kadapa RTC bus stand
-
మెరుగైన వసతులు కల్పిస్తాం
అది కడపలోని ఆర్టీసీ బస్టాండు... ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతం ... ఏపీఎస్ ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ( సీటీఎం) ఎంవీ ప్రభాకర్‌రెడ్డి బస్టాండుకు చేరుకున్నారు. ఆదివారం సాక్షి వీఐపీ రిపోర్టర్‌గా మారిన ఆయన పలు సమస్యలు తెలుసుకున్నారు. ప్రయాణీకులను పలకరించారు. ఆర్టీసీ మహిళా కండక్టర్లతో మాట్లాడారు. నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. ఏం చేస్తే బాగుంటుందని అడిగారు. స్టాల్స్ వద్దకు వెళ్లి వాటర్ బాటిళ్లు, శీతల పానీయాలు ఎమ్మార్పీ ధరలకు అమ్ముతున్నారా? లేదా? అని ప్రశ్నించారు. రిజర్వేషన్, విచారణ కేంద్రం, కంట్రోల్ పాయింట్.. ఇలా అన్ని ప్రాంతాల్లో సమస్యలను తెలుసుకున్నారు. మహిళలకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దామని.. అందరూ సహకరించాలని కోరారు. మెరుగైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కడప ఆర్టీసీ బస్టాండులో నేరుగా ప్రొద్దుటూరు డిపోకు చెందిన బస్సు వద్దకు వచ్చారు. (అంతలోనే బస్సు వద్ద ఉరవకొండ....అనంతపురం అంటూ కేక పెడుతున్న మహిళా కండక్టర్‌తో) సీటీఎం ప్రభాకర్‌రెడ్డి : ఏమ్మా నీ పేరేంటి? ఎంతమంది పిల్లలు. ఏం చేస్తున్నారు? ఆర్టీసీలో ఏమైనా ఇబ్బందులున్నాయా? మీకు సమస్యలు ఎప్పుడు ఎదురవుతున్నాయి? డ్రైవర్లు మీతో సక్రమంగా నడుచుకుంటున్నారా?) రామతులశమ్మ (ఉరవకొండ ఆర్టీసీ డిపో కండక్టర్) : నా పేరు రామతులశమ్మ. నాకిద్దరు పిల్లలు. ఇద్దరిలో ఒకరు ఎంటెక్ చేసి జెన్కో పనిచేస్తుండగా, మరొకరు స్టేట్ బ్యాంకులో పనిచేస్తున్నారు. ఆర్టీసీలో ప్రయాణీకులకు చిల్లరకు సంబంధించిన అంశంపైనే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. డ్రైవర్లంటే వారితో మేమే సమన్వయం చేసుకుని ముందుకు వెళుతున్నాం. కొంతమంది తాగి వస్తుంటారు. సర్దుకుపోతున్నాం. అయినా మాట వినరు. వారి చేష్టలతో మాకే విసుగొస్తోంది. రద్దీ సమయంలో ఇబ్బందులు వస్తుంటాయి. ఎలాగోలా సర్దుబాటు చేసుకుంటున్నాం. (సమీపంలో ఉన్న బస్సు కోసం వేచివున్న ప్రయాణీకురాలితో) సీటీఎం ప్రభాకర్‌రెడ్డి : ఏమ్మా ఇక్కడున్నావ్! ఎక్కడికి వెళ్లాలి? ఎంత సేపటి నుంచి ఇక్కడ కూర్చొన్నావు. బస్సులు సమయానికి వస్తున్నాయా, రాలేదా? ఆకతాయిల సమస్యలేమైనా ఉన్నాయా? శాంతి : మాది హిందూపురం. బస్సు కోసం ఇక్కడ కూర్చొన్నాను. నిన్నా చూశా....ఈరోజు చూశా... విచారణ కేంద్రంలో బస్సు గురించి అడిగాను. వారు చెప్పిన సమయానికి బస్సులు వచ్చాయి. ఎలాంటి ఇబ్బంది లేదు. ఆర్టీసీ బస్టాండులో కూడా ఆకతాయిల సమస్య, ఇతర ఎలాంటి సమస్యలు లేవు. (బస్టాండులో ఎదురుగా నడిచి వస్తున్న వికలాంగుడితో) సీటీఎం ప్రభాకర్‌రెడ్డి : ఏమయ్యా...ఎక్కడికెళ్లాలి? ఏం చేస్తావు. ఎంతసేపటి నుంచి ఇక్కడున్నావు. బస్సులో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? వేణుగోపాల్ : సార్ మాది అనంతపురం జిల్లా. నేను హిందూపురం ఏడీజే కోర్టులో పనిచేస్తున్నాను. పనిమీద ఇక్కడికి వచ్చి బస్సుకోసం ఎదురు చూస్తున్నాను. బస్సులో నాకెప్పుడూ కూడా సీటు గురించి ఇబ్బంది ఎదురు కాలేదు. (ఇంతలోనే బస్టాండులో నడుస్తూ విచారణ కేంద్రంలో ఉన్న మహిళా అనౌన్సర్ దగ్గరికి వెళ్లి) సీటీఓ ప్రభాకర్‌రెడ్డి : నీ పేరేంటి? ఎంతకాలం నుంచి ఉన్నావు? ఉద్యోగం ఎలా ఉంది. బస్సుల వివరాలు మైకు ద్వారా చెప్పేటపుడు ప్రయాణీకులనుంచి వస్తున్న ఇబ్బందులేంటి? డ్రైవర్లు, కండక్టర్లు సమాచారం ఇస్తున్నారా? ప్రియాంక : నేను ఈ మధ్య కాలంలోనే జాయిన్ అయ్యాను. కొంతమంది ప్రయాణీకులు ఆవేశంతో ఉన్నారు. ఒకటి, రెండుసార్లు చెప్పినా పదేపదే వచ్చి అడుగుతుంటారు. కొంతమంది డ్రింకర్స్ అడిగిందే అడుగుతుంటారు. కొంత ఇబ్బందిగా ఉంటుంది. డ్రైవర్లు, కండక్టర్లు వచ్చిబస్సుకు సంబంధించిన సమాచారం ఇస్తున్నారు. (విచారణ కేంద్రం వద్దకు బస్సుకు సంబంధించిన సమాచారం కోసం వచ్చిన వికలాంగుడితో) సీటీఓ ప్రభాకర్‌రెడ్డి : ఏం బాబూ ఏ ఊరు మీది? బస్సులో ఎక్కువ తిరుగుతుంటావా? వికలాంగులకు సీట్లు కేటాయించాం. ఎవరైనా ప్రయాణీకులు కూర్చొన్నా నీకు ఇస్తున్నారా? జాషువా (ఎర్రగుంట్ల) : సార్ వికలాంగుల పట్ల కొంతమంది కండక్టర్లు, సిబ్బంది నీచంగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా చిల్లర లేకుండా ఎలా ఎక్కుతావంటూ కోపంతో ఊగి పోతున్నారు. సపరేట్ సీట్లు వికలాంగులకు ఉన్నా ఎవరూ ఇవ్వడం లేదు సార్. సీటీఓ ప్రభాకర్‌రెడ్డి : బస్సులు సక్రమంగా నడుపుతున్నారా? పరిశుభ్రత, మురుగుదొడ్లు శుభ్రం చేయిస్తున్నారా? బస్టాండ్లలో ఎమ్మార్పీ ధరలకే అమ్ముతున్నారా? విజయమ్మ (ట్రాఫిక్ ఇన్స్పెక్టర్) : బస్సులను సక్రమంగా సమయపాలన పాటించేలా పంపిస్తున్నాం. పరిశుభ్రత విషయంలో ప్రత్యేకంగా ఎప్పటిప్పుడు చర్యలు చేపడుతున్నాం. మరుగుదొడ్లను వినియోగించే వారి నుంచి అధిక మొత్తం వసూలు చేస్తే కాంట్రాక్టర్‌కు ఫైన్ వేస్తాం. ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువకు అమ్మితే చర్యలు తీసుకుంటున్నాం. సీటీఓ ప్రభాకర్‌రెడ్డి : బస్టాండులో ఏవైనా సమస్యలున్నాయా? బస్సులు సమయానికి రాక ఇబ్బందులు ఉన్నాయా? పండుగ వేళల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందిగదా మీరెలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కన్యాకుమారి (డిపో మేనేజర్) : కడప డిపో పరిధిలో బస్సులు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం. పండుగ వేళల్లో రద్దీకి అనుగుణంగా స్పెషల్ బస్సులు వేస్తున్నాం. ఇందులో సాధారణ ఛార్జీలు కాకుండా 50 శాతం అదనంగా వసూలు చేస్తున్నాం. ఆర్టీసీ బస్టాండును పరిశుభ్రంగా ఉంచడంతోపాటు ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటున్నాం. (కంట్రోల్ పాయింట్ వద్దనున్న డ్రైవర్లతో) సీటీఓ ప్రభాకర్‌రెడ్డి : ఏమయ్యా? డ్రైవర్లకు ఏమైనా జాగ్రత్తలు చెబుతున్నారా? బ్రీత్ ఎనలేజర్తో పరీక్షిస్తున్నారా? ఎస్జీ పీర్ (బద్వేలు) : సార్, కంట్రోల్ పాయింట్ వద్ద చార్టులో ప్రమాద సూచికలను చూపిస్తున్నారు. తదనుగుణంగా ఆయా రూట్లలో వెళ్లేటపుడు జాగ్రత్తగా వెళ్లేలా ఇక్కడ చెబుతున్నారు. అంతేకాకుండా డ్యూటీకి వెళ్లే సమయంలో ఖచ్చితంగా ఇక్కడ బ్రీత్ ఎనలైజర్‌తో చెక్ చేసి మమ్మలను పంపిస్తున్నారు. (అంతలోనే వచ్చిన బస్సులోకి ఎక్కి మహిళా ప్రయాణీకురాలితో) సీటీఓ ప్రభాకర్‌రెడ్డి : ఏమమ్మా? ఏ పేరేంటి ఎక్కడికి వెళుతున్నావు? మహిళా సీట్లలో వారినే కూర్చొబెట్టాలని ఉంది? అందుకు అనుగుణంగా ఎవరైనా కూర్చొన్నా సీట్లు ఇస్తున్నారా? ప్రయాణీకురాలు : నా పేరు పద్మ. నేను ప్రొద్దుటూరుకు వెళుతున్నా. అప్పుడప్పుడూ బంధువుల ఇంటికి, ఇతరత్రా పనులపై ప్రయాణిస్తుంటాను. లేడీస్ సీట్లు అనగానే లేచి ఇస్తున్నారు. ఇప్పటివరకైతే ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం.. జిల్లాలోని ఎనిమిది డిపోల్లో సుమారు 950 బస్సులు తిరుగుతున్నాయి. సుమారు 250 మంది మహిళా కండక్టర్లు పనిచేస్తుండగా, మరో 100 మందికి పైగా మహిళా ఉద్యోగులు ఆర్టీసీలో పనిచేస్తున్నారు. మహిళలకు ఎదురవుతున్న సమస్యలను వీఐపీ రిపోర్టర్ ద్వారా తెలుసుకున్నాం. సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని సీటీఓ, వీఐపీ రిపోర్టర్ ప్రభాకర్‌రెడ్డి హామీ ఇచ్చారు. - బస్టాండ్లలో మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవడంతోపాటు అధిక మొత్తాలు వసూలు చేస్తే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు కేటాయించిన సీట్లలోవారినే కూర్చోబెట్టేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. చిల్లర సమస్యపై కూడా ఆలోచిస్తామన్నారు. -
కౌంటింగ్.. కసరత్తు
సాక్షి, కడప: జిల్లాలో మున్సిపోల్స్ ఫలితాలకు తెరపడనుంది. కడప ఆర్టీసీ బస్టాండు సమీపంలోని నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో కడప కార్పొరేషన్, ప్రొద్దుటూరు, రాయచోటి, పులివెందుల, బద్వేలు, మైదుకూరు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీలకు సంబంధించి సోమవారం కౌంటింగ్ జరగనుంది. వీటన్నింటికీ మార్చి 30వ తేదిన పోలింగ్ జరిగింది. ఫలితాలకోసం అభ్యర్థులు, ఓటర్లు 42 రోజులపాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఫలితాలపై కాకిలెక్కలు, అంచనాలతో కాలం గడిపారు. ఎట్టకేలకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. కడప కార్పొరేషన్‌తోపాటు అన్ని మున్సిపాలిటీలకు నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని రూములలో వేర్వేరుగా కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. పోలింగ్ స్టేషన్లను బట్టి టేబుళ్లను ఏర్పాటు చేశారు. అత్యధికంగా కడపలో 13 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 245 పోలింగ్ కేంద్రాలు ఉండడంతో 19 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. ఈ ఫలితం మధ్యాహ్నం 12-1 గంట ప్రాంతంలో వెల్లడి కానుంది. మొట్టమొదటి ఫలితం ఎర్రగుంట్ల మున్సిపాలిటీకి సంబంధించి ఉదయం గంటలోపే వెల్లడి కానుంది. దీని లెక్కింపు నాలుగు రౌండ్లలోనే ముగియనుంది. మొట్టమొదట పోస్టల్ బ్యాలెట్లను ఎన్నికల అధికారి టేబుల్‌పైనే లెక్కించనున్నారు. ఐదు నిమిషాల్లోపే ఒక రౌండ్ లెక్కింపు ఒక్కో రౌండ్ లెక్కింపు ఐదు నిమిషాలలోపే పూర్తి కానుంది. ఈవీఎంలు తీసుకుని రావడం, వాటి సీలు తొలగించడం, అభ్యర్థుల సంతకాల కోసమే కొద్దిమేర సమయం పట్టే అవకాశం ఉంది. ఒక రౌండ్ ఫలితానికి సంబంధించి రిజల్ట్ బటన్ నొక్కగానే ఒక్క నిమిషంలోపే ఫలితం రానుంది. బద్వేలు ఆరు రౌండ్లలో, మైదుకూరు ఐదు రౌండ్లు, జమ్మలమడుగు ఐదు రౌండ్లు, ప్రొద్దుటూరు పది రౌండ్లు, రాయచోటి ఎనిమిది రౌండ్లు, పులివెందులకు సంబంధించి రెండు హాళ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. కడప కార్పొరేషన్లో లెక్కింపు డివిజన్‌కు ఒకటి చొప్పున 13 టేబుళ్ల ద్వారా 245 పోలింగ్ స్టేషన్ల కౌంటింగ్ 19 రౌండ్లలో పూర్తి కానుంది. ఇందుకు సంబంధించి అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఉదయం ఆరు గంటల్లోపే కౌంటింగ్ కేంద్రానికి ఈవీఎంలు తరలింపు కొత్త కలెక్టరేట్ స్ట్రాంగ్ రూము నుంచి తెల్లవారుజామున 3.00 గంటలకే అభ్యర్థుల సమక్షంలో సీలు తీసి ఈవీఎంలను బాక్సుల్లో పెట్టి ఆర్టీసీ డీజీటీ ద్వారా కౌంటింగ్ కేంద్రంలోని తాత్కాలిక స్ట్రాంగ్ రూములకు ఆరు గంటల్లోపే తరలిస్తారు. ఒక్కో రౌండ్‌కు సంబంధించిన ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రానికి తరలించి వాటి లెక్కింపు పూర్తి కాగానే వాటిని మళ్లీ స్ట్రాంగ్ రూములోకి తీసుకుని వస్తారు. తర్వాత రెండవ రౌండ్‌కు సంబంధించిన ఈవీఎంలను తరలిస్తారు. ఏర్పాట్లను పరిశీలించిన ఏజేసీ ఓట్ల లెక్కింపునకు సంబంధించి నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాట్లను ఏజేసీ సుదర్శన్‌రెడ్డి ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బందికి సూచించారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఒక్కో రౌండుకు సంబంధించి బరిలో ఉన్న కార్పొరేటర్, కౌన్సిలర్ అభ్యర్థులకు మాత్రమే అనుమతిస్తారు. సెల్ఫోన్లను లోనికి తీసుకుని రాకూడదు. ఆదివారం సాయంత్రం నుంచే కళాశాల ప్రాంగణంలో పోలీసులు విసృ్తత బందోబస్తును ఏర్పాటు చేశారు. బందోబస్తు ఏర్పాట్లను కడప డీఎస్పీ రాజేశ్వరరెడ్డి పర్యవేక్షించారు. కౌంటింగ్ జరిగే సమయంలో ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్కోన శశిధర్, ఎన్నికల పరిశీలకులు మురళీధర్‌రెడ్డి, బాల దిగంబర్, జేసీ రామారావు, ఏజేసీ సుదర్శన్‌రెడ్డితోపాటు సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీఓలు ఫలితాల లెక్కింపును పరిశీలించనున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల లెక్కింపునకు ఏర్పాట్లు ఈనెల 13వ తేదీన జరిగే ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల లెక్కింపునకు సంబంధించి ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. జమ్మలమడుగు డివిజన్‌కు సంబంధించి కడపలోని మదీనా ఇంజనీరింగ్ కళాశాలలో, రాజంపేట డివిజన్‌కు సంబంధించి శ్రీనివాస ఇంజనీరింగ్కళాశాలలో, కడప డివిజన్‌కు సంబంధించి కేశవరెడ్డి స్కూలులో కౌంటింగ్ జరగనుంది, కౌటింగ్ సిబ్బందికి ఆదివారం శిక్షణను ఇచ్చారు. ఒక్కో ఎంపీటీసీకి ఒక్కొక్క టేబుల్ చొప్పున ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపును చేపడతారు. ఎంపీటీసీ ఫలితాలు దాదాపు మధ్యాహ్నం లోపే వెల్లడి కానున్నాయి. జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి ఒక్కో టేబుల్‌కు 1000 ఓట్ల చొప్పున లెక్కిస్తారు. ఒక టేబుల్‌కు ఒక ఏజెంటును మాత్రమే అనుమతిస్తారు.