టీడీపీలో నాలుగు స్తంభాలాట
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: మరి కొద్ది రోజుల్లో ఏర్పాటు కానున్న టీడీపీ మంత్రివర్గంలో చోటు కోసం జిల్లా నుంచి ప్రధానంగా నలుగురు పోటీ పడుతున్నారు. ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. గతం లో పని చేసిన టీడీపీ ప్రభుత్వాల్లో జిల్లాకు పెద్దపీట వేయడం.. ఈసారి ఎన్నికల్లో జిల్లాలో ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎన్నకవడంతో అదే ప్రాధాన్యం దక్కవచ్చని భావిస్తున్నారు. జిల్లాకు కనీసం మూడు పదవులు ఇవ్వవచ్చని ఆశిస్తున్నారు. తొలివిడతలోనే ఇద్దరికి, ఆ తర్వాత మరొకరికి అవకాశమిస్తారని అంటున్నారు. ఈ మేరకు ముఖ్య నేతలు కళా వెంకటరావు, గుండ లక్ష్మీదేవి, శివాజీ, అచ్చెన్నాయుడులు ఎవరిస్థాయిలో వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
మంత్రి పదవులకు డివిజన్‌ను ప్రాతిపదికగా తీసుకుంటారని టీడీపీలో ప్రచారం జరుగుతోంది. అదే ప్రాతిపదిక అయితే పాలకొండ డివిజన్లో పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేనందున ఆ డివిజన్‌కు చెందిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే కళా వెంకటరావుకు అవకాశం కల్పిస్తారని అంటున్నారు. శ్రీకాకుళం డివిజన్ నుంచి గుండ లక్ష్మీదేవి, టెక్కలి డివిజన్ నుంచి గౌతు శివాజీ, అచ్చెన్నాయుడులు తీవ్ర యత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చే సిన రోజే కొందరితో మంత్రివర్గం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతుండగా.. అందులోనే జిల్లా నుంచి ఇద్దరిని తీసుకోవచ్చని అంటున్నారు. సీనియర్ నేతగా కళా వెంకటరావుకు, మహిళల కోటాలో లక్ష్మీదేవికి ఛాన్స్ దక్కవచ్చని తెలుస్తోంది. భారీ మెజార్టీతో గెలుపొందిన లక్ష్మీదేవి సోమవారం చంద్రబాబును కలిసినప్పుడు ‘మీకు మంచి రోజులొచ్చాయమ్మా...’ అని వ్యాఖ్యానించడం దీనికి సంకేతంగా ‘గుండ’ అనుచరులు భావిస్తున్నారు.
మూడో పదవి కోసం పోటీ.....!
టెక్కలి డివిజన్ నుంచి మరో సీనియర్ నేత శివాజీతోపాటు అచ్చెన్నాయుడు మంత్రి పదవి ఆశిస్తున్నారు. తొలిసారి ఎంపీ అయిన రామ్మోహన్నాయుడికి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం రాదని భావిస్తుండడంతో, ఎలాగైనా రాష్ట్ర కేబినెట్లో తనకు అవకాశమివ్వాలని టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు లాబీయింగ్ చేస్తున్నారు. ఆయనకు గౌతు శివాజీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. సీనియారిటీ శివాజీకి ప్లస్ అవుతుండగా.. తాను కూడా మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యానని చెప్పుకొంటూ దాన్ని అధిగమించేందుకు అచ్చెన్న కార్పొరేట్ లాబీ ద్వారా హైదరాబాద్ స్థాయిలో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వీరిలో ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయో.. ఎవరికి మంత్రి యోగం పడుతుందో?