రెచ్చిపోయిన స్నాచర్లు
=వేర్వేరు ప్రాంతాల్లో 8 గొలుసు దొంగతనాలు
=మొత్తం 28.5 తులాల బంగారం చోరీ
ఉప్పల్/నాచారం/కుషాయిగూడ, న్యూస్‌లైన్: నగరంలో స్నాచర్లు మళ్లీ రెచ్చిపోయారు. గురువారం ఉప్పల్, నాచారం, కుషాయిగూడ, కేపీహెచ్‌బీ, ఆసిఫ్‌నగర్ ఠాణాల పరిధిలో ఎనిమిది గొలుసు చోరీలకు పాల్పడ్డారు. మొ త్తం 28.5 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దీని విలువ సుమారు 8.5 లక్షలు ఉంటుంది. కాగా, బాధితుల్లో ఒకరు ఏఎస్ఐ భార్య ఉండటం గమనార్హం.
గుడికి వెళ్తుండగా...
గాంధీనగర్ ఏఎస్ఐగా పనిచేస్తున్న కె.మోహన్‌లాల్ మౌలాలి హౌసింగ్‌బోర్డు వెంకటేశ్వరనగర్‌లో ఉంటున్నారు. ఇతని భార్య కల్యాణి(46) మరో ముగ్గురు మహిళలతో కలిసి గురువారం ఉదయం 10.30కి స్థానిక సాయిబాబా గుడికి నడుచుకుంటూ వెళ్తుండ గా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని 4 తులాల మంగళసూత్రం లాక్కొనిపోయారు.
రేషన్ షాపునకు వెళ్తుండగా...
మౌలాలి హెచ్‌బీ కాలనీ లక్ష్మీనగర్‌లో ఉండే పెండ్యాల మాధవి(38) గురువారం ఉదయం రేషన్ షాపునకు వెళ్తుండగా గోపాల్ జ్యువెలరీస్ సమీపంలో వెనుక నుంచి బైక్‌పై వచ్చిన దుండగులు ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు. ఈ రెండు ఘటనలపై కుషాయిగూడ పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నాచారంలో..
నాచారం హెచ్ఎంటీ నగర్లో ఉండే దేవినేని సువర్ణ(50) గురువారం మధ్యాహ్నం తన మనుమడిని స్కూల్నుంచి తీసుకొచ్చేందుకు బాపూజీనగర్ గుండా వెళ్తున్నారు. అదే సమయంలో ఉప్పల్ కళ్యాణపురి నుంచి హెచ్ఎంటీ నగ ర్కు నల్లరంగు కరిజ్మా బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలోని 3 తులాల గొలు సు తెంచుకుని రెప్పపాటులో పారిపోయారు. నాచారం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఉప్పల్‌లో...
ఉప్పల్ రాఘవేంద్రనగర్‌కు చెందిన రాధిక(35) మధ్యాహ్నం 12.45కి ఉప్పల్ బ్యాంక్ కాలనీ మీదుగా ఇంటికి వెళ్తున్నారు. ఎస్బీఐ వద్దకు రాగానే వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇ ద్దరు రాధిక మెడపై గట్టిగా కొట్టారు. ఆమె వెన క్కి తిరిగి చూసేలోగా 4 తులాల మంగళ సూ త్రం,పుస్తెల తాడును లాక్కొని పారిపాయారు.
బస్సు ఎక్కుతుండగా...
ఉప్పల్ శాంతినగర్‌కు చెందిన శారద ఇదే ప్రాంతంలో బస్సు ఎక్కుతుండగా వెనుక నుంచి వచ్చిన ఓ దుండగురాలు ఆమె మెడలోని నాలుగు తులాల మంగళ సూత్రాన్ని చోరీ చేసుకుపోయింది. బాధితురాలు బస్సు హబ్సిగూడ చేరుకున్నాక తన మెడలోని గొలుసు చోరీకి గురైందన్న గుర్తించింది. వెంటనే ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో...
మలేసియాటౌన్‌షిప్: కేపీహెచ్‌బీ ఠాణా పరిధి లో పది నిమిషాల తేడాలో రెండు చోట్ల స్నా చింగ్‌లు జరిగాయి. ఎస్సై లింగయ్య కథనం ప్రకారం.. కేపీహెచ్‌బీకాలనీ 3వ ఫేజ్ లో ఉంటున్న పిల్లారిశెట్టి రామపుష్పం (72) గురువారం మధ్యాహ్నం కన్యకాపరమేశ్వరి ఆల యం వద్ద ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా... రమ్యా సెంటర్ వద్ద బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారు గొలుసు లాక్కొ ని ఉడాయించారు. ఇదిలా ఉండగా, కేపీహెచ్ బీ కాలనీ బీఎస్ఎన్ఎల్ క్వార్టర్స్‌లో ఉంటున్న కంతి కళావతి (56) మధ్యాహ్నం 12.45కి గుడికి వెళ్లి వస్తుండగా బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్దకు రాగానే వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆమె మెడలో ఉన్న 4 తులాల గొలుసును తెంచుకుపోయారు.
గుడి నుంచి వస్తుండగా...
మెహిదీపట్నం: గుడిమల్కాపూర్‌కు చెందిన గంగమ్మ అనే మహిళ గురువారం పద్మనా భనగర్లోని సాయిబాబాగుడికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో దిల్షాద్నగర్లో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు నగలు తెంచుకుపోయారు. ఆసిఫ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.