యూవీ అవుటవ్వగానే.. గుండెపగిలింది : కైఫ్
నాట్‌వెస్ట్ సిరీస్-2002 గుర్తుందా! ఫైనల్లో ఇంగ్లండ్‌పై టీమిండియా 326 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి చరిత్ర సృష్టించింది. టాప్ ఆర్డర్ విఫలమైన ఈ ఉత్కంఠ పోరులో మహ్మద్ కైఫ్ (87), యువరాజ్ సింగ్ (69) అద్భుత బ్యాటింగ్‌తో భారత్ మ్యాచ్ గెలిచింది. నాట్‌వెస్ట్ సిరీస్ విజయానంతరం అప్పటి కెప్టెన్, టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ షర్ట్ విప్పి గ్యాలరీలో సందడి చేయడం ప్రతీ క్రికెట్ అభిమానికి ఓ మధురానుభూతి. నాటి రోజులను ఇన్స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో మహ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్‌లు గుర్తు చేసుకుంటూ.. పలు ఆసక్తికర విషయాలని అభిమానులతో పంచుకున్నారు.
నాడు ఇంగ్లడ్ గడ్డ మీద 326పరుగుల లక్ష్య ఛేదనలో 145 పరుగుకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో భారత్ పడింది. ఆ సమయంలో క్రీజ్‌లో ఉన్న యూవీ, కైఫ్‌లు అద్భుత ప్రదర్శనతో గెలుపుపై ఆశలు చిగురించేలా చేశారు. అయితే 69 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద యువీ ఔటయ్యాడు. ‘యూవీ, నేను క్రీజ్‌లో చివరి వరకు ఉంటే మ్యాచ్ గెలువొచ్చు అనుకున్నా. కానీ, యూవీ అవుటవ్వడంతో ఒక్కసారిగా గుండెపగిలినంత పనయ్యింది. గెలుపు దాదాపు అసాధ్యం అనుకున్నా’ అని నాటి రోజులను కైఫ్ గుర్తు చేసుకున్నారు. అప్పటికీ 59 పరుగుల లక్ష్యం భారత్ ముందు ఉంది. టెయిలెండర్లతో కలిసి బాధ్యతాయుతంగా కైఫ్ బ్యాటింగ్ చేసి, మరో మూడు బంతులు మిగిలుండగానే భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. భారత్ 8 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. కైఫ్ 87 పరుగులు చేసి నాట్ వెస్ట్ సిరీస్ ను భారత్‌కు అందించాడు.
ఫీల్డింగ్‌లో చిరుతలా కదులుతూ భారత్‌కు మహ్మద్ కైఫ్ ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడని యూవీ ఇన్స్టాగ్రామ్లైవ్ చాట్‌లో పొగడ్తలతో ముంచెత్తాడు. పాయింట్, కవర్లలో తామిద్దరం కలిసి భారత ఫీల్డింగ్ విభాగంలో ఒక కొత్త సరళిని తీసుకొచ్చామన్నారు. ఇప్పుడున్న భారత జట్టులో మంచి ఫీల్డర్లున్నారని, కానీ భారత జట్టు ఫీల్డింగ్‌లో ఓ కొత్త ఒరవడి మాత్రం తామే తీసుకొచ్చామని నవ్వుతూ యూవీ చెప్పారు.