ఇనుగుర్తిలో కాకతీయుల ఆనవాళ్లు
బయటపడిన కల్యాణ మండపం, పూల చిత్రాల రాళ్లు
కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తిలో కాకతీయుల ఆనవాళ్లు బయటపడ్డాయి. గ్రామానికి చెందిన వేముల చిన్నయాదగిరి ఇంట్లో ఇంకుడుగుంత కోసం తవ్వుతుండగా, వెడల్పు రాయి తగిలింది. దీంతో వేరే పక్క నుంచి తవ్వకాలు జరిపారు. మళ్లీ రాతిబండ వచ్చింది. ఈ మేరకు జేసీబీలో ఆ రాయిని బయటకు తీశారు. ఈ క్రమంలో అవి కాకతీయుల నాటి రాతి నిర్మాణాలుగా గుర్తించారు.
సుమారు 6 ఫీట్ల వైశాల్యంతో రెండు ఫీట్ల మందంతో ఉన్న ఈ రాతి విగ్రహం పైన వృత్తాకారంలో చెక్కిన తీరు చూసి గర్భగుడిలోని కల్యాణ మండపాల రాయిగా భావిస్తున్నారు. ఈ రాయితో పాటు మరో రెండు చిన్న రాళ్లు వాటిపై పుప్పాల చిత్రాలు ఉన్నాయి. ఈ బండరాయి కింద పెద్ద మొత్తంలో ఇసుక ఉండడం, మరో రాయి కూడా తీయరాని విధంగా ఉండడంతో ఇక్కడ కాకతీయుల నాటి నిర్మాణాలు ఉన్నట్లు భావిస్తున్నారు.