Kaabil movie
-
హీరోయిన్ నకిలీ ఆధార్‌తో రూమ్ బుకింగ్
ముంబై : బాలీవుడ్ హీరోయిన్ పేరుతో ఉన్న నకిలీ ఆధార్ కార్డును ఉపయోగించి ఐదు నక్షత్రాల హోటల్లో గదిని బుక్ చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం సబర్బన్ బాంద్రాలోని ప్లష్ హోటల్లో జరిగింది ఈ సంఘటన. ‘కాబిల్’, ‘హేట్ స్టోరీ 4’ ఫేం ఊర్వశి రౌతెలా ఒక కార్యక్రమానికి హాజరవడం కోసం ప్లష్ హోటల్‌కు వచ్చింది. కార్యక్రమం ముగించుకుని వెళ్తుండగా హోటల్ సిబ్బంది వచ్చి మీ పేరుతో గది బుక్ చేశారని చెప్పారు. రౌతెలా తన సెక్రటరీని పిలిచి అడగ్గా తాను ఏ గది బుక్ చేయలేదన్నాడు. ఆమె వెంటనే హోటల్లోని బుకింగ్ రికార్డును పరిశీలించగా తన పేరుతో ఉన్న నకిలీ ఆధార్‌కార్డు సాయంతో ఎవరో గదిని బుక్ చేసినట్లు వెల్లడైంది. ఈ విషయం గురించి ఆమె బాంద్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐపీసీ సెక్షన్ 420 (మోసం), 468 (ఫోర్జరీ), ఐటీ ఆక్ట్ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తి ఆన్లైన్లో రౌతెలా పేరుతో ఉన్ననకిలీ ఆధార్‌కార్డుతో హోటల్ గదిని బుక్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. -
హృతిక్ ఓ పవర్ హౌస్: కరణ్
ముంబయి: హృతిక్ రోషన్ తాజా చిత్రం ‘కాబిల్’ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ ఈ సినిమాపై శుక్రవారం ట్విట్టర్లో స్పందించారు. సినిమాలో తన భార్య హత్య కేసును ఛేదించే అంధ వ్యక్తిగా హృతిక్ నటన అద్భుతమని కొనియాడారు. హృతిక్ లో ఒక పవర్ హౌస్ టాలెంట్ ఉందని.. దానికి తగిన ఉదాహరణే ఈ సినిమా అని ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా సంజయ్ గుప్తా దర్శకత్వంలో హృతిక్ రోషన్ నటించిన కాబిల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 25న విడుదలైంది. తెలుగులో బలం పేరుతో ఈ సినిమాను విడుదల చేశారు. As a filmmaker it's exhilarating to watch an actor deliver his best....@iHrithik is a power house talent and is exemplary in #kaabil — Karan Johar (@karanjohar) 26 January 2017 -
ఆ సినిమాకు పాకిస్తాన్ ఓకే!
కరాచీ: హృతిక్ రోషన్ తాజా చిత్రం ‘కాబిల్’ ప్రదర్శనకు పాకిస్తాన్ పచ్చజెండా ఊపింది. ఈ సినిమాను తమ దేశంలో విడుదల చేసేందుకు పాకిస్తాన్ అనుమతి ఇచ్చింది. ప్రధాని నవాజ్ షరీఫ్ ఏర్పాటు చేసిన కమిటీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ) మంజూరు చేసింది. ఈ వారాంతంలో ‘కాబిల్’ పాకిస్తాన్ లో విడుదలకానుంది. సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో నాలుగు నెలలుగా భారత సినిమాల విడుదలపై పాకిస్తాన్ లో నిషేధం కొనసాగుతోంది. షారూఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘రాయిస్’ కూడా పాకిస్తాన్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘సెన్సార్ బోర్డు నుంచి ఎన్ ఓసీ కోసం చూస్తున్నాం. అనుమతి వచ్చిన వెంటనే రాయిస్ సినిమాను విడుదల చేస్తామ’ని హమ్ ఫిలిమ్స్ ప్రతినిధి ఒకరు పీటీఐతో చెప్పారు. రాయిస్ సినిమాలో పాక్ నటి మహిరా ఖాన్ హీరోయిన్ గా నటించింది. పాకిస్తాన్ లో ఈ రెండు సినిమాలు విడుదలైతే మిగతా చిత్రాలకు మార్గం సుగమం అవుతుందని సినీపరిశ్రమలోని వారు అభిప్రాయపడుతున్నారు. రాయిస్, కాబిల్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 25న విడుదలయ్యాయి. -
అంధుడైన హీరోకు వాచీ ఎందుకు?
సంజయ్ గుప్తా దర్శకత్వంలో వస్తున్న కాబిల్ సినిమాలో హృతిక్ రోషన్ ఒక అంధుడి పాత్ర పోషిస్తున్నాడు. హృతిక్ సరసన యామీ గౌతమ్ (ఈమెదీ అంధురాలి పాత్రే) నటిస్తున్న ఈ సినిమాలో అతడు చేతికి వాచీ పెట్టుకుంటాడు. ఈ సినిమా ప్రోమో విడుదల అయినప్పటి నుంచి.. అంధుడి చేతికి వాచీ ఉంటే ఉపయోగం ఏంటి.. అతడు అందులో టైమ్ ఎలా చూసుకుంటాడంటూ దాని మీద సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. వాటికి దర్శకుడు సంజయ్ గుప్తా గట్టి సమాధానమే ఇచ్చారు. '' హృతిక్ కాబిల్ సినిమాలో అంధుడైనా వాచీ ఎందుకు పెట్టుకున్నాడని చాలామంది అడుగుతున్నారు. అయితే వాళ్లు తమ తెలివితేటలు కొంచెం పెంచుకోవాలి. అంధుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వాచీలున్నాయి. వాటిని బ్రెయిలీ వాచీలు అంటారు. అలాగే చూడలేని వారు వాడేందుకు మాట్లాడే వాచీలు కూడా వచ్చాయి. ఈ సినిమాలో హృతిక్ చేతికి పెట్టుకునేది అలాంటి వాచీయే. మేం హోంవర్కు చేసిన తర్వాతే సినిమా తీస్తున్నాం. సినిమా చూసిన తర్వాత.. ఈ వాచీకి సినిమాలో ఎంత ముఖ్యమైన పాత్ర ఉంటుందో మీకే తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు దాని గురించి మీకు చెప్పలేను. సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు చూస్తే.. వేరేవాళ్లు ఎంత కష్టపడి పనిచేసినా, దాన్ని వెంటనే నీరుగార్చడానికి జనం సిద్ధంగా ఉంటారని అర్థమవుతోంది'' అని ఆయన అన్నారు.