K. Rajasekhararaju
-
నెరవేరని వాగ్దానాలు.. ఫలించని స్వప్నాలు
కొత్తసీసాలో పాతసారా ఎఫ్‌డీఐలపై యూటర్న్ ‘భూసేకరణ’పై మొండిపట్టు చతికిలబడిన ఉత్పత్తి పెదవి విరుస్తున్న లెఫ్ట్ ఆరు దశాబ్దాలుగా నిర్వీర్యమైపోయిన వ్యవస్థలో కొత్త తరహా పాలనను తీసుకువస్తామని ప్రధాని నరేంద్రమోదీ పదే పదే ఉద్ఘాటిస్తున్నప్పుడు గతంలో ఏం జరిగింది? ఇప్పుడేం జరుగుతోంది అనే ప్రాతిపదికే ఆయన ప్రభుత్వ పనితీరును నిగ్గుతేలుస్తుంది. ఈ కోణంలో మోదీ ఏడాది పాలన మౌలికంగా యూపీయే పాలననే కొనసాగిస్తున్నట్లు వామపక్షాల అభిప్రాయం. నేటితో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకుంది. కోట్లాది రూపాయల వ్యయంతో సాగిన హైటెక్ ఎన్నికల ప్రచారంలో మోదీ ఆయన పార్టీ ప్రజలకు చేసిన వాగ్దానాల హోరు ను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. అధికారాన్ని సాధించాలనే మోదీ, బీజేపీ స్వప్నసాకారంలో అద్వితీయ పాత్ర పోషించిన మీడియా ప్రచార మాయ లోంచి బయటపడి వాస్తవాలు చూస్తే.. ఆ వాగ్దానాలు, ఆ స్వప్నాలు నెరవే రుతున్న సంకేతాలు ఏ రంగంలోనూ కనిపించడం లేదని వామపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. భావోద్వేగాలు, ట్వీటర్లు, సెల్ఫీలు, ప్రచారార్భాటా లను పక్కన పెడితే ఒక ఏడాది మోదీ పాలన దేశాన్ని ఎటువైపు తీసుకెళుతోం దన్నది అత్యంత ఆందోళనను కలిగిస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. భారత ప్రజలు దశాబ్దాలుగా పోరాటాల ద్వారా సాధించుకున్న సమస్త హక్కులపై నేడు దాడి జరుగుతోందన్నది సుస్పష్టమన్నారు. ఆరోగ్యం, విద్య, సాంఘిక సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ వంటి అత్యంత కీలకమైన రంగాలపై కేంద్ర బడ్జెట్ భారీ కోత విధిం చిందనీ, ఉన్న చిక్కులకు తోడు కొత్త సవాళ్లు దేశాన్ని, ప్రజలను వెంటాడుతు న్నాయనీ పేర్కొన్నారు. నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణలను దూకుడుగా కొనసాగించడంతోపాటు గణతంత్ర భారత్ ప్రజాస్వామిక పునాదులపై దాడి జరుగుతోందనీ, మతపరమైన విభజన, ఎవరినీ లెక్కచేయని నిరంకుశ పాలన అనేవి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కనీస పరిధులకు కూడా ప్రమా దం వాటిల్ల చేస్తున్నాయన్నారు. దీర్ఘకాలిక ప్రజాప్రయోజనాల కోణంలో ఏం జరగకూడదో ఆ పరిణామాలన్నీ నేడు నిర్భీతిగా జరిగిపోతున్నాయని వామ పక్షాల అభిప్రాయం.. యూటర్న్ మతలబు: గతంలో రిటైల్ వ్యాపారంలో ఎఫ్‌డీఐలను అను మతించడంపై యుద్ధం ప్రకటించిన బీజేపీ అధికారంలోకి రాగానే యూటర్న్ తీసుకుంది. - 2013 భూసేకరణ బిల్లు ప్రాతిపదికకే తూట్లుపెడుతూ, కొత్త సవరణ బిల్లు ఆమోదం కోసం మోదీ ప్రభుత్వం 3 సార్లు ప్రయత్నించి భంగపడింది. రియల్ ఎస్టేట్ పేరుతో గంపగుత్తగా భూ, సహజ వనరులను విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టడానికి పరుగులు తీస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలను కనీవినీ ఎరుగనంత వేగంతో ప్రయివేటీకరిస్తుండటం కళ్లముందే జరిగిపోతోంది. గత సంవత్సర కాలంగా దేశ ఉత్పత్తి రంగంలో ఏ పెనుమార్పూ చోటు చేసుకోలేదు. ప్రతి త్రైమాసికంలోనూ వస్తూత్పత్తి, పారిశ్రామికోత్పత్తి చతికిల పడినట్లు నమోదైంది. ధరలపై యుద్ధం ప్రకటించి మరీ గెలిచిన మోదీ ప్రభు త్వ హయాంలో నిత్యావసర సరుకుల ధరలు కొండెక్కి కూచున్నాయి. అం తర్జాతీయ చమురు ధరలు గణనీయంగా తగ్గినా ఏడాది కాలంగా ప్రజలకు ప్రయోజనం కల్పించక పోగా చమురు ధరలను, వాటిపై పన్నులను మళ్లీ పెంచేస్తున్నారు. దేశానికి వెన్నెముకగా చెప్పుకునే వ్యవసాయ రంగంలో స్వాతంత్య్రానంతరం తొలిసారిగా మొత్తం సాగుభూమి తగ్గిపోయిన ఘనత కూడా మోదీ హయాంలోనే నమోదైంది. ఇవన్నీ గత పాలకుల విధానాల కొన సాగింపే తప్ప మోదీ మార్కు పాలన సుగుణాలు కనిపించడం లేదని వామ పక్షాల నిశ్చితాభిప్రాయం. మోదీ ఏడాది పాలనలో గణనీయ మార్పు ఏదైనా ఉందంటే భారత్‌లోని సంపన్న బిలియనీర్ల సంఖ్య నూటికి నూరు శాతం పెరగడమేనని వీరంటున్నారు. ఆర్థికరంగంలో ఊహించిన మార్పులు కనీసం గా జరుగకపోగా, పర్యావరణం, మానవహక్కులు, కార్మిక చట్టాలు వంటి అంశాల్లో మనం గతంలో అంగీకరించిన అంతర్జాతీయ మర్యాదలను కూడా మోదీ ప్రభుత్వం తోసిపుచ్చుతోంది. ప్రభుత్వ పాత్రను కుదించడం ద్వారా కోట్లమందిని దారిద్య్రం కోరల్లోకి నెట్టివేయడం నిశ్శబ్దంగా జరిగిపోతోంది. ధరల నియంత్రణ హుళక్కి: సార్వత్రిక ఎన్నికల సమయంలో ధరల పెరు గుదలపై యూపీఏ ప్రభుత్వాన్ని అంటకాగిన మోదీ తన ఏడాది పాలనలో ఎడాపెడా ధరలను పెంచడం ఆశ్చర్యమేమీ కాదు. గత పాలనకు, ప్రస్తుత పాలనకు తేడా ఏదన్నా ఉందంటే అది ధరల పెంపుదలలో కొత్తదనమే. ఊ అధికారంలోకి వచ్చిన వెంటనే డీజిల్ ధరను లీటరుకు రూ.1.27 పైసల వరకు పెంచారు. ఊ రైల్వే ప్యాసింజర్ చార్జిలను 14.2 శాతం, సరకుల రవాణా చార్జీలను 6.5 శాతం పెంచారు. ఊ రోజువారీ ప్రయాణికుల నెలవారీ రైల్వే టికెట్ ధరలను రెట్టింపు చేశారు. ఊ రైల్వే స్టేషన్ల ప్రయివేటీ కరణకు పిలుపిచ్చారు. స్టేషన్లలో లగ్జరీ హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర సౌకర్యా లను ప్రైవేట్ పార్టీలకు అప్పగిస్తామన్నారు. ఊ ఎఫ్‌డీఐలకు అనుమతివ్వడం ద్వారా రైల్వేల నిర్వహణను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగిస్తామని సూచిం చారు. ఊ రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ధరను గత నెలలో రెట్టింపు చేశారు. ఊడిఫెన్స్, మీడియా రంగాల్లో 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తామని ప్రతి పాదించారు. ఊ ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వరంగ బ్యాంకులు తమ వద్ద ఉన్న ప్రభుత్వ వాటాలను తప్పకుండా 25 శాతం మేరకు ఉప సంహరించుకోవాలని ఆదేశించారు. ఊ చక్కెర ధరను కిలోకు రూ.3లు పెంచారు. ఎల్పీజీ సిలెండర్ ధరను నెలకు రూ.10 చొప్పున పెంచుకుంటూ పోయారు. ఊ డీలర్లకు కమిషన్ పేరిట వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.3లు పెంచారు. ఊ అదే సమయంలో ప్రతి గంటకూ రూ. 7 కోట్ల మేరకు కార్పొరేట్ పన్నులను తగ్గిస్తూపోయారు. ఊ మోదీ పాలనలో దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 43 మంది రైతులు చనిపోతున్నారు. ఊఅధికారంలోకి వస్తే విదేశాల్లోని నల్లధనాన్ని దేశంలోకి రప్పించి ప్రతి భారతీయుడి ఖాతాలోకి రూ.15 లక్షలను డిపాజిట్ చేస్తామని ఊదర గొట్టారు. కాని ఇప్పుడా ఊసే లేదు. ఇన్ని అవకతవకలు, వైఫల్యాల మధ్య ప్రభుత్వానికి అవినీతి ఏమాత్రం అంటకపోవడం కారుచీకటిలో కాంతిరేఖగా మోదీ మద్దతుదారులు చెప్పుకుంటున్నారు. కానీ, తన తొలి అయిదేళ్ల పాలనలో నాలుగేళ్లపాటు ఎలాంటి కుంభకోణం బారిన పడని యూపీఏ ప్రభుత్వం ప్రతిష్ట తదనం తరం ఎంత మసకబారిపోయిందో తెలిసిన విషయమే. ఆశ్రీత పెట్టుబడిదారీ సంస్కృతిని దూకుడుగా ముందుకు నెడుతున్న మోదీ ప్రభుత్వ నిజస్వరూపం బయటపెట్టడానికి సంవత్సర పాలన సరిపోదన్నదే నిజమని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. మొత్తం మీద మోదీ ఏడాది పాలనతో దేశానికి ఉజ్వల వైభవం సిద్ధించకపోగా, కోట్లమంది అట్టడుగు జనానికి శూన్యమే మిగలనుంది. ఉన్న సామాజిక ప్రయోజనాలు కూడా ఒక్కొక్కటిగా ఊడిపోతున్న దశలో హక్కుల సాధనకు, వాటిని మిగుల్చు కునేందుకు పోరాటాలు మాత్రమే ప్రజలకు మిగలనున్నాయని వామపక్షాల విశ్వాసం. కె. రాజశేఖరరాజు -
కశ్మీర్లో కాషాయ కలకలం
కశ్మీర్ ఎన్నికలు ప్రధాని నరేంద్రమోదీకి అతి పెద్ద సవాలు. ఆయన ఇంతవరకు సాధించిన విజయాలొక ఎత్తయితే జమ్మూ కశ్మీర్లో రేపు సాధించనున్న ఫలితం ఒకెత్తు. కశ్మీర్ లోయలో బీజేపీ పాగా వేసిందంటే మోదీ మంత్రజాలానికి సమీప భవిష్యత్తులో తిరుగులేదన్నమాటే. మరో నాలుగు రోజుల్లో జమ్మూ కశ్మీర్ శాసనస భకు తొలి దశ పోలింగ్ జరగనుంది. కానీ జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కానీ, ప్రాంతీయ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్.సి), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) కానీ నేటివరకు తమ ఎన్నికల ఎజెం డా, విధానాలపై మేనిఫెస్టోను విడుదల చేయ లేదు. ముఖ్య కార్యక్రమాలతో బిజీగా ఉన్నామని, వరద పునరావాస పనుల్లో ఉన్నామని, జాతీయ నేతలు రావాలని అన్ని పార్టీలూ సాకులు చెబుతు న్నాయి. నవంబర్ 25న రాష్ట్రంలో తొలి దశ పోలింగ్ ప్రారంభం కానుండగా, డిసెంబర్ 2, 9, 14, 20 తేదీల్లో తదుపరి దశల ఎన్నికలు జరుగనున్నాయి. మరోవైపు రాష్ట్రంలో ప్రచార కార్యక్రమం పుం జుకుంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆక ర్షించడానికి ప్రచారం ముమ్మరం చేశాయి. గత ఆరే ళ్లుగా తమ కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సాధించిన విజయాలను ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకోవాలని నేషనల్ కాంగ్రెస్ (ఎన్సీ) పార్టీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రయత్నిస్తుంటే, పాలక కూటమి వైఫల్యాలను ఎత్తిచూపి ఓటర్లను ప్రభావి తం చేయడానికి అక్కడి ప్రాంతీయ పార్టీ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ), బీజేపీ అభ్యర్థులు ప్రయ త్నిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని సిక్కుల అభివృద్ధి కోసం పీడీపీకి ఓట్లేయాలని శిరోమణి అకాలీదళ్ సిక్కు మతస్తులకు పిలుపునిచ్చింది. గంపెడాశల కమలం కశ్మీర్లో ఈ దఫా త్రిముఖ పోటీ ఉంటుందన్న సూచనలు కనిపిస్తున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి ఒకవైపు, ప్రతిపక్ష పీడీఎఫ్ మరో వైపు, ఆశల పల్లకీలో భారీ అవకాశాలను చూస్తున్న బీజేపీ మరోవైపు తలపడుతున్నాయి. అనుకున్నం తగా అభివృద్ధి చేయలేకపోయామని ముఖ్యమంత్రి ఒమర్ చేసిన ప్రకటనతోటే ఈ సారి ఎన్సీ, కాంగ్రెస్ కూటమి గెలుపుపై సందేహం మొదలైంది. (గత ఎన్నికల్లో ఈ కూటమి వరుసగా 28, 17 స్థానాలు సాధించింది.) ఈ నేపథ్యంలో పీడీపీ మెజారిటీ స్థానాలపై దృష్టి పెట్టింది. సర్వేలు కూడా ఆ పార్టీకి ఆశలు రేకెత్తిస్తున్నాయి. మరోవైపున బీజేపీ ఈ దఫా కశ్మీర్‌పై భారీ ఆశలను పెట్టుకుంది. కశ్మీర్లో హిం దూ అభ్యర్థుల స్థానంలో ముస్లింలకు సీట్లు ఇచ్చి వ్యూహాత్మకగా పావులు కదిపింది. కశ్మీరులో పాగా వేయడానికి నరేంద్రమోదీ జనాకర్షణ సాక్షిగా బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మోదీ మంత్రం - ఆర్టికల్ 370 ఒకరకంగా చెప్పాలంటే మోదీకి తన రాజకీయ జీవి తంలోనే ఇదొక అత్యంత కష్టమైన సమరం. ఆయన ఇంతవరకు సాధించిన విజయాలొక ఎత్తయితే జమ్మూ కశ్మీర్లో రేపు సాధించే ఫలితం ఒకెత్తుగా నిలబడుతోంది. ఎందుకంటే కశ్మీర్ లోయలో బీజేపీకి ఎలాంటి పునాదీ లేదు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేయాలని బీజేపీ సుదీర్ఘకా లంగా డిమాండ్ చేస్తూవస్తోంది. అయితే కశ్మీర్‌పై పట్టు సాధించే ఉద్దేశంతో ఈ దఫా ఎన్నికల్లో ఆర్టికల్ 370పై తన వైఖరిని కాస్త సడలించుకుంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ అంశాన్ని ఎన్నికల సమయంలో ప్రస్తావించవలసిన అవసరంలేదని తాజాగా పేర్కొన్నారు. కాగా ప్రధాని మోదీ ఈ సారి జమ్మూ కశ్మీర్ ఎన్నికల ప్రచారాన్ని మార్చేశారు. రెండు ప్రాంతీయపార్టీలూ, కాంగ్రెస్‌పార్టీ చుట్టూనే తిరుగాడే రాష్ట్ర ఎన్నికల చిత్రాన్ని కదిలించి వేశారు. మాజీ వేర్పాటువాద నేత సజ్జద్లోనే ఈ వారం మోదీని కలిసి, కశ్మీర్ భాగ్యరేఖలను ప్రధాని మార్చి వేస్తారని కితాబివ్వటం చిన్నవిషయం కాదు.. గత సెప్టెంబర్‌లో వరద బీభత్సంలో చిక్కుకున్న కశ్మీర్‌కు వరాలు కురిపించిన ప్రధాని మోదీ అక్కడి యువ తపై తనదైన ప్రభావం వేశారు. వరద సహాయక చర్యల్లో ఒమర్ ప్రభుత్వం చేష్టలుడిగిపోగా కేంద్రం భారీ సహాయ చర్యలు చేపట్టడం సామాన్య ప్రజ లను కదిలించింది. సర్వేతో పెరిగిన ఆశలు రాష్ట్ర అసెంబ్లీలో 87 స్థానాలుండగా బీజేపీ ఈ దఫా అత్యధిక స్థానాల్లో గెలవనుందని, కానీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 44 స్థానాలకంటే తక్కు వగానే ఆ పార్టీకి వస్తాయని ఈ వారం ఒక పోల్ సర్వే పేర్కొంది. గత ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే సాధించినప్పటికీ హిందూ ఆధిక్యత ఉన్న జమ్మూ లో, బౌద్ధుల ఆధిక్యత ఉన్న లడఖ్‌లో మెజారిటీ సీట్లు ఈసారి తమ వశం కావచ్చని బీజేపీ ఆశిస్తోం ది. ముస్లిం మెజారిటీ ఉన్న కశ్మీర్లో కొన్ని స్థానాలు గెల్చుకుంటే 30 స్థానాలవరకు తమ పరమవుతా యని, స్వతంత్ర అభ్యర్థులకు గాలంవేస్తే 44 స్థానాల మ్యాజిక్ నంబర్ సాధించడం పెద్ద కష్టం కాదని ఆ పార్టీ వ్యూహకర్తల భావన. ప్రాంతీయ పార్టీల్లో చీలికలు తెచ్చి, అభివృద్ధిపై ప్రచారంతో ప్రత్యర్థులపై గురిపెట్టే వ్యూహాన్ని బీజేపీ కశ్మీర్లో అమలు చేయనుంది. ‘ఇప్పుడు నడుస్తోంది అభి వృద్ధి మంత్రం. కాశ్మీర్లో అభివృద్ధి కోసం ఆరాటం దేశం మొత్తంలో కంటే కాస్త అధికంగానే ఉంది. మోదీతో భుజం కలిపి సాగే ప్రభుత్వాన్ని రాష్ట్రంలో కోరుకుంటున్నాం’ అని బీజేపీ వ్యూహకర్త రామ్ మాధవ్ చెప్పిన మాటల సారాంశం సుబోధకమే. ఇంతకూ కశ్మీరులో మోదీ మంత్రజాలం ఫలిం చేనా? హిమవత్పర్వత సానువుల్లో కమలం వికసిం చేనా? యావత్ భారతం ఈ ప్రశ్నకు సమాధానం కోసం వేచిచూస్తోంది మరి. - కె. రాజశేఖరరాజు -
పీడిత జన న్యాయమూర్తి వి.ఆర్.కృష్ణయ్యర్
ప్రజానుకూల తీర్పుల ద్వారా న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని దీప్తిమంతం చేసిన అరుదైన న్యాయమూర్తి జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్. పీడితుల పట్ల ఇంత ప్రేమను, పక్షపాతాన్ని ప్రదర్శించిన న్యాయమూర్తులు చాలా అరుదు. ఆయనకిప్పుడు వందేళ్లు. రిటైరయ్యాక కూడా అవిశ్రాంతంగా సామాజిక న్యాయంకోసం పోరాడుతున్నారు. ఒక సమాజ చరిత్రలో వందేళ్లు అంటే తక్కువ కాలమే కావ చ్చు. ప్రాకృతిక ప్రతిబంధకాలను అధిగ మించి ఒక వ్యక్తి జీవితం వందేళ్లు కొనసాగితే ఏ సమాజానికైనా అదొక అపురూపమైన విషయం. అలా జీవించడం మాత్రమే కాదు...న్యాయవాదిగా, మంత్రిగా, హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా వివిధ పాత్రలు పోషిస్తూ కూడా పీడిత జన పక్షపాతాన్ని కొనసాగించడం అసామాన్యం. అలాంటి అరుదైన వ్యక్తి జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్ తన వందో పుట్టినరోజును ఈమధ్యే జరుపుకున్నారు. మన సమాజంలోని దురదృష్టవంతుల తరపున అవిశ్రాం తంగా పోరాడుతూ వచ్చిన ఈ విశిష్టవ్యక్తి పదవీ విరమణ తర్వాత కూడా ప్రశాంత జీవితం ఎంచుకోకుండా ఎక్కడ అన్యాయం కనిపించినా, తన నిరసన వాణిని నిరంతరం గా వినిపిస్తున్నారు. వి.ఆర్ కృష్ణయ్యర్ పూర్తి పేరు వైద్యనాథపుర రామకృష్ణ అయ్యర్. 1914 నవంబర్ 15న కేరళ రాష్ట్రంలో మలబారు ప్రాంతంలోని పాలక్కాడ్ సమీ పంలోని వైద్యనాథపురంలో జన్మించారు. 1952లో కేరళ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1957లో కేరళలో తొలి కమ్యూనిస్టు ప్రభుత్వంలో మంత్రిగా చేరి శాస న, విద్యుత్, జైళ్లు, సాగునీటి శాఖల్లో మౌలిక మార్పులు తీసుకువచ్చారు. ప్రభుత్వం రద్దుతో మళ్లీ న్యాయవాద వృత్తి చేపట్టా రు. అటు తర్వాత కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 1973లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమి తులై 1980లో పదవీవిరమణ చేశారు. న్యాయవ్యవస్థ గౌరవా న్ని నిలబెడుతూ అసంఖ్యాక తీర్పులను వెలువరించి న్యాయాన్ని సామాన్యుల చెంతకు చేర్చారు. పద్మవి భూషణ్‌తోపాటు అనేక అవార్డులు ఆయన్ను వరించాయి. నాలుగు పర్యాటక గ్రంథాలతో సహా న్యాయ, సామాజిక, రాజకీయ అంశాలపై మొత్తం 105 పుస్తకాలు రచించారు. కమ్యూనిస్టు ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన కృష్ణయ్యర్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిం చడంపై పలువురు న్యాయనిపుణులు భృకుటి ముడిచారు. కాని అనుమానించిన వారే ఆరాధించేలా చేసుకున్నారు. సుప్రీంకోర్టులో జస్టిస్ పీఎన్ భగవతి, జస్టిస్ చిన్నపరెడ్డిల పై ఆయన ప్రభా వం ఫలితంగా 1970-80 మధ్య కాలంలో భారత రాజ్యాంగ దార్శనికత ఒక స్పష్టమైన వాస్తవంగా రూపు దిద్దుకుంది. ఈ క్రమంలో ప్రజాప్రయో జన వ్యాజ్యం దేశ ప్రజలకు ఒక వరమైంది. దశాబ్దాలుగా స్తబ్దతకు గురైన పాత న్యాయ నిబంధనలకు వీరు పాతరే శారు. అట్టడుగు వర్గాల ప్రజలకు ఉప శమనం కలిగించే తీర్పులను ఈ న్యాయమూర్తుల త్రయం వెలువరించింది. దీని ఫలితంగా సామాన్యుల హృదయాల్లో న్యాయవ్య వస్థపై గౌరవం, ఆరాధన ఏర్పడింది. మన సర్వోన్నత న్యాయస్థానం కీర్తి ప్రతిష్టలు జాతీయంగా, అంతర్జాతీ యంగా మార్మోగాయి. చారిత్రాత్మక తీర్పు నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నిక వివాదంపై జస్టిస్ కృష్ణయ్యర్ 1975 జూన్ 24న ఇచ్చిన తాత్కాలిక తీర్పు భారత న్యాయ చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఎన్నికల్లో అవకతవకలకు గాను ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని, ఆమె ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయరాదని అలహాబా ద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేయాలంటూ ఆమెపెట్టుకున్న అప్పీలును కృష్ణయ్యర్ తోసిపుచ్చారు. హైకోర్టు తీర్పుపై బేషరతు స్టే ఇవ్వడానికి కృష్ణయ్యర్ నిరాకరించారు. ఒక దేశ ప్రధానికి పార్లమెంటులో ఓటు హక్కు ఉండదని ప్రకటించిన అద్వితీయమైన తీర్పు అది. ఇందిర ఎన్నిక చెల్లదని ఆమెపై అనర్హత వేటు వేసిన ఈ తీర్పుతో ఆ మరుసటి దినం అంటే జూన్ 25న అత్యవసర పరిస్థితిని విధించి ఇందిరాగాంధీ దేశచరిత్రలో చీకటి అధ్యాయానికి నాంది పలికారు. ఆ తీర్పు అంతర్జా తీయ ప్రశంసలు పొందింది. సుప్రీంకోర్టు పరంగా చూస్తే అదొక అత్యుత్తమ కాలం. అలహాబాద్ హైకోర్టు తీర్పు తర్వాత ఇందిర తరపున నాటి కేంద్ర న్యాయమంత్రి హెచ్.ఆర్ . గోఖలే తనను కలుసుకుంటానని చేసిన అభ్యర్థనను కృష్ణయ్యర్ సున్నితంగా తిరస్కరించారు. భారత న్యాయ వ్యవస్థ ఉద్దీప్తం చెందిన క్షణాలవి. అవిశ్రాంత కార్యాచరణ న్యాయమూర్తులుగా, ప్రధాన న్యాయమూర్తులుగా పని చేసిన వారు కూడా రిటైరవగానే ప్రభుత్వ పదవులు, గవర్నర్ పదవులు, ఇతర ప్రయోజనాలకు సిద్ధపడిపోతు న్న కాలాన్ని మనం చూస్తున్నాం. కానీ జస్టిస్ కృష్ణయ్యర్ కీర్తి పదవీ విరమణ అనంతరం మరింతగా గుబాళించిం ది. 1980లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రిటైర్మెంట్ పుచ్చుకున్నప్పటినుంచి ఆయన సామాజిక న్యాయ చాంపి యన్‌గా అవతరించారు. రాజ్యాంగ విలువలు, చట్టబద్ధ పాలన, సామాజిక న్యాయం వంటి పలు అంశాలపై ఆయన వ్యాఖ్యానాలు, ప్రతిస్పందనలు జాతీయంగా, అంతర్జాతీయంగా మన్ననలు పొందాయి. అంతర్జాతీయ న్యాయ కమిషన్ మాజీ అధ్యక్షుడు జస్టిస్ మైఖేల్ కిర్బీ (ఆస్ట్రేలియా), ఈ శతాబ్దిలోనే ఉమ్మడి న్యాయానికి సంబంధించిన అత్యున్నత మూర్తిగా కృష్ణయ్యర్‌ను ప్రశం సించారు. 90 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా సామాజిక సమస్యలపై ఆయా సందర్భాల్లో స్పందిస్తూనే వచ్చారు. స్వస్థలమైన కేరళలో అనేక ప్రజా ఉద్యమాలు, ప్రపంచీకరణ వ్యతిరేకోద్యమాలకు ఆయన నాయకత్వం వహించారు. 2008లో ప్రముఖ న్యాయమూర్తులు, పౌర హక్కుల కార్యకర్తలతో కలిసి, అంతర్జాతీయ మానవ హక్కులకు కట్టుబడి ఉండాల్సిందిగా ఇరాన్ ప్రభుత్వానికి బహిరంగలేఖ రాశారు. కోట్లమంది పైగా ప్రజలు ఆకలి దప్పులతో అలమటిస్తున్న దేశంలో ఇస్లామిక్ బ్యాంకింగ్, ఫైనాన్స్‌ను ప్రవేశపెట్టడానికి ఆయన 2010లో మద్దతు నిచ్చారు. శతవసంతాల జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్‌కు శతాసహస్రాభివందనాలు. కె.రాజశేఖరరాజు -
వాతావరణ స్పృహ-నిస్పృహ
అమెరికాలో సాధారణ వ్యక్తుల నుంచి ప్రముఖుల దాకా అందరూ వాతావరణ మార్పు దుష్ఫలితాలను గుర్తించ నిరాకరించడం అక్కడి శాస్త్రజ్ఞులను తీవ్రంగా కలవరపెడుతోంది. ఈ నిస్పృహ శాస్త్రప్రపంచాన్ని వాతావరణంలో మార్పులపై పరిశోధనలకే దూరం చేస్తుండటం విషాదకరం. రెండే ళ్ల క్రితం అమెరికాలో ఒక పరిశోధకురాలు వృత్తి పట్ల తీవ్ర ఆశాభంగంతో తాను చేస్తున్న పరిశో ధనను వదులుకుని దేశం విడిచి వెళ్లిపోయారు. ఆమె ఆశాభంగానికి రీసెర్చ్ గైడ్‌తో విభేదాలు, వివ క్ష, అశక్తత, వృత్తిపట్ల అనాసక్తి... ఇవేవీ కారణం కాదు. ప్రపంచాన్ని కలవరపరుస్తున్న ఒక కీలక సమ స్యపై ఏ దేశం తరపున తాను పరిశోధన చేస్తోందో ఆ దేశంలో ఎవ్వరూ ఆ అంశాన్ని పట్టించుకోకపోవ డమే ఆమె నిరాశకు కారణం. ఆమె పేరు కెమెల్లి పరమేశన్. ఆమె చేస్తున్న పరిశోధన వాతావరణ మార్పు. అమెరికా సమాజం, ప్రభుత్వం, కీలకమైన ఫండింగ్ వ్యవస్థలు ఇలా ఎవరూ గుర్తించని అంశం పై తానెందుకు పరిశోధన చేస్తున్నట్లు అనే నిస్పృహ లోంచే ఆమె తన రీసెర్చ్‌ని వదులుకున్నారు. కానీ ఆమె అనామక పరిశోధకురాలు కాదు. వాతావరణ మార్పుపై ప్రపంచ ప్రభుత్వాల ప్యానె ల్ తరపున రూపొందించిన మూడవ అంచనా నివే దిక కీలక రచయితగా ఆమె, అమెరికా పూర్వ ఉపా ధ్యక్షుడు అల్గోర్తోపాటు 2007లో నోబెల్ శాంతి బహుమతి పంచుకున్నారు. భూమండలంలోని ప్రాణులపై వాతావరణ మార్పు ప్రభావాలపై చేసిన కృషికి ప్రపంచంలోని 27 మంది సాహస చింతనా పరుల జాబితాలో ఆమెకు అట్లాంటిక్ పత్రిక చోటు కల్పించింది. ఈ గుర్తింపులేవీ ఆమె పరిశోధనకు ఊతం ఇవ్వలేకపోయాయి. యావత్ ప్రపంచానికీ కలగనున్న పెనుముప్పుపై అమెరికాలో ఏ ఒక్కరూ దృష్టి పెట్టకపోవడంపై ఆమె విసిగిపోయారు. తానెందుకీ పరిశోధన చేస్తున్నట్లు అన్న ప్రశ్న వెంటాడగానే ఆమె అమెరికాను విడిచిపెట్టి భర్త స్వస్థలమైన ఇంగ్లండ్‌కు వెళ్లిపోయారు. వాతావరణ మార్పు నిజంగానే సంభవిస్తోందనే అంశాన్ని అకడ మిక్ చర్చల్లో, బహిరంగ సభల్లో సభికులకు అర్థం చేయించడానికే తనకు సగం సమయం పట్టేదని కెమెల్లీ వాపోయారు. ఇప్పుడామె ఇంగ్లండ్‌లోని ప్లి మౌత్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. విషాదకరమైన అంశం ఏమంటే ఈ ఉదంతం ఒక్క కెమెల్లి పరమేశన్కే పరిమితమైనది కాదు. భూతాపం ఇప్పటికే మానవ మనస్తత్వంపై తీవ్ర ప్రభావం కలిగిస్తోంది. వాతావరణ మార్పుతో వస్తు న్న పెనుతుపానులు విధ్వంసకరంగా మారటం, దీర్ఘకాలిక కరువులు సంభవించడం వంటివి ఇప్ప టికే ప్రపంచ జనావళిని తీవ్ర నిస్పృహలోకి నెడుతు న్నాయి. విపత్తు అనంతర దుస్థితిని సహించలేక ఆత్మహత్యాధోరణులు ప్రబలుతున్నాయి. వాతా వరణ దుష్ఫలితాలను ప్రతిరోజూ పోగవుతున్న కొత్త డేటాతో పోల్చిచూస్తున్న శాస్త్రజ్ఞులు సైతం భావోద్వేగాలకు గురవుతున్నారు. కానీ సామాన్య ప్రజానీకంతోపాటు దేశాధ్య క్షులు, పారిశ్రామికవేత్తలు, కీలక నిర్ణేతలు, ద్రవ్య సంస్థలు సైతం వాతావరణ మార్పుల దుష్ర్పభావా లపై శీతకన్ను వేస్తుండటం శాస్త్ర ప్రపంచాన్ని కలవరపెడుతోంది. యావత్ ప్రపంచం దీనివల్ల ఏం కోల్పోనున్నదో గమనిస్తూ ఉద్వేగానికి, ఒత్తిడికి గురికాని శాస్త్రవేత్త లేరని పరమేశన్ స్పష్టం చేశారు. తల్లిదండ్రులు, భార్యాభర్తల మధ్య ఏర్పడుతున్న చికాకులపైనే యావత్ సమాజ చర్చ సాగుతోందని ఆమె ఆరోపణ. కానీ వాతావరణ విపత్తు ఫలితంగా వేల సంవత్సరాల పాటు ప్రాణులలో మార్పులు, ప్రభావాలు కలుగనున్న తరుణంలో.. సరైన సాకర్ సామగ్రిని కొనుక్కోవడం, స్కూలులో మర్చిపోయి న దానిపై ఆలోచించడం అనేది పరమ విచారకరం. పైగా భవిష్యత్తుకు కలుగనున్న విపత్తు గురించిన సమాచారాన్ని ఎవరితోనయినా పంచుకుంటే దాన్ని తాము నమ్మలేమంటూ మొత్తం చర్చను నమ్మకా లు, అపనమ్మకాల జంజాటనగా మార్చేస్తున్నారు. ఇలా ఏ రకంగాను రానున్న ముప్పుపై అమెరికా సమాజం స్పందించకపోవడం శాస్త్రజ్ఞులను తీవ్ర నిస్పృహకు గురిచేస్తోంది. పైగా సైన్స్‌ను మత దృష్టి తో గుడ్డిగా వ్యతిరేకిస్తున్న వారు వాతావరణ మా ర్పు దుష్ఫలితాలపై శాస్త్రజ్ఞుల వాస్తవ భయాలను సైతం తోసిపుచ్చుతున్నారు. భూమ్మీద జీవవైవిధ్యా న్ని ధ్వంసం చేస్తున్న విపరిణామాలపై తాము ప్రకటించే తాజా సమాచారాన్ని కూడా సైన్స్‌కు వ్యతిరేకంగా ప్రయోగించడం, సైన్స్‌నే తృణీకరించ డం అమెరికన్ పరిశోధకులపై ఒత్తిడులను కలిగి స్తోంది. పరిశోధన ద్వారా ప్రపంచ భవిష్యత్తుపై తమకు తెలుస్తున్న వాస్తవాలకు, సమాజం వాటి పట్ల ప్రతిస్పందిస్తున్న తీరుకు మధ్య అంతరాన్ని జీర్ణించుకోలేక ఆ వృత్తిలోని వారు మానసిక జాడ్యా నికి గురవుతున్నారు. పనికి, వ్యక్తిగత జీవితానికి మధ్య భేదాన్ని పెంచుతున్న ఈ పరిస్థితికి ధ్యానం, చికిత్సతోపాటు తమ పరిశోధన పట్ల నిజాయితీని విడిచిపెట్టవద్దని మానసిక నిపుణుల సలహా. పైగా వాతావరణ పరిశోధనలో నిమగ్నమైన వారు తాము పడుతున్న భావోద్వేగ సంఘర్షణలను తమలోనే దాచుకోకుండా బహిరంగ పర్చాలని అప్పుడే ‘క్లైమేట్ సైక్’ అనే స్థితిని సులభంగా ఎదు ర్కోవచ్చని వీరంటున్నారు. అయితే శాస్త్రజ్ఞుల మాన సిక అఘాతాలకంటే, ప్రపంచ కార్బన్ ఉద్గారాలను మనం తగ్గించి తీరాలని గత ఆదివారం వాతావరణ మార్పుపై ప్రపంచ ప్రభుత్వాల ప్యానెల్ ప్రకటిం చిన చారిత్రక నివేదికను అమెరికా గుర్తించవలసిన అవసరం ఎంతైన ఉంది. కె. రాజశేఖరరాజు