు సైతం సమావేశానికి హాజరుకాలేదు. సమావేశంలో జెడ్పీ సీఈఓ పద్మ, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్యేలు వరుపుల, జ్యోతుల, పెందుర్తి వెంకటేష్, వేగుళ్ల జోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలను బహిష్కరిస్తున్నాం : ప్రతిపక్ష నేత సాకా జెడ్పీ ప్రతిపక్షనేత సాకా ప్రసన్నకుమార్ జెడ్పీచైర్మన్ ఎన్నికల నియామవళిని సభ్యులకు అందివ్వకుండా ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించారని, ఈ ఎన్నికను తాము పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. ఒక పార్టీ జెండాతో గెలిచి మరో పార్టీకి కేవలం పదవికోసం ఫిరాయించడం నీచమన్నారు. తమ సభ్యులు సమావేశానికి హాజరుకాకుండానే ఎన్నిక నిర్వహించిన ప్రిసైడింగ్ అధికారి తీరును వారు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం పదవులను అనుభవించినా నేడు రాబోయే ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో చేసిన తప్పులకు అధికార పార్టీ, ఫిరాయింపుదారులు తప్పక సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. వైఎస్సార్ సీపీ సభ్యులు సత్తి సూత్యనారాయణరెడ్డి పి.భారతి, సోయం అరుణ, మట్టా రాణి పాల్గొన్నారు. -
అంతా అనుకున్నట్టే....
– ‘సాక్షి’ చెప్పినట్టే జరిగింది – జ్యోతుల నవీన్‌కు తాత్కాలిక చైర్మన్ బాధ్యతలు – నామన, నళినీకాంత్ రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే ఉత్తర్వులు జారీ – ఈ నెల 15న తాత్కాలిక బాధ్యతలు స్వీకరణ – ఎన్నికల సంఘం నోటిఫికేషన్ అనంతరం అధికారిక ఎన్నిక – నిశ్చేష్టులైన జెడ్పీటీసీ సభ్యులు – జీర్ణించుకోలేకపోతున్న తెలుగు తమ్ముళ్లు సాక్షి ప్రతినిధి, కాకినాడ: అనుకున్నట్టే జరిగింది. సాక్షి చెప్పినట్టే అయింది. జిల్లా పరిషత్ తాత్కాలిక చైర్మన్‌గా జ్యోతుల నవీన్ కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్లను ఆదివారం రాజీనామా చేయించిన ప్రభుత్వ పెద్దలు సోమవారం తాత్కాలిక చైర్మన్‌గా నవీన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. ఈ నెల 15వ తేదీన తాత్కాలిక చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఈ విషయాన్ని సాక్షి గత వారం రోజులుగా వరుస కథనాలు ఇస్తూ వచ్చింది. ఈ నెల 7వ తేదీన ‘యనమల విలవిల ... జ్యోతుల మిలమిల’ శీర్షికతో ఇద్దరి నేతల మధ్య కోల్డ్‌వార్‌ను బయటపెట్టగా ఈ నెల 8వ తేదీన మొదటి పేజీలో ’నైస్‌గా వైఎస్‌కు ఎసరు శీర్షికతో, 9న ’ఇదేమి బలిదానం శీర్షికన టీడీపీలో మారుతున్న రాజకీయ పరిణామలపై వరుస కథనాలను ఇచ్చింది. చివరికి ఆ దిశగానే 9వ తేదీన చైర్మెన్ పదవితోపాటు వైస్ చైర్మన్ పదవికీ రాజీనామాలు సమర్పించి వలస వాదులకు బాటను సుగమం చేశారు. మారిన ఉత్తర్వులు సాధారణంగా జెడ్పీ చైర్మన్ రాజీనామా చేస్తే...వైస్ చైర్మన్ ఆపద్ధర్మ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. వైస్ చైర్మన్ కూడా రాజీనామా చేస్తే అధికార పార్టీలోని జెడ్పీటీసీకి తాత్కాలిక చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. కానీ ఇక్కడ సీన్ మారింది. అధికార పార్టీ జెడ్పీటీసీకి కాకుండా వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన జెడ్పీటీసీకి పట్టం కడుతోంది. జెడ్పీటీసీలు ఎన్నుకున్న చైర్మన్, వైస్ చైర్మన్లను తొలగించి జంప్ జిలానీని కూర్చోబెడుతోంది. వ్యూహాత్మకమే... ఫిరాయింపు సమయంలో చేసుకున్న ఒప్పందాలు, చేతులు మారిన ప్యాకేజీల నేపథ్యంలో జ్యోతుల నెహ్రూకు మంత్రి పదవి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, జిల్లాలో మారిన సమీకరణలు, యనమల రామకృష్ణుడు తదితర నేతల నుంచి ఎదురైన వ్యతిరేకతతో జ్యోతులకు మొండి చేయి చూపించారు. ఈ నేపథ్యంలో పార్టీలోకి తీసుకొచ్చి కాపులకు అన్యాయం చేశారనే వాదన తెరపైకి రావడంతో చంద్రబాబు నివారణ చర్యలు చేపట్టారు. ఏదో ఒకటి ఇచ్చి సంతృప్తి పరచాలన్న ఉద్దేశంతో జెడ్పీ చైర్మన్ పదవిని కట్టబెట్టేందుకు నిర్ణయించారు. అందులో భాగంగా పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఇష్టం లేకపోయినప్పటికీ జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించి జెడ్పీ చైర్మన్ పదవిని వదులుకునేలా నామన రాంబాబుపై ఒత్తిడి చేసింది. దీంతో కొన్ని రోజులు రాంబాబు ససేమిరా అనడంతో పార్టీలో ఉత్కంఠ నెలకుంది. చివరికి అధిష్టానం ఒత్తిడి ... వ్యూహాత్మకంగా పావులు కదడపడంతో నామన తప్పని పరిస్థితుల్లో రాజీనామా చేస్తానని అంగీకరించారు. చైర్మన్ రాజీనామాతో ఆగని పార్టీ పెద్దలు వైస్ చైర్మన్‌పైన కూడా ఒత్తిడి పెంచారు. చైర్మన్ రాజీనామాతో వైస్ చైర్మన్ ఆపద్ధర్మ చైర్మన్ అవుతారని, ఈలోపు ఏదైనా జరిగిపోతుందేమోనన్న భయంతో ఆపద్ధర్మ అవకాశాన్ని ఇవ్వకుండా వైస్ చైర్మన్ నళినీకాంత్ రాజీనామా చేయాలని ఒత్తిడి చేశారు. దీనికి నళినీకాంత్ తటపటాయించినా ‘మళ్లీ నువ్వే వైస్ చైర్మన్’ అవుతావని పెద్దలు భరోసా ఇవ్వడంతో ఆపద్ధర్మ ఛాన్స్‌ను వదులుకుని రాజీనామాకు సై అన్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం దూతల ఆదేశాల మేరకు ఆదివారం చైర్మన్, వైస్ చైర్మన్లు ఇద్దరి చేత రాజీనామా చేయించి, ఆ లేఖలను కలెక్టర్‌కు అందజేయించారు. ప్రభుత్వానికి కలెక్టర్ నివేదిక...హుటాహుటిన పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు చైర్మన్, వైస్ చైర్మన్లు రాజీనామా లేఖలు ఇవ్వడమే తరువాయి కలెక్టర్ కార్తికేయ మిశ్రా ప్రభుత్వానికి నివేదిక పంపించారు. రెండు పదవులు ఖాళీ అయ్యాయని, తాత్కాలిక చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇదంతా పక్కా పథకం ప్రకారమే జరిగింది. ఇంకేముంది అధిష్టానం అడిన డ్రామాలో భాగంగా రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే పంచాయతీరాజ్ శాఖ యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక చైర్మన్‌గా జ్యోతుల నవీన్‌కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ముందస్తుగా ఖరారైన ముహూర్తం ప్రకారం ఈ నెల 15న తాత్కాలిక చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం అధికారిక చైర్మన్‌గా ఎన్నికవుతారు. మొత్తానికి అధిష్టానం ఆడిన నాటకంలో చైర్మన్ నామన రాంబాబు సమిధయ్యారు. పార్టీ జెండా మోసి, డబ్బులు ఖర్చు పెట్టుకుని గెలిచిన వారిని కాదని వైఎస్సార్ సీపీ నుంచి వచ్చిన వారికి జెడ్పీ పీఠం కట్టబెట్టడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.