k v ramanachary
-
కళారంగానికి పెద్దపీట
తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి సాక్షి: హైదరాబాద్: తెలంగాణలో కళారంగానికి పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి తెలిపారు. కొత్త ఏడాదిలో అడుగుపెడుతున్న సందర్భంగా బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఇన్నాళ్లు నిరాదరణకు గురైన కళలకు పూర్వ వైభవం తీసుకువస్తామని చెప్పారు. సాంస్కృతిక శాఖకు ప్రభుత్వం రూ. 100 కోట్ల నిధులను కేటాయించిందని తెలిపా రు. కళలకు జీవం పోయడానికి ప్రత్యేకంగా సాంస్కృతిక సారథి అనే విప్లవాత్మకమైన విధానానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇలాంటి వ్యవస్థను ఏ రాష్ట్రం అమలు చేయలేదని చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తెలంగాణలోని కళలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే తమ భవిషత్తు లక్ష్యమని చెప్పారు. కొత్త రాష్ట్రంలో.. కొత్త సంవత్సరంలో సరికొత్త విధానాలతో ముందుకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో పుట్టిన పేరిణి నృత్యానికి జవజీవాలు పోసి అద్భుతమైన కళగా ప్రాచుర్యంలోకి తీసుకువస్తామని తెలిపారు. ఏడు సూత్రాల పథకాన్ని అమలు చేస్తాం: మామిడి హరికృష్ణ నూతన సంవత్సరంలో ఏడు సూత్రాల పథ కం తో సాంస్కృతిక శాఖ ముందుకు వెళ్లనున్నట్లు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఎం.హరికృష్ణ తెలిపారు. తెలంగాణలోని కళల ను ఆదరించడంతో పాటు గ్రామీణ, జాన పద, ప్రజా కళారూపాలు, కళాకారులకు ప్రోత్సాహం ఇస్తామన్నారు. పేద కళాకారుల సంక్షేమానికి పింఛన్ల మొత్తాన్ని రూ.1500 పెంచినట్లు గుర్తుచేశారు. తెలంగాణ కళారూపాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించడానికి ‘తానా’ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటామన్నారు. -
సీఎం కేసీఆర్ సారూ... మొర వినే దెవరు?
ఈ చిత్రంలోని అభాగ్యురాలిని చూశారా? నడవలేని దీన స్థితిలో ఎంతో కష్టపడి తెలంగాణ సెక్రెటేరియట్‌కు వచ్చిన ఆమె గాధ వింటే ఎవరికైనా కళ్లు చెమర్చక మానవు. కానీ మన అధికారులకు మాత్రం ఆమె బాధ అర్థం చేసుకునే ఓపిక.. తీరిక లేవు. ఆమె పేరు రమాదేవి. నల్గొండ పట్టణానికి చెందిన ఆమెకు పుట్టుకతోనే పోలియో సోకడంతో నడవలేకపోతోంది. ఆమె భర్త పేరు శ్రావణ్‌కుమార్. వీరికి ఇద్దరు పిల్లలు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో భర్త శ్రావణ్ కుమార్‌కు కాలు విరిగిపోయింది. అతను మంచాన పడ్డాడు. హైదరాబాద్ : ఇల్లు గడవడం కష్టమైంది. ఏం చేయాలో తోచని ఆమె సీఎం కేసీఆర్‌కు తన దుస్థితిని వివరించి, ఆదుకోవాల్సిందిగా కోరాలని భావించింది. వినతిపత్రంతో సోమవారం తెలంగాణ సచివాలయానికి చేరుకుంది. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులకు తన పరిస్థితిని వివరించి...సీఎంను కలిసేందుకు అవకాశం ఇప్పించాలని వేడుకుంది. అయినా ఫలితం కనిపించలేదు. ఆమెను లోపలికి పంపించేందుకు వారు నిరాకరించారు. ఎవరిని కదిపించినా ఉపయోగం లేకుండాపోయింది. చాలా సేపు అదే ఆవరణలో నిరీక్షించిన ఆమె చివరకు అటుగా వస్తున్న ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారికి తన దుస్థితిని వివరించే ప్రయత్నం చేసింది. ఆయనకు వినతిపత్రం ఇచ్చేందుకు యత్నించగా...‘నాకెందుకు ఇస్తావ్’ అని ప్రశిస్తూ వెళ్లిపోయారు. ‘నా ఇద్దరు పిల్లలు కడుపు నిండా తినగలిగితే అదే చాలు’ అంటున్న ఆమె మాటలు ప్రభుత్వ పెద్దలకు చెప్పే వారే లేకపోయారు. అప్పటికే తిరిగి తిరిగి అలసిపోయిన ఆ అభాగ్యురాలు నిరాశతో... కన్నీరు పెట్టుకుంటూ వెనుదిరిగింది. -
మెదక్ ఎంపీ అభ్యర్థిగా నాయిని... రమణాచారి?
తెలంగాణ సీఎం పదవి చేపట్టనున్న కేసీఆర్ మెదక్ ఎంపీ స్థానానికి రాజీనామా చేసేందుకు సిద్దమవుతున్నారు. దాంతో మెదక్ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపాలి అనే అంశంపై కేసీఆర్ పార్టీ నాయకులతో తీవ్రంగా చర్చిస్తున్నారు. మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత నాయిని నరసింహారెడ్డిని ఆ స్థానం నుంచి పోటీలోకి దింపాలని కేసీఆర్ భావించారు. అయితే అందుకు నాయినీ సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. తాను తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కావాలని భావిస్తున్నానని... తనకు ఎమ్మెల్సీ పదవి కేటాయిస్తే తద్వారా మంత్రిగా రాష్ట్రానికి సేవ చేసుకోవాలని భావిస్తున్నట్లు నాయిని తన మనసులోని మాటను కేసీఆర్ ముందు ఉంచినట్లు సమాచారం. దాంతో మెదక్ ఎంపీగా సీనియర్ మాజీ ఐఏఎస్ అధికారి కె.వి.రమణాచారిని రంగంలోకి దింపితే ఎలా ఉంటుందని కేసీఆర్ పార్టీ సీనియర్ నేతలను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరి కొద్ది సేపట్లో తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా కేసీఆర్ ఈ అంశంపై వారితో చర్చించే అవకాశం ఉంది.