చురుగ్గా జరుగుతున్న కాకినాడ యాంకరేజ్ పోర్టు విస్తరణ పనులు
కాకినాడ నుంచి సాక్షి ప్రతినిధి చంద్రశేఖర్ మైలవరపు: రాష్ట్రంలో వీలున్న చోటల్లా విస్తృతంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఇందులో భాగంగా కాకినాడ యాంకరేజ్ పోర్టు సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా అదనంగా ఏడు వేల మందికి ఉపాధి కల్పించేందుకు శ్రీకారం చుట్టింది. బియ్యం, మొక్కజొన్న, సిమెంట్ వంటి ఉత్పత్తులను తక్కువ ఖర్చుతో విదేశాలకు సులభంగా ఎగుమతి చేసుకునే వెసులుబాటు ఉండటం ఈ పోర్టు ప్రత్యేకత. దీని పనితీరు ఇతర పోర్టులకు భిన్నంగా ఉంటుంది.
ఇతర మోడరన్ పోర్టులతో పోలిస్తే ఇందులో మానవ వనరుల వినియోగం చాలా అధికం. డీప్ వాటర్ పోర్టుల్లో నేరుగా పోర్టు నుంచే సరుకు రవాణా చేసుకునే వీలుంటుంది. కానీ.. యాంకరేజ్ పోర్టులో ఓడలు సముద్రం మధ్యలో లంగరు వేసి ఉంటాయి. వాటి వద్దకు చిన్న పడవల్లో సరుకును తీసుకెళ్లి నింపుతారు. ఇందుకోసం భారీ స్థాయిలో మానవ వనరుల వినియోగం అవసరమవుతుంది.
ప్రస్తుతం కాకినాడ యాంకరేజ్ పోర్టు ప్రత్యక్షంగా.. పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. కానీ.. కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వ నిరాదరణకు గురైంది. యాంకరేజ్ పోర్టును విస్తరిస్తే మరింత మందికి ఉపాధి లభిస్తుందన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు ముందుకు వేశారు. సాగర్‌మాల పథకం కింద కాకినాడ యాంకరేజ్ పోర్టు సామర్థ్యాన్ని 4 మిలియన్ టన్నుల నుంచి 5 మిలియన్ టన్నులకు పెంచడం ద్వారా మరో 7 వేల మందికి ఉపాధి కల్పించనున్నారు.
అదనంగా జెట్టీ పొడవు 260 మీటర్లు పెంపు
కాకినాడ యాంకరేజ్ పోర్టును రూ.91.85 కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఆధునికీకరించనుంది. ఈ నిధులతో సరుకు రవాణా బోట్లు నిలుపుకునే జెట్టీ పొడవు, కాల్వ లోతు, సరుకు లోడింగ్ పాయింట్లను పెంచడం, అంతర్గత రహదారుల నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నారు. ప్రస్తుత యాంకరేజ్ పోర్టు జెట్టీ పొడవు 930 మీటర్లు ఉండగా.. దీనికి అదనంగా 260 మీటర్లు పెంచడం ద్వారా మొత్తం జెట్టీ పొడవును 1,190 మీటర్లకు పెంచనున్నారు.
ఇంతకాలం జెట్టీల ద్వారా మానవుల సహాయంతో సరుకును లోడింగ్ అన్‌లోడింగ్ మాత్రమే చేసేవారు. ఇప్పుడు కొత్తగా 5 చోట్ల యంత్రాల సహయంతో లోడింగ్ చేసేలా పాయింటన్లు ఆధునికీకరిస్తున్నారు.
కాలువ లోతు పెరిగేలా డ్రెడ్జింగ్
పోర్టులో బోట్లు నిలుపుకునే కాలువ పూడుకుపోవడంతో లోతు తగ్గింది. దీన్ని 2.5 మీటర్ల లోతు ఉండే విధంగా డ్రెడ్జింగ్ చేయడంతోపాటు పోర్టు నుంచి కాకినాడ జగన్నాథపురం వరకు ఉన్న వాణిజ్య కాలువ లోతును పెంచి గట్లను పటిష్టం చేయనున్నారు. పోర్టును అనుసంధానించే ప్రధాన రహదారితో పాటు, పోర్టు లోపల అంతర్గత రహదారులను అభివృద్ధి చేయనున్నారు.
ఈ విస్తరణ పనుల టెండర్ దక్కించుకున్న సంస్థ వేగంగా పనులు చేపడుతోంది. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కాకినాడ యాంకరేజ్ పోర్టు 1,150 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ పోర్టు విస్తరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా పెరగనుంది. 2022–23 సంవత్సరంలో యాంకరేజ్ పోర్టు 3.87 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయడం ద్వారా రూ.63 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
టర్న్ ఎరౌండ్ తగ్గించడమే లక్ష్యం
అత్యధిక మందికి ఉపాధి కల్పించే యాంకరేజ్ పోర్టు ఆధునికీకరణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. బియ్యం, మొక్కజొన్న, సిమెంట్ వంటి ఎగుమతులకు అనుకూలంగా ఉండే కాకినాడ యాంకరేజ్ పోర్టులో ఒక ఓడలో సరుకు నింపుకుని వెళ్లడానికి కనీసం 28 నుంచి 30 రోజులు (టర్న్ ఎరౌండ్ టైమ్)గా ఉంది.
ఆధునికీకరణ చేయడం ద్వారా ఈ సమయాన్ని కనీసం 15 రోజులకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. టర్న్ ఎరౌండ్ సమయం సగానికి తగ్గించగలిగితే కాకినాడ యాంకరేజ్ పోర్టు ఎగుమతి సామర్థ్యం పెరగడమే కాకుండా ఎగుమతిదారులకు వ్యయం కూడా తగ్గుతుంది.
– కల్నల్ రవీంద్రనాథ్‌రెడ్డి, డిప్యూటీ సీఈవో, ఏపీ మారిటైమ్ బోర్డు
చిన్న ఎగుమతిదారులకు ప్రయోజనం
రాష్ట్ర ప్రభుత్వం పోర్టుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో మన రాష్ట్రం సముద్ర వాణిజ్యానికి వేదికగా మారుతోంది. పురాతన కాలం నాటి కాకినాడ డీప్ వాటర్ పోర్టును ఆధునికీకరించడం స్థానిక ఎగుమతిదారులకు చాలా ప్రయోజనం కలిగిస్తుంది.
డీప్ వాటర్ పోర్టులతో పోలిస్తే యాంకరేజ్ పోర్టుల్లో షిప్ ల్యాండింగ్ చార్జీలు చాలా తక్కువ. డీప్ వాటర్ చార్జీల్లో సగం వ్యయంతోనే సరుకులు ఎగుమతి చేయవచ్చు. ఇది చిన్న ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
– రఘు, ప్రెసిడెంట్, కాకినాడ చాంబర్ ఆఫ్ కామర్స్
Comments
Please login to add a commentAdd a comment