ఫిరాయింపు దారునికే పట్టం!
భానుగుడి (కాకినాడ) : జిల్లా పరిషత్ సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. ఓట్లేసి గెలిపించిన ఆ ప్రజల నమ్మకాన్నే పదవి కోసం తాకట్టుపెట్టిన జ్యోతుల నవీన్ తీరు చర్చనీయాంశమైంది. ఒక పార్టీ జెండాతో గెలిచి మరో పార్టీకి ఫిరాయించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, తన
జెడ్పీ చైర్మన్‌గా నవీన్ ఎంపిక
సాంప్రదాయాన్ని మంటకలిపిన టీడీపీ
ఎన్నిక విధానాన్ని తప్పుపట్టిన ప్రతిపక్షం
ప్రజాస్వామ్యం ఖూనీకి గురైందని ఆవేదన
భానుగుడి (కాకినాడ) : జిల్లా పరిషత్ సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. ఓట్లేసి గెలిపించిన ఆ ప్రజల నమ్మకాన్నే పదవి కోసం తాకట్టుపెట్టిన జ్యోతుల నవీన్ తీరు చర్చనీయాంశమైంది. ఒక పార్టీ జెండాతో గెలిచి మరో పార్టీకి ఫిరాయించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, తనయుడు నవీన్ జెడ్పీ చైర్మన్‌గా అధికారిక ఎన్నికల ద్వారా బాధ్యతలు చేపట్టారు.
ప్రతిపాదనలకే పరిమితమైన పేరాబత్తుల
గత నెల 21న జెడ్పీ చైర్మన్‌గా నామనను తప్పించి జ్యోతుల నవీన్‌కు పదవిని కట్టబెడుతూ జీవో వచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రకారం ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాను ప్రిసైండింగ్ అధికారిగా నియమించి బుధవారం ఉదయం 11 గంటలకు జెడ్పీకి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించి జెడ్పీటీసీ సభ్యులు ప్రతిపాదించిన జ్యోతుల నవీన్‌ను చైర్మన్‌గా ఎన్నికచేశారు. ఈ ఎన్నికలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. 2015 లో జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికల అనంతరం నామనకు పోటీగా నిలిచిన ఐ.పోలవరం జెడ్పీటీసీ సభ్యుడు పేరాబత్తుల రాజశేఖర్ పార్టీ అదేశాలతో పోటీ నుంచి వైదొలిగి అనంతరం నిర్వహించిన ఎన్నికల్లో నామనను స్వయంగా ప్రతిపాదించారు. ప్రస్తుతం ఫిరాయింపు దారునికి పదవేంటని, నామనను తప్పించేందుకు వీల్లేదని వాదించారు. గతంలో భంగపడ్డ ఆయన, ఇప్పుడు మరోసారి నవీన్ ఎన్నికను వ్యతిరేకించి మరోసారి డీలాపడ్డారు. ఇలా రెండుసార్లూ చైర్మన్ ఎంపిక ప్రతిపాదన తానే చేయడం సభలో ఆసక్తిగా మారింది. ఎన్నికల నియమావళి ప్రకారం నవీన్‌ను చైర్మన్‌గా పేరాబత్తుల ప్రతిపాదించగా కాట్రేనికొన జెడ్పీటీసీ సభ్యుడు నాగిడి నాగేశ్వరరావు బలపర్చారు. వైస్ చైర్మన్‌గా రంగంపేట జెడ్పీటీసీ సభ్యుడు పెండ్యాల నళినీకాంత్ పేరును రాజానగరం జెడ్పీటీసీ సభ్యులు పల్లం రత్నం ప్రతిపాదించగా కూనవరం జెడ్పీటీసీ సభ్యులు వై.కన్యకాపరమేశ్వరి బలపర్చారు. ఎన్నికల సమయంలో ఎటవంటి అభ్యంతరాలు రాకపోవడంతో చైర్మన్‌గా జ్యోతుల నవీన్, వైస్‌చైర్మన్‌గా పెండ్యాల నళినీ కాంత్‌లను ఖరారు చేస్తూ ప్రిసైండింగ్ అధికారి కార్తికేయ మిశ్రా ప్రమాణం చేయించి, నియామక పత్రాలను అందించారు.
47 మంది సభ్యుల హాజరు.
ప్రస్తుతం ముంపు మండలాలతో కలిపి 60 మంది జెడ్పీటీసీ సభ్యులున్న పరిషత్ ఎన్నికలకు 47మంది మాత్రమే హాజరయ్యారు. వారిలో వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన ఆరుగురు సభ్యులు సమావేశానికి హాజరై అధికార పార్టీకి అనుకూలంగా ఓటువేశారు. 48 మంది టీడీపీ సభ్యుల్లో 7 గురు సమావేశానికి హాజరుకాలేదు. పూర్వపు జెడ్పీచైర్మన్ నామన రాంబాబు సైతం సమావేశానికి హాజరుకాలేదు. సమావేశంలో జెడ్పీ సీఈఓ పద్మ, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్యేలు వరుపుల, జ్యోతుల, పెందుర్తి వెంకటేష్, వేగుళ్ల జోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికలను బహిష్కరిస్తున్నాం : ప్రతిపక్ష నేత సాకా
జెడ్పీ ప్రతిపక్షనేత సాకా ప్రసన్నకుమార్ జెడ్పీచైర్మన్ ఎన్నికల నియామవళిని సభ్యులకు అందివ్వకుండా ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించారని, ఈ ఎన్నికను తాము పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. ఒక పార్టీ జెండాతో గెలిచి మరో పార్టీకి కేవలం పదవికోసం ఫిరాయించడం నీచమన్నారు. తమ సభ్యులు సమావేశానికి హాజరుకాకుండానే ఎన్నిక నిర్వహించిన ప్రిసైడింగ్ అధికారి తీరును వారు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం పదవులను అనుభవించినా నేడు రాబోయే ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో చేసిన తప్పులకు అధికార పార్టీ, ఫిరాయింపుదారులు తప్పక సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. వైఎస్సార్ సీపీ సభ్యులు సత్తి సూత్యనారాయణరెడ్డి పి.భారతి, సోయం అరుణ, మట్టా రాణి పాల్గొన్నారు.