Kakinada Anchorage Port
-
Andhra Pradesh: ఉపాధికి స‘పోర్టు’
కాకినాడ నుంచి సాక్షి ప్రతినిధి చంద్రశేఖర్ మైలవరపు: రాష్ట్రంలో వీలున్న చోటల్లా విస్తృతంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఇందులో భాగంగా కాకినాడ యాంకరేజ్ పోర్టు సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా అదనంగా ఏడు వేల మందికి ఉపాధి కల్పించేందుకు శ్రీకారం చుట్టింది. బియ్యం, మొక్కజొన్న, సిమెంట్ వంటి ఉత్పత్తులను తక్కువ ఖర్చుతో విదేశాలకు సులభంగా ఎగుమతి చేసుకునే వెసులుబాటు ఉండటం ఈ పోర్టు ప్రత్యేకత. దీని పనితీరు ఇతర పోర్టులకు భిన్నంగా ఉంటుంది. ఇతర మోడరన్ పోర్టులతో పోలిస్తే ఇందులో మానవ వనరుల వినియోగం చాలా అధికం. డీప్ వాటర్ పోర్టుల్లో నేరుగా పోర్టు నుంచే సరుకు రవాణా చేసుకునే వీలుంటుంది. కానీ.. యాంకరేజ్ పోర్టులో ఓడలు సముద్రం మధ్యలో లంగరు వేసి ఉంటాయి. వాటి వద్దకు చిన్న పడవల్లో సరుకును తీసుకెళ్లి నింపుతారు. ఇందుకోసం భారీ స్థాయిలో మానవ వనరుల వినియోగం అవసరమవుతుంది. ప్రస్తుతం కాకినాడ యాంకరేజ్ పోర్టు ప్రత్యక్షంగా.. పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. కానీ.. కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వ నిరాదరణకు గురైంది. యాంకరేజ్ పోర్టును విస్తరిస్తే మరింత మందికి ఉపాధి లభిస్తుందన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు ముందుకు వేశారు. సాగర్మాల పథకం కింద కాకినాడ యాంకరేజ్ పోర్టు సామర్థ్యాన్ని 4 మిలియన్ టన్నుల నుంచి 5 మిలియన్ టన్నులకు పెంచడం ద్వారా మరో 7 వేల మందికి ఉపాధి కల్పించనున్నారు. అదనంగా జెట్టీ పొడవు 260 మీటర్లు పెంపు కాకినాడ యాంకరేజ్ పోర్టును రూ.91.85 కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఆధునికీకరించనుంది. ఈ నిధులతో సరుకు రవాణా బోట్లు నిలుపుకునే జెట్టీ పొడవు, కాల్వ లోతు, సరుకు లోడింగ్ పాయింట్లను పెంచడం, అంతర్గత రహదారుల నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నారు. ప్రస్తుత యాంకరేజ్ పోర్టు జెట్టీ పొడవు 930 మీటర్లు ఉండగా.. దీనికి అదనంగా 260 మీటర్లు పెంచడం ద్వారా మొత్తం జెట్టీ పొడవును 1,190 మీటర్లకు పెంచనున్నారు. ఇంతకాలం జెట్టీల ద్వారా మానవుల సహాయంతో సరుకును లోడింగ్ అన్లోడింగ్ మాత్రమే చేసేవారు. ఇప్పుడు కొత్తగా 5 చోట్ల యంత్రాల సహయంతో లోడింగ్ చేసేలా పాయింటన్లు ఆధునికీకరిస్తున్నారు. కాలువ లోతు పెరిగేలా డ్రెడ్జింగ్ పోర్టులో బోట్లు నిలుపుకునే కాలువ పూడుకుపోవడంతో లోతు తగ్గింది. దీన్ని 2.5 మీటర్ల లోతు ఉండే విధంగా డ్రెడ్జింగ్ చేయడంతోపాటు పోర్టు నుంచి కాకినాడ జగన్నాథపురం వరకు ఉన్న వాణిజ్య కాలువ లోతును పెంచి గట్లను పటిష్టం చేయనున్నారు. పోర్టును అనుసంధానించే ప్రధాన రహదారితో పాటు, పోర్టు లోపల అంతర్గత రహదారులను అభివృద్ధి చేయనున్నారు. ఈ విస్తరణ పనుల టెండర్ దక్కించుకున్న సంస్థ వేగంగా పనులు చేపడుతోంది. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కాకినాడ యాంకరేజ్ పోర్టు 1,150 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ పోర్టు విస్తరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా పెరగనుంది. 2022–23 సంవత్సరంలో యాంకరేజ్ పోర్టు 3.87 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయడం ద్వారా రూ.63 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. టర్న్ ఎరౌండ్ తగ్గించడమే లక్ష్యం అత్యధిక మందికి ఉపాధి కల్పించే యాంకరేజ్ పోర్టు ఆధునికీకరణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. బియ్యం, మొక్కజొన్న, సిమెంట్ వంటి ఎగుమతులకు అనుకూలంగా ఉండే కాకినాడ యాంకరేజ్ పోర్టులో ఒక ఓడలో సరుకు నింపుకుని వెళ్లడానికి కనీసం 28 నుంచి 30 రోజులు (టర్న్ ఎరౌండ్ టైమ్)గా ఉంది. ఆధునికీకరణ చేయడం ద్వారా ఈ సమయాన్ని కనీసం 15 రోజులకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. టర్న్ ఎరౌండ్ సమయం సగానికి తగ్గించగలిగితే కాకినాడ యాంకరేజ్ పోర్టు ఎగుమతి సామర్థ్యం పెరగడమే కాకుండా ఎగుమతిదారులకు వ్యయం కూడా తగ్గుతుంది. – కల్నల్ రవీంద్రనాథ్‌రెడ్డి, డిప్యూటీ సీఈవో, ఏపీ మారిటైమ్ బోర్డు చిన్న ఎగుమతిదారులకు ప్రయోజనం రాష్ట్ర ప్రభుత్వం పోర్టుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో మన రాష్ట్రం సముద్ర వాణిజ్యానికి వేదికగా మారుతోంది. పురాతన కాలం నాటి కాకినాడ డీప్ వాటర్ పోర్టును ఆధునికీకరించడం స్థానిక ఎగుమతిదారులకు చాలా ప్రయోజనం కలిగిస్తుంది. డీప్ వాటర్ పోర్టులతో పోలిస్తే యాంకరేజ్ పోర్టుల్లో షిప్ ల్యాండింగ్ చార్జీలు చాలా తక్కువ. డీప్ వాటర్ చార్జీల్లో సగం వ్యయంతోనే సరుకులు ఎగుమతి చేయవచ్చు. ఇది చిన్న ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. – రఘు, ప్రెసిడెంట్, కాకినాడ చాంబర్ ఆఫ్ కామర్స్ -
యాంకరేజి పోర్టులో మంత్రి అమర్నాథ్ శంకుస్థాపనలు
సాక్షి, కాకినాడ: కార్గో ఎగుమతుల వార్షిక సామర్థ్యాన్ని 3 మిలియన్ టన్నులకు పెంచేందుకు సాగరమాల కార్యక్రమం కింద రూ.91 కోట్లతో మంజూరు చేసిన కాకినాడ యాంకరేజి పోర్టు అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ పనులకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు రాజా, వేణుగోపాలకృష్ణ, ఎంపీ గీత, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా పోర్టులో రెండు మెకానికల్ కార్గో హ్యాండ్లింగ్ వార్ఫులు, న్యూ పోర్టు ఏరియాలో 5 అదనపు లోడింగ్ పాయింట్ల నిర్మాణం, పోర్టు అనుబంధ, అంతర్గత రహదారుల అభివృద్ధి, కమర్షియల్ కెనాల్ గ్రోయిన్లు, రివిట్మెంట్ల మరమ్మతులు, కమర్షియల్, అప్రోచ్ కెనాల్ డ్రెడ్జింగ్ పనులు చేపట్టనున్నారు. ఈ పనులు చేసేందుకు హైదరాబాద్‌ఉ చెందిన విశ్వసముద్ర హోల్డింగ్స్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఏడాది కాలంలో ఈ పనులు పూర్తి చేయనున్నారు. చదవండి: (National Highways: రాయలసీమకు కొత్తగా 9 జాతీయ రహదారులు) -
కాకినాడ యాంకరేజి పోర్టు: ఎక్స్‌పోర్ట్‌లో నెంబర్ 1
Kakinada Anchorage Port బియ్యం ఎగుమతులకు కాకినాడ యాంకరేజ్ పోర్టు కేరాఫ్ ఆడ్రస్‌గా నిలించింది. ఆఫ్రికా దేశాలకు ఎగుమతుల విషయంలో దేశ వ్యాప్తంగా ఉన్న 22 మేజర్, 205 నాన్‌మేజర్ పోర్టుల్లో ఈ పోర్టు మొదటి స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. కలకత్తా, నెల్లూరు, వైజాగ్ తదితర పోర్టుల నుంచి కొంత మేర ఎక్స్పోర్ట్ అవుతున్నా.. 90 శాతం ఎగుమతి అవుతున్న జాబితాలో కాకినాడ పోర్ట్ నిలించింది. ఇక్కడి నుంచి ఏటా రూ.వందల కోట్లు విలువ చేసే సరుకు (బియ్యం, సిమెంట్) ఎక్స్పోర్ట్ అవుతుంటాయంటే అతిశయోత్తి కాదు. వ్యాపారులకు అవసరమైన రవాణా, గోడౌన్, లోడింగ్, అన్లోడింగ్ సదుపాయం, కార్మికులు అందుబాటులో ఉండటంతో ఇక్కడి నుంచి ఎగుమతులు చేసేందుకు ఉత్సాహం చూపుతుంటారు. – సాక్షి, కాకినాడ ఇదీ సంగతి తూర్పు గోదావరి జిల్లాలో సుదీర్ఘ సాగతీరం ఉంది. సముద్ర రవాణాకు అత్యంత అనుకూలమైన ప్రాంతం. ఇక్కడి తీరంలో రెండు పోర్టులున్నాయి. కాకినాడ యాంకరేజి పోర్టు ఆంధ్రప్రదేశ్ పోర్టుల శాఖ పర్యవేక్షణలో ఉంది.కాకినాడ డీప్ వాటర్ పోర్టు(సీ పోర్టు) ప్రైవేటు యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తోంది. వీటిలో యాంకరేజి పోర్టు నుంచి బియ్యం దక్షిణాఫ్రికా దేశాలకు, సిమెంటు పోర్డుబ్లెయిర్, అండమాన్‌కు ఎగుమతి చేస్తుంటారు. సీ పోర్టు నుంచి గ్రానైట్ బ్లాకులు, సిమెంటు, పంచదార, లాటరైట్ తదితర నిల్వలు విదేశాలకు ఎగుమతి అవుతాయి. బొగ్గు, ఎరువులు, అల్యూమినియం, పాస్పరిక్ యాసిడ్, వంటనూనెలు దిగుమతి అవుతుంటాయి. ఏటా రూ.కోట్లలో ఎగుమతులు కాకినాడ యాంకరేజి పోర్టు నుంచి ఏటా కోట్ల రూపాయల విలువ చేసే సరుకు సౌతాఫ్రికన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.5,104 కోట్లు విలువ చేసే 28,21,222 మెట్రిక్ టన్నుల సరుకు ఎగుమతి చేశారు. ఫలితంగా ప్రభుత్వానికి రూ.49.87 కోట్ల ఆదాయం సమకూరింది. ఎగుమతి సరుకులో ఒక్క బియ్యమే 27,91,769 మెట్రిక్ టన్నులు. సిమెంట్ 29,453 మెట్రిక్ టన్నులు ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలల వ్యవధిలోనే 11,20,140 మెట్రిక్ టన్నుల బియ్యం, 23,610 మెట్రిక్ టన్నుల సిమెంట్ ఎగుమతి చేశారు. తద్వారా ప్రభుత్వానికి రూ.11.02 కోట్ల ఆదాయం వచ్చినట్లు పోర్టు అధికారులు వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలోని ఐదు మైనర్ పోర్టుల ద్వారా ప్రభుత్వానికి రూ.285.60 కోట్లు ఆదాయం రాగా.. అందులో కాకినాడలో పోర్టు నుంచే రూ.179.73 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రభుత్వ ప్రోత్సాహం గతేడాది కరోనా కారణంగా ఎగుమతులు భారీగా తగ్గాయి. రోజుకు 10 వేల మంది కూలీలు పోర్టులో పని చేయాల్సి ఉండగా 3 వేల మంది మాత్రమే హాజరయ్యేవారు. వెరసి ఎగుమతులు, దిగుమతులకు విఘాతం ఏర్పడింది. ఇతర ప్రాంతాల నుంచి బియ్యం రవాణాకు అవరోధం ఏర్పడింది. ఈసారి ప్రభుత్వం వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ఎలాంటి ఆటంకం కలగకుండా మినహాయింపు ఇవ్వడంతో బియ్యం ఎగుమతులు ఊపందుకున్నాయి. అనుకూల వాతావరణం ∙జిల్లాలో బియ్యం ఎగుమతులు చేసే వ్యాపారులకు అనుకూల వాతావరణం ఉంది. ∙ఎక్కువ శాతం బియ్యం ఛత్తీస్గడ్ నుంచి కాకినాడ పోర్టుకు సరఫరా అవుతాయి. అక్కడి నుంచి పోర్టుకు రవాణా చేసేందుకు అవసరమైన రైల్వే వ్యాగన్ సదుపాయం ఉంది. ∙సరుకు లోడింగ్, అన్‌లోడింగ్‌కు అవసరమైన హమాలీలు అందుబాటులో ఉంటారు. ∙ముడిసరుకు ఉత్పత్తి చేసేందుకు (ధాన్యం ఆడించేందుకు) అవసరమైన బాయిల్డ్ రైస్ మిల్లులు పుష్కలంగా ఉన్నాయి. ∙ఎక్కడా లేని విధంగా 117 మిల్లులు పదుల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ∙బియ్యం ఆడిన తర్వాత ఎగుమతికి జాప్యం జరిగినా సరుకు నిల్వకు వేల సంఖ్యలో గోదాములున్నాయి. ప్రధానంగా సముద్రంలో స్టీమర్‌కు లంగరు వేస్తే నెల రోజులైనా.. అక్కడే సురక్షితంగా ఉంచే సౌకర్యం ఉండటం అనూలించదగ్గ విషయం. ∙సరుకు రవాణాకు లారీలు ఉన్నాయి.