సర్దుకుపోదాం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘పాత సంఘటనలు మనసులో పెట్టుకోవద్దు. కలిసికట్టుగా పార్టీని విజయతీరాలకు చేరుద్దాం. మీ నాయకత్వంలో పనిచేస్తాం’ అని టీడీపీని వీడి గులాబీ గూటికి చేరిన ఎమ్మెల్యేలు పి.మహేందర్రెడ్డి, కె.ఎస్.రత్నంలు హరీశ్వర్రెడ్డితో అన్నారు. గురువారం ఉదయం వీరువురు పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్లో జరిగే కార్యక్రమంలో టీఆర్ఎస్లో చేరుతున్నామని, దీనికి రావాలని ఆయనను ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీని బలీయంగా మార్చేందుకు సమష్టిగా పనిచేశామని, అదే ఉత్సాహంతో టీఆర్ఎస్ను తీర్చుదిద్దుతామని అన్నారు.
టీడీపీలో కొనసాగిన సమయంలో తలెత్తిన అపోహలు మనసులో పెట్టుకోవద్దని, మీ మార్గదర్శకంలో పనిచేస్తామని ఈ ఇద్దరు నేతలు హరీశ్వర్రెడ్డితో అన్నట్లు తెలిసింది. తెలంగాణను అడ్డుకునేందుకు చంద్రబాబునాయుడు చివరి వరకు ప్రయత్నించారని, సీమాంధ్ర పార్టీలో కొనసాగడం ఇష్టలేకనే టీడీపీని వీడినట్లు చెప్పారు. ఈ సందర్భంగా హరీశ్వర్ మాట్లాడుతూ... పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, సమన్వయంతో గతంలో మాదిరిగా పాటుపడదామని అన్నారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవిని సైతం త్యజించి వచ్చానని, అంతిమంగా ప్రజలే న్యాయనిర్ణేతలని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణద్రోహులకు వారే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించినట్లు సమాచారం.